Take a fresh look at your lifestyle.

తెరాస,మజ్లిస్‌ అవగాహన బయటపడింది

గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌ ‌పదవులకు గద్వాల విజయలక్ష్మి, మోతే శ్రీలత ఎన్నిక కావడం ఆశ్చర్యాన్ని కలిగించలేదు. తెరాసకూ, ఎంఐఎం పార్టీకి మధ్య లోపాయికారీ అవగాహన కారణంగానే ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు ఎన్నిక కాగలిగారు. ఈ రెండు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల నాటి నించి సంపూర్ణమైన అవగాహనతో పని చేస్తున్నాయి. అయితే, బీజేపీ దూకుడు పెరగడంతో ఆ విషయాన్ని బహిరంగంగా అంగీకరించేందుకు తెరాస వెనుకాడింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కూడా అభ్యర్థులను నిలబెట్టింది కానీ, సంఖ్యాపరంగా తెరాస, ఎంఐఎంలకున్న బలాన్ని బట్టి తెరాస అభ్యర్థులు ఎన్నిక కాగలిగారు, బీజేపీ రంగ ప్రవేశం చేయడమే కాకుండా, ఆ పార్టీ నాయకులు తెరాసపై గుప్పిస్తున్న ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో తెరాస కొంత ఆత్మవిమర్శలో పడినట్టు కనిపించింది.

నిజానికి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ మోటారు బైక్‌పై ముఖ్యమంత్రి కెసీఆర్‌ను కలుసుకునేందుకు మోటారు బైక్‌పై ప్రయాణించిన దృశ్యాలు ఇంకా ప్రజల స్మృతి పథంలోనే ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు కుదుర్చుకోవడం తప్పుకాదు. భావసారూప్యం లేకపోయినా, విభిన్న పార్టీలు ఒక కూటమిలో ఎంత సామరస్యంగా పని చేయవొచ్చో మాజీ ప్రధాని వాజ్‌ ‌పేయి హయాంలో రుజువైంది. కూటమిని నడిపించే నాయకుడు అందరి పట్లా గౌరవం, సమభావం కలిగి ఉండాలి. కానీ, ఇప్పుడు మనం చూస్తున్న నాయకుల్లో అది ఉందో లేదో ఎవరికి వారు నిర్ణయించుకోవాలే తప్ప విడమరిచి చెప్పలేం.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షాలపై వాడకూడని భాష మాట్లాడటం, అలాగే, ఒక జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ముఖ్యమంత్రి పదవిని సైతం గౌరవించకుండా మాట్లాడటం ఇక్కడే చూస్తున్నాం. రాజకీయాల్లో వైరి పక్షాల నాయకులు మాటల తూటాలు విసురుకోవడం సహజమే కానీ, వారు నిర్వహిస్తున్న పదవులకు భంగం కలగకుండా మాట్లాడాలన్న ఇంగితాన్ని ఇప్పుడు ఎవరూ పాటించడం లేదు. పదవి నాకు ఎడమ కాలి చెప్పుతో సమానమని ముఖ్యమంత్రి అనడం ఎంత తప్పో, ముఖ్యమంత్రి పదవిపై గౌరవం లేకుండా జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వ్యక్తిగత విమర్శలు చేయడం అంత తప్పు. అలాగే, ఆంధప్రదేశ్‌లో కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఎన్నికల అధికారిపై అధికార పార్టీ నాయకులు పరిధులు మీరి విమర్శలూ,ఆరోపణలు చేశారు. ఆయన కూడా తన విధుల నిర్వహణలో కొంత అతిగా ప్రయత్నించారు.

పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం అత్యంత సహజం. అలాగే, అధికార పార్టీతో చిన్న పార్టీలు జత కట్టడం కూడా అంతే సహజం. ఆధునిక కాలంలో సిద్ధాంతాల పట్టింపులు ఏ పార్టీకీ లేవు. అధికారమే పరమావధిగా పార్టీలు జతకట్టడం ప్రారంభించాయి. తెరాస, బీజేపీ నాయకుల ఆరోపణలను ఈ కోణం నుంచే చూడాలి. గ్రేటర్‌ ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తామని తెరాస నాయకులు ప్రకటించినప్పటికీ ఆ పార్టీకి ఎంఐఎంతో లోపాయికారీ ఒప్పందం ఉందన్న సంగతి జనానికి తెలుసు. అలాగే. బీజేపీ వారికీ తెలుసు. ఆ రెండు పార్టీల ఒప్పందం లేదా అవగాహన గురించి ప్రజలకు తెలియజేయడం కోసమే బీజేపీ పోటీ పెట్టింది. పోటీ లేకుండా ఎన్నికలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ విషయాన్ని ఆంధప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ ‌నిమ్మగడ్డ రమేష్‌ ‌కుమార్‌ ‌పలు సందర్భాల్లో అన్నారు. అది నిజమే కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ఉద్దేశించినవిగా జనం అనుకునే రీతిలో వ్యవహరించారు.

హైదరాబాద్‌ ‌కార్పొరేషన్‌ ‌పాలక మండలి ప్రమాణ స్వీకారంతో నగరంలో పౌర సమస్యలు ఒక కొలికి వొస్తాయని జనం ఆశించడం తప్పుకాదు. ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలలో నగరంలో మురుగు నీటి ప్రవాహ వ్యవస్థలోని బలహీనతలు బయటపడ్డాయి. ఆకస్మిక వరదలకు గురైన ప్రాంతాలు ఇంకా స్థిమిత పడలేదు. నగర పాలక సంస్థకు ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇదే పరిస్థితి. సొంత వనరులను పెంచుకునేందుకు ఏ పౌర సంస్థా కృషి చేయడం లేదు. పన్నుల ఎగవేత కారణంగానే పౌర సంస్థలకు వనరుల లేమి ఏర్పడుతోంది. ఈ మొహమాటాల నుంచి బయటపడనంత కాలం నగర, పౌర పాలికలు ఆర్థిక ఇబ్బందులనుంచి బయటపడలేవు. ఇప్పుడు కొత్త పాలక వర్గం ఈ విషయమై దృష్టి పెట్టాలి. పన్నుల బకాయిల వసూళ్ళకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే, రాజకీయాలకు అతీతంగా ఆర్థిక వనరులను పెంచుకునేందుకు శ్రద్ధ చూపాలి. హైదరాబాద్‌ ‌నగర పాలక సంస్థకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. పాలనా వ్యవహారాల్లో అనుభవనీయులైన అధికారులు, యంత్రాంగం ఉన్నా అవినీతి కారణంగానే వెనకబడి పోతోందన్న విమర్శలు వొస్తున్నాయి. వాటిని సరిదిద్దుకుని కొత్త పాలక వర్గం ముందుకు సాగాలి.

Leave a Reply