Take a fresh look at your lifestyle.

‌భారత్‌ ‌సరిహద్దుల్లో ఉద్రిక్తత

భారత్‌ ‌సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మొదటినుండి పాక్‌, ‌చైనాలు హద్దులుదాటి భారత భూబాగంలోకి చొచ్చుకువస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు దేశా లు భారత్‌ ‌భూభాగాన్ని ఆక్రమించు కోవడంతోపాటు అడపాతడపా గిల్లి కజ్జాలు పెట్టుకుంటూనే ఉన్నాయి. తాజాగా చైనా ఒక వైపు ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టిస్తే, ఇంతకాలం స్నేహంగా ఉన్న నేపాల్‌ ఏకంగా భారత్‌ ‌భూభాగాన్ని కలుపుకుని తమ దేశ పటాన్ని తయారు చేసుకుని మరో కొత్త వివాదానికి దారితీసింది. భారత్‌ ‌సరిహద్దుల్లో ఉన్న ఒక్కో దేశానికి చైనా ఆర్థిక, ఆరోగ్యపరమైన సహకారాన్ని అందిస్తూ తమవైపు ఎలా తిప్పుకుంటుదనడానికి నేపాల్‌ ‌ప్రత్యక్ష సాక్షంగా నిలుస్తున్నది. తాజాగా భారత్‌-‌చైనా సరిహద్దుల్లోని గాల్వన్‌ ‌వ్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారత్‌ ‌భూభాగంలోకి చైనా సైన్యం దూసుకొస్తున్న క్రమంలో వారిని నిరోధించే క్రమంలో జరిగిన ఘర్షణలో ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది. అయితే చైనా సైనికులు ఎంతమంది చనిపోయారన్నది అధికారంగా తెలియకపోయినా, భారత్‌కు సంబందించి కల్నల్‌ ‌స్థాయి అధికారితో పాటు ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు అధికారికంగా భారత్‌ ‌ప్రకటించింది. ఈ రెండు దేశాలమధ్య నెలకొన్న సరిహద్దు వివాదం చాలా కాలంగా కొనసాగుతున్నా, నెలరోజులుగా పరిస్థితి సీరియస్‌గా మారింది. తూర్పు లద్దాఖ్‌ ‌చాలా సున్నితమైన ప్రాంతం. అక్కడ పాంగాంగ్‌ ‌సరస్సు(కాంక్లేవ్‌ ‌లేఖ్‌) ‌గల్వాన్‌ ‌లోయ ప్రాంతాల గురించి వాదం చెలరేగుతున్నది. ఈ ప్రాంతాన్ని ఇరుదేశాలు తమవంటే తమవని చెబుతున్నాయి. కాగా సరిహద్దు వద్ద భారత్‌ ‌నిర్మించిన రోడ్డు దౌలత్‌ ఓల్డీలో ప్రపంచంలో అత్యంత ఎత్తైన వైమానికదళ స్థావరం ఉంది. నియంత్రణ రేఖకు అతి సమీపంలో ఉన్న భారత్‌ ఏయిర్‌ ‌ఫీల్డ్ ఇది. ఇక్కడ రోడ్డు వేయడంవల్ల లేహ్‌ ‌నుంచి దౌలత్‌ ఓల్డీ చేరుకోవడానికి గతంలో రెండు రోజులు పట్టేది. రోడ్డు నిర్మాణం వల్ల కేవలం ఆరుగంటల్లో చేరుకోవచ్చు. దీనివల్ల సైనికులను, ఆయుధాలను సత్వరం సరిహద్దు ప్రాంతానికి చేర్చవచ్చు. ఇది చైనాకు కొరుకుడు పడకుండా పోయింది. దీంతో సరిహద్దు వివాదాన్ని లేవనెత్తి ఉద్రిక్తత పరిస్థితిని కల్పిస్తున్నది. గల్వాన్‌ ‌లోయ వివాదంపై సామరస్య చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్‌ ‌చేసిన సూచన మేరకు రెండుదేశాల లెప్ట్‌నెంట్‌ ‌జనరల్‌ ‌స్థాయిలో చర్చలు జరుగుతున్నాయికూడా. ఒకవైపు చర్చలు జరుగుతుండగానే సోమవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణ కారణంగా భారత్‌కు చెందిన ఒక కల్నల్‌తోసహా ఇద్దరు జవాన్లు మృతిచెందినట్లు రక్షణశాఖ ప్రకటించింది. 1975 తర్వాత ఇంతవరకు ఈ ప్రాంతంలో మన సైనికులు మృతి చెందడమన్నది ఇదేనని చెబుతున్నారు.

