Take a fresh look at your lifestyle.

‌సిట్టింగ్‌ల్లో గుండె దడ.. ఆశావహుల్లో ఉత్సాహం

హ్యాట్రిక్‌ ‌దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో పార్టీకోసం గట్టిగా పనిచేయని వారి తోక కట్‌ ‌చేస్తామని భారత్‌ ‌రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్‌ ‌తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్రంలో మూడవసారి అధికారంలోకి రావడ మన్నది ఖాయమే అయినా అదే తమకు పెద్ద టాస్క్ ‌కాదు. అధిక మెజార్టీ స్థానాల సాధనే తమ ముందున్న ప్రధానాంశమని కెసిఆర్‌ ‌తమ లక్ష్యాన్ని పార్టీ శ్రేణులకు వివరించిన తీరు, ఎట్టి పరిస్థితిలో పార్టీలో అలక్ష్యాన్ని సహించేదిలేదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. అలా కష్టపడ్డవారికే రానున్న ఎన్నికల్లో టికట్లు కేటాయిస్తామన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు.  ఒకటిన్నర సంవత్సర కాలంనుండే తెలంగాణలో  ముందస్తు ఎన్నికలు వొస్తాయన్న ప్రచారం జోరుగా జరుగుతూ వొచ్చింది. గతంలోకూడా ముందస్తు ఎన్నికలతోనే రెండవ సారి అధికారాన్ని చేజిక్కించుకున్న కెసిఆర్‌ ‌తప్పకుండా ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళతాడన్న చర్చ రాష్ట్రంలో విస్తృతంగా జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలుకూడా ఆదే ఆలోచనతో తమ కార్యక్రమాలను ముందస్తుగానే కొనసాగిస్తూ వొస్తున్నాయి. అయితే ఈ చర్చకు బ్రేక్‌ ‌వేస్తూ ముందస్తు ఆలోచనంటూ ఏదీ లేదని, షెడ్యూల్‌ ‌ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని కెసిఆర్‌ ‌తేల్చేశారు. అలాగే రానున్న ఎన్నికల్లో తమ పార్టీ సిట్టింగ్‌లకే మరోసారి అవకాశం ఇస్తుందని ప్రకటించారు.  దీంతో తమ సీటుకు ధోకా  లేదని సిట్టింగ్‌ ఎంఎల్‌ఏలంతా అప్పటినుండి గుండె మీద చెయ్యివేసుకుని నిబ్బరంగా ఉన్నారు.

ఈసారి టికట్‌ ‌విషయంలో కష్టపడాల్సిన పనిలేదనుకున్నారు. కాని, ఈసారైనా తమకు అవకాశం లభించకపోదన్న ఆశతో ఇంతకాలంగా నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వారికి మాత్రం కెసిఆర్‌ ‌ప్రకటన  ఖేదాన్ని కలిగించింది. తమ రాజకీయ భవిష్యత్‌పై వారిలో ఆలోచనలు మోదలైనాయి. దీంతో ప్రతీ నియోజకవర్గంలో నాయకులమధ్య అంతర్ఘత కలహాలు మొదలైనాయి. ముఖ్యంగా ఎంఎల్‌ఏ ‌టికట్‌ను ఆశిస్తున్న నాయకులకు స్థానిక ఎంఎల్‌ఏలకు మధ్య విభేదాలు  పొడసూపాయి. ఇది ఇంచుమించు అన్ని నియోజకవర్గాల్లోనూ కొనసాగుతున్నది.. అయితే కెసిఆర్‌ ‌తాజా హెచ్చరిక రెండవ శ్రేణి నాయకులను కొంత ఉత్సాహపరిచేదిగా ఉండగా, సిట్టింగ్‌ ఎంఎల్‌ఏల్లో  గుండ దడ పుట్టిస్తున్నది. రానున్న ఎన్నికల వరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, ప్రజలకు చేరువ అయ్యేవారికే ప్రాధాన్యత ఇస్తామని కెసిఆర్‌ ‌చేసిన ప్రకటన కొంత అయోమయానికి గురిచేసింది.  తెలంగాణ భవన్‌లో గురువారం బిఆర్‌ఎస్‌(‌టిఆర్‌ఎస్‌) ఆవిర్భావ దినోత్సవాలను  నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశం ఒక విధంగా రానున్న ఎన్నికలకు మార్గనిర్దేశం  చేసేదిగా ఉంది.

