తెలంగాణలో పేపర్ల లీకుల వ్యవహారం విపక్షాలకు ఆయుధంగా మారాయి. ఒకటి అర కాకుండా వరుసగా ఒకదాని వెనుక ఒకటిగా అన్ని పరీక్షా పత్రాలు వెలుగుచూస్తుడడంతో రాష్ట్రమంతా అట్టుడికి పోతున్నది. ఆర్థిక ఒడి•దొడుకులను అధిగమించి తమ పిల్లలను కష్టపడి చదివిస్తున్న క్రమంలో ఈ లీకుల వ్యవహారమేందని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్ధులుకూడా పగలు రాత్రి అనకుండా పరీక్షకు సిద్ధపడితే ఈ లీకులు వారిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఒక వైపు ఎంతో కాలంగా ఉపాధి అవకాశాలు నోచుకోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలకోసం ఏర్పాటు చేసిన పోటీపరీక్షల ప్రశ్నాపత్రాల బహిర్ఘతంతోనే తలమునకలవుతున్న క్రమంలో ఇప్పుడు పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ విద్యావ్యవస్థపైనే నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితిని కల్పిస్తున్నది. పదవ తరగతి మొదటి పరీక్షనాడే తెలుగు పేపర్ లీక్ కాగా, రెండవ రోజు హిందీ పేపర్ లీక్ కావడమన్నది విద్యారంగ పాలనా వ్యవహారాలను ఎత్తి చూపుతోంది. ఇదిప్పుడు రాష్ట్రంలో దావానలంగా వ్యాపించింది. ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.
విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చేయాల్సిందిగా ఆ పక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలుగు పేపర్ లీక్‌పైన విచారణ చేస్తున్న క్రమంలోనే హిందీ పేపర్ వ్యవహారం వెలుగుచూసింది. అయితే ఇది వరంగల్ జిల్లాలోనుండి బయటికి వొచ్చినట్లుగా వొస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజమన్నది పోలీసులు విచారిస్తున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే వరంగల్ సీపీ రంగనాథ్ తమ బృందాన్ని రంగంలోకి దింపి, వివిధ కోణాల్లో విచారణ జరిపిస్తున్నారు. అయితే నిజంగానే వరంగల్‌నుండే ఈ పేపర్ లీక్ అయిందనడానికి ప్రాధమిక అధారాలేమీ లేవంటున్నారు సీపీ. ఈ లీక్ వ్యవహారం బయటికి వొచ్చే సమయానికి అంటే ఉదయం తొమ్మిదిన్నర, తొమ్మిది గంటల నలభైనిమిషాల మధ్యలో వాట్స్‌ప్‌లో చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది. అప్పటికే విద్యార్ధులంతా పరీక్ష హాల్లోకి ప్రవేశించి ఉంటారు గనుక దీన్ని లీక్ అనడం సరైంది కాదని సీపీ రంగనాథ్ అభిప్రాయపడుతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితిలో పరీక్షలు రాసే విద్యార్థులు చూసే అవకాశమైతే లేదంటున్నారు. తాండూరులోనూ ఒక విధంగా అదే పరిస్థితి. విద్యార్థులంతా పరీక్షలు రాస్తున్న ఒక గంట తర్వాతనే తెలుగు పేపర్ వెలుగులోకి వొచ్చినట్లు తెలుస్తున్నది. ఏదియేమైనా వరస లీకేజీల వార్తలు ఇప్పుడు ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. ఇది లీకుల సర్కార్ అంటూ విపక్షాలు తీవ్ర స్థాయిలో గళమెత్తుతున్నాయి. బిఆర్‌ఎస్ సర్కార్ హయాంలో ఇంతవరకు రైతులు, నిరుద్యోగులే ఆత్మహత్యలు చేసుకుంటుండగా ఇప్పుడు విద్యార్ధుల భవిష్యత్‌తోనూ ఈ ప్రభుత్వం ఆటలాడుకుంటున్నదని ఆ పక్షాలు విరుచుకుపడుతున్నాయి.
ఉద్యోగులపైన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అజమాయిషీ లేకుండా పోయిందంటున్నారు. పరీక్ష హాల్‌నుండి ప్రశ్నాపత్రం వాట్సప్ ద్వారా బయటికి రావడం అంటే, ఉపాధ్యాయులకు ఏమాత్రం ప్రభుత్వమంటే భయంలేకుండా పోయింది. తెలుగు పరీక్షా పేపర్‌ను వికారాబాద్ జిల్లా తాండూరులో బయోలజీ టీచర్ బందెప్ప తన సహోపాధ్యాయుడికి వాట్పస్‌లో పంపించడం అక్కడి నుండి ఒక గ్రూప్‌కు సర్కిలేట్ అవడమన్నది చూస్తుంటే ఉపాధ్యాయులకు ్ర పభుత్వం చర్యలు తీసుకుంటుందన్న భయం ఏమాత్రం లేదని తెలుస్తున్నదంటున్నాయి విపక్షాలు. ఈ సంఘటనకు సంబందించి బందెప్పతోపాటు సమ్మప్ప అనే మరో ఉపాధ్యాయుడిని, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్, డిపార్ట్‌మెంటల్ అధికారి శివకుమార్‌ని సస్పెండ్ చేసినా , లీకేజీ చేయడంలో ఏమాత్రం భయపడేదిలేదన్నట్లుగా తెల్లవారే తెలుగు పేపర్ లీక్ అవడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.
టిఎస్‌పీఎస్సీ పేపరు, ఇప్పుడు పదవతరగతి పేపర్లు లీక్ అవుతున్నాయంటే ప్రభుత్వ చాతగాని తనం తెలియజేస్తున్నదని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్‌లకు అనుమతిలేని క్రమంలో వాట్సప్‌ల్లో ఎలా బయటికి వొస్తాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ లీకేజీల వెనుక సూత్రధారులెవరన్న విషయం ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఇవి కేవలం ఒకరిద్దరి పనా, లేక దీనివెనుక పెద్ద తలకాయలేవైనా ఉన్నాయా అన్నది నిగ్గు తేల్చాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే రోజుకో లీకేజీ వ్యవహారం వెలుగు చూస్తున్న క్రమంలో అటు నిరుద్యోగులు, విద్యార్ధులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని, దీనిపైన వేరవేరుగా కాకుండా సంఘటితంగా పోరాటం చేయాలని వివిధ రాజకీయ పార్టీలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్‌ఆర్‌టిపి పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల, ప్రొఫెసర్ కోదండరామ్‌ను మంగళవారం స్వయంగా కలిసి విజ్ఞప్తి చేయడంతో చూస్తుంటే రాజకీయ పార్టీలకు లీకుల వ్యవహారం మరో అస్త్రాన్ని అందించినట్లైంది.