Take a fresh look at your lifestyle.

విద్యుత్‌ ‌మీటర్లపై పోరాటానికి తెరాస సిద్ధం

సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో పోరాట వైఖరిని అనుసరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) ఎంపీలు నిర్ణయించడం ఆ పార్టీ భవిష్యత్‌ ‌కార్యాచరణపై వస్తున్న వార్తలకు అద్దం పడుతోంది. తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కాంగ్రెస్‌, ‌బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ఏర్పాటు యత్నాలను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తెరాస ఎంపీలు తీసుకున్న నిర్ణయం యాధృచ్ఛికం కాదని స్పష్టం అవుతోంది. అయితే, కేంద్రంపై తెరాస రాజకీయ కోణం నుంచి కాకుండా, పోరాడి సాధించుకున్న తెలంగాణకు అన్యాయం జరుగుతున్నందునే ఈ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ ఏర్పడి ఏడేళ్ళయినా, కేంద్రం నుంచి తగిన సాయం అందనందుకు ఆ పార్టీలో అసంతృప్తి నానాటికీ పెరిగి పోతోంది. ఎంతో ఓరిమితో వేచి ఉన్నా ఫలితం దక్కకపోవడంతో పోరాట పంథాను ఆ పార్టీ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ఉచిత విద్యుత్‌ ఇవ్వొద్దనడం, విద్యుత్‌ ‌రంగాన్ని మళ్ళీ సంక్షోభంలోకి నెట్టేందుకు కొత్త విద్యుత్‌ ‌చట్టాన్ని తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు సాగించడం వల్ల కూడా తెరాస అసంతృప్తిగా ఉంది.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని రైతులు విద్యుత్‌ ‌కష్టాలను అనుభవించారు. ఉచిత విద్యుత్‌ ‌పథకాన్ని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రాజశేఖరెడ్డి ప్రవేశపెట్టడానికి ఆనాటి పరిస్థితులే ప్రేరణ. ముఖ్యంగా, పూర్తిగా బోర్లపై ఆధారపడి వ్యవసాయం సాగించే తెలంగాణలో మోటార్లు కాలిపోయి, తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంఘటనలు జాతీయ స్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షించాయి. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్రలోని విదర్భ తర్వాత స్థానంలో ఉన్నది తెలంగాణాయేనని అప్పట్లో మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమానికి విద్యుత్‌ అం‌శం కూడా ప్రేరణే. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉచిత విద్యుత్‌ ‌పథకాన్ని తెరాస ప్రభుత్వం కొనసాగిస్తోంది. అయితే, ఈ పథకం అమలులో లొసుగులు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నా, మొత్తానికి పథకం ఎత్తేయకుండా కొనసాగిస్తున్నారు. కేంద్రం ఇప్పుడు రైతులకు సరఫరా చేసే విద్యుత్‌కు మీటర్లు బిగించమంటోంది. దీని కోసం రాష్ట్రంలో కొత్తగా 34 లక్షల కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. మీటర్లకు 500 కోట్లు, బాక్స్‌లకు 300 కోట్ల అదనపు భారాన్ని రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. వ్యవసాయ విద్యుత్‌ ‌కనెక్షన్లకు మీటర్లు బిగించాలన్న కేంద్రం ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా చూస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌హామీ ఇస్తున్నారు. మీటర్ల బిగింపు వ్యవహారంలో చాలా తలనొప్పులు, చిక్కులు ఉన్నాయి. దొంగ కరెంట్‌ను అరికట్టేందుకే మీటర్లను బిగించాలని కేంద్రం ఆదేశిస్తోంది. అయితే, దొంగ కరెంట్‌ను అరికట్టడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. విద్యుత్‌ ‌సిబ్బందిపై నిరంతర పర్యవేక్షణ ఉంటే తప్ప అది సాధ్యం కాదు.

తెలంగాణలో విద్యుత్‌ ‌మీటర్లను బిగించే ప్రతిపాదనను తెరాస తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కొత్త విద్యుత్‌ ‌చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పిలుపు ఇచ్చారు. విద్యుత్‌ ‌చట్టానికి వ్యతిరేకంగా వామపక్షాలు, కార్మిక సంఘాలు ఇప్పటికే వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. రైతులను నమ్మించి మోసం చేయడానికే కేంద్రం ఈ ప్రతిపాదనలు చేస్తోందని వామపక్షాల నాయకులు బహిరంగంగానే విమర్శించారు. విద్యుత్‌ ‌మీటర్లపై మరోసారి విద్యుత్‌ ‌పోరాటం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం నుంచి తెలంగాణకు రావల్సిన నిధుల విషయంలో అన్యాయం జరుగుతోందని తెరాస మాత్రమే కాకుండా ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. నవోదయా స్కూల్స్ ‌విషయంలో కూడా అన్యాయం జరుగుతోంది. రాష్ట్రంలో 9 స్కూల్స్ ‌మాత్రమే ఉన్నాయి. అలాగే, జిఎస్టీ విషయంలో రాష్ట్రానికి రావల్సిన పరిహారం బకాయిల గురించి రాష్ట్ర ఆర్థిక మంత్రి కె హరీష్‌ ‌రావు ఇటీవల జిఎస్‌టి మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌దృష్టికి తెచ్చారు.

పరిహారం విషయంలో తెలంగాణాకే కాకుండా అన్ని రాష్ట్రాలకూ కేంద్రం మొండి చెయ్యి చూపిస్తూనే ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటున్నాయి. జీఎస్‌టి రాకముందు వ్యాట్‌ ‌ద్వారా రాష్ట్రానికి 24 శాతం నిధులు వచ్చేవి. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోయినా, రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను పక్కాగా అమలు జేస్తున్నామని కేసీఆర్‌ అన్నారు. కొరోనా పేరు చెప్పి రాష్ట్రాలకు కేంద్రం నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తోందన్న భావన అన్ని రాష్ట్రాల్లో ఉంది. అయితే, రాజకీయ కారణాల వల్ల బీజేపీయేతర ముఖ్యమంత్రులు కొందరు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం లేదనీ, ఈ విషయంలో కేసీఆర్‌ ‌చొరవ తీసుకుంటారని తెరాస నాయకులు అంటున్నారు. కేంద్రంతో ఘర్షణ తమ వైఖరి కాదని, నిధులు సాధించడం తమ హక్కు అనీ, దాని కోసం పోరాటం చేస్తామని అంటున్నారు. నిధుల సంగతి ఒక ఎత్తు. విద్యుత్‌ ‌మోటార్లకు మీటర్లు బిగించడం మరో ఎత్తు. దీని వల్ల రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని కేసీఆర్‌ అం‌టున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న అసంతృప్తిని ఆసరాగా తీసుకుని పోరాటానికి కేసీఆర్‌ ‌రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

Leave a Reply