Take a fresh look at your lifestyle.

టెన్త్ ‌పరీక్షలు రద్దు, ఇంటర్‌ ‌పరీక్షలు వాయిదా

కొరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయం
‌తెలంగాణ రాష్ట్రంలో కొరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సిబిఎస్‌ఈ ‌పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దృష్ట్యా రాష్ట్రంలోనూ టెన్త్ ‌పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించింది. వీరందరినీ పై తరగతులకు ప్రమోట్‌ ‌చేయనున్నారు. అలాగే, ఇంటర్‌ ‌పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు గురువారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాఠశాల విద్య, ఇంటర్‌ ‌మీడియట్‌  ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొరోనా కేసులు రోజురోజుకూ భారీ సంఖ్యలో పెరుగుతున్న ప్రస్తుత సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టెన్త్ ‌పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ విషయానికి సంబంధించిన ఫైల్‌ను సీఎం  కేసీఆర్‌కు మంత్రి సబిత పంపించారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 5 లక్షల 35 వేల మంది టెన్త్ ‌విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీరంతా పై తరగతులకు ప్రమోట్‌ ‌కానున్నారు. అలాగే, రాష్ట్రంలో ఇంటర్‌ ‌ఫస్టియర్‌ ‌విద్యార్థులు 4 లక్షల 58 వేల మంది ఉన్నారు. అయితే, వీరికి మాత్రం కొరోనా ఉధృతి దృష్ట్యా పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా, గత ఏడాది కూడా కొరోనా కేసుల దృష్ట్యా టెన్త్ ‌పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. కొరోనా తీవ్రత కొద్దిగా తగ్గిన సమయంలో ప్రభుత్వం పాఠశాలలు, ఇంటర్‌ ‌కళాశాలల నిర్వహణకు అనుమతినిచ్చింది. అయితే, సిలబస్‌ ‌పూర్తి కాకుండానే మళ్లీ మూసివేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ ‌పాఠాలు నిర్వహించినప్పటికీ పెద్ద ఉపయోగం లేదని విద్యాశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోనే టెన్త్ ‌పరీక్షల రద్దు, ఇంటర్‌ ‌పరీక్షల వాయిదాకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొగ్గు చూపారనీ, సంబంధిత ఫైల్‌పై సీఎం కేసీఆర్‌ ‌త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Leave a Reply