ఎలక్షన్‌ ‌షుడ్‌ ‌నాట్‌ ‌బై ఛాన్స్.. ‌బట్‌ ‌బై ఛాయిస్‌ అం‌టూ అవకాశం వొచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కెసిఆర్‌  ‌కార్యకర్తలకు ఉద్బోధించారు.. దాహం వేసినప్పుడే బావి తవ్వాలనుకోవడం సరికాదు.. అందుకు ముందు ఆలోచన ఉండాలన్న సామెతను వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి అధికారంలోకి రావడమన్నది మనకు ప్రధాన అంశం కాదు. గతంతో పోలిస్తే  ఈసారి ఎన్నిస్థానాలను అధికంగా సాధించామన్న దిశగా కృషి చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. అంటే తొమ్మిదేళ్ళ తెలంగాణ భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వివిధ రంగాల్లో ముందు వరుసలో నిలచిందని చెప్పుకుంటున్న క్రమంలో ఆ మార్క్ ‌రానున్న ఎన్నికల్లో సీట్ల రూపంలో చూపించాలన్న  నిగూఢ  భావాన్ని కెసిఆర్‌ ఈ ‌సందర్భంగా వ్యక్తంచేశారు. అందుకోసం కలహాలను పక్కకు పెట్టి సమిష్టి కృషి చేయాలంటూ కార్యకర్తలకు బోధన చేశారు. రాష్ట్రంలోని దాదాపు ప్రతీ జిల్లాలో నాయకుల మధ్య వైషమ్యాలున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైషమ్యాలు పార్టీని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఆయన ప్రతీ నియోజకవర్గాన్ని  ఇద్దరు నాయకులు పర్యవేక్షించాలన్న సూచన చేసినట్లు కనిపిస్తున్నది. నేతలు, ఎంఎల్‌ఏలు నిత్యం ప్రజలమధ్యనే ఉండాలి.. క్యాడర్‌లో ఎలాంటి అసంతృప్తికి తావివ్వకూడదు.. పల్లె నిద్ర ద్వారా ప్రజాప్రతినిధులంతా ప్రజలతో మమేకం కావాలని కెసిఆర్‌ ‌చేసిన సూచన పార్టీలో ఉన్న విభేదాలను  దృష్టిపెట్టుకునే చేసినట్లు కనిపిస్తున్నది.

రాష్ట్రంలో ఉన్న 119 శాసనసభ స్థానాల్లో వందకు పైగా స్థానాల ధ్యేయంగానే పార్టీ శ్రేణులు పనిచేయాలంటూ ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరం 68 స్థానాలు రాగా, ఆ తర్వాత 88 స్థానాలను బిఆర్‌ఎస్‌ ‌సాధించుకుంది.  ఇతర పార్టీలనుండి పలువురు ఎంఎల్‌ఏల చేరికతో ఆ సంఖ్య వంద దాటింది. కాగా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో వందకు పైగా స్థానాలను ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి- భారత్‌ ‌పరివర్తన్‌ ‌మిషన్‌గా మారాలన్నది కెసిఆర్‌ ఆశయం. భారత్‌లో పరివర్తన రాకుండా సమస్యలను దూరం చేయడం సాధ్యం కాదు.. దేశంలో ఎప్పటివరకైతే మార్పు రాదో అప్పటివరకు ఈ మిషన్‌ ‌కొనసాగుతూనే ఉంటుందన్న బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌,  ‌పరివర్తన తీసుకు రావడం కోసం అవసరమైతే పార్టీ పరంగా ప్రత్యేక టివి ఛానల్‌ను ఏర్పాటు చేయడానికి కూడా వెనుకాడేదీ లేదంటున్నారు. టివీ ప్రకటనలు, ఫిల్మ్ ‌ప్రొడక్షన్‌ల ద్వారా ప్రజల్లో మమేకం కావాల్సిన అవసరాన్ని ఆయన కార్యకర్తలకు, నాయకులకు నొక్కి చెబుతున్నారు.

Leave a Reply