ఇదిలాఉంటే నిన్నటివరకు మిత్రదేశంగా కలిసిఉన్న నేపాల్‌ ‌వైఖరిలో ఇటీవల కాలంలో మార్పు కనిపిస్తున్నది. ఈ దేశంతో మొదలవుతున్న సరిహద్దు వివాదం వెనుక కూడా చైనానే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభలిన కొరోనా నివారణ విషయంలో నేపాల్‌కు వైద్య బృందాలను పంపి చైనా ఆదుకోవడం వెనుక కూడా నేపాల్‌ను మచ్చిక చేసుకోవడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్‌దేశం చుట్టుపక్కల దేశాలైన పాకిస్తాన్‌, శ్రీ‌లంక, మాల్దీవులు వంటి దేశాల్లో పెట్టుబడులుపెట్టి వ్యూహాత్మకంగా చైనా వ్యవహరిస్తోంది. ఇప్పుడు నేపాల్‌ను మచ్చిక చేసుకోవడం ద్వారా భారత్‌కు మరింత దగ్గరగా తన బలగాలను చేర్చే వ్యూహమేనంటున్నారు. చాలాకాలంగా భారత్‌తో నేపాల్‌కు సత్సంబంధాలున్నాయి. సంస్కృతి, సంప్రదాయాల పరంగా పరస్పర సహకారాన్ని ఇరుదేశాలు అందించుకుంటున్నాయి. కాని, ఇటీవల కాలంలో ఆ దేశం తీరులో మార్పులు కనిపిస్తున్నాయి. దేశ సరిహద్దు సమస్యలేవైనా ఉంటే ఇరుదేశాలు కలిసి చర్చించుకుని పరిష్కరించుకునేందుకు అంగీకరించిన నేపాల్‌ ఇప్పుడు ఉన్న పళంగా ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌ ‌జిల్లాలోని కాలాపానీ ప్రాంతాన్ని తన భూబాగంగా చూపించి ఏకంగా మ్యాప్‌నే ప్రకటించింది. అంతటితో ఆగకుండా ఈ మ్యాపును ఆమోదించే రాజ్యాంగ సవరణ బిల్లును నేపాల్‌ ‌పార్లమెంటు ఉభయ సభలు అమోదించడం చూస్తుంటే ఆ దేశం కాస్త దూకుడుగానే ముందుకు పోతున్నట్లు కనిపిస్తున్నది. దీంతో ఇప్పుడు కాలపానీతో పాటుగా లిపులేక్‌, ‌లింపియాధురా ప్రాంతాల చుట్టూరా వివాదం కొనసాగుతున్నది. అయితే నేపాల్‌ ‌కొత్తగా ప్రకటించిన మ్యాపును ఎట్టి పరిస్థితిలో అంగీకరించేది లేదంటున్న భారత ప్రభుత్వం 2019 నవంబర్‌లో అధికారికంగా విడుదల చేసిన మ్యాప్‌లో కాలాపానీ భారత భూబాగంలోనే ఉన్నట్లు చూపించింది. నేపాల్‌ ‌మాత్రం బ్రిటీషుకాలంనాటి ఒప్పందాలను ముందుకు తెచ్చి వివాదగ్రస్తం చేస్తున్నది. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్నా భారత ప్రభుత్వం మాత్రం చర్చల ద్వారానే సమస్యలు పరిష్కార మవుతాయని చెబుతున్నది.

Leave a Reply