Take a fresh look at your lifestyle.

ఆత్మకూర్‌ ‌వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

  • నలుగురు మృతి – ఏడుగురికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
  • ప్రమాదంపై మంత్రి ఎర్రబెల్లి విచారం
  • మృతుల కుటుంబాలకు సంతాపం

వరంగల్‌ ‌రూరల్‌, ‌మార్చి 19, (ప్రజాతంత్ర ప్రతినిధి) : వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా పరిధిలోని ఆత్మకూరు మండలం పరిధిలోని నీరుకుళ్ళ క్రాస్‌ ‌రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి వరంగల్‌ – ‌భూపాలపల్లి 163 వ జాతీయ రహదారి నీరుకుళ్ళ క్రాస్‌ ‌రోడ్డు వద్ద 19 మంది కూలీలతో వెళ్తున్న ఆటోను తుఫాన్‌ ‌వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారని, మరో ఆరుగురు మహిళలు, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఎంజిఎం హాస్పిటల్‌కు తరలించగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. తుఫాను వాహనం వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టడంతో అందులో ఉన్న వారంతా చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోగా ఆటో నుజ్జునుజ్జయింది.

ములుగు నుంచి వరంగల్‌ ‌వైపు వస్తున్న జీపు, వరంగల్‌ ‌నుంచి ములుగు వైపు వెళ్తున్న ఆటోను జీపు ఢీకొనడంతో ఆటోలో ఉన్న వ్యవసాయ కూలీలు నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని, కూలీలంతా ఆత్మకూరు మండలానికి చెందిన వారిని, వీరందరూ పక్కనే ఉన్న దుగ్గొండి మండలం పరిధిలోని రంగాపురం గ్రామంలో మిరపకాయలు తెంపడానికి వెళ్తున్న కూలీలని ఆత్మకూరు పోలీసులు తెలిపారు.

ప్రమాదంలో మృతి చెందిన వారు మాడిశెట్టి సాంబలక్ష్మి (65), పాలకుర్తి సరోజన (55), మహబూబియా (55) అక్కడికక్కడే మృతి చెందారన్నారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం, మిగతా వారిని హుటాహుటిన ఎంజిఎంకు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్లు ఆత్మకూరు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఆయన అన్నారు.

మంత్రి ఎర్రబెల్లి విచారం


ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను తుఫాను వాహనం ఢీకొట్టిన ఘటనలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లా పోలీసు యంత్రాంగంతో మాట్లాడి ఘటనకు దారి తీసిన పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాడ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాలను ఆదుకుంటామన్నారు. రోడ్లపై ప్రయాణాలను జాగ్రత్తగా చేయాలని, నిబంధనలు పాటిస్తూ, పరిమిత వేగంతో వెళ్ళాలన్నారు. వేగం కన్నా, ప్రాణం ముఖ్యమన్న సంగతిని గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు.

Leave a Reply