ప్రపంచాన్ని గత అయిదు నెలలకుపైగా వణికిస్తున్న కొరోనా మహమ్మారి నుండి భారతదేశం బయట పడేందుకు డెబ్బై రెండు గంటలపాటు నిర్విరామంగా శ్రమపడాలని ప్రధాని నరేంద్రమోదీ పది రాష్ట్రాలను కోరారు. కాని, పక్షంలో అదుపుచేయలేనంత విస్తృతమవుతుందని కూడా ఆయన హెచ్చరించడంతో మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లపై ఇప్పుడు గురుతర బాధ్యతపడింది. ఎందుకంటే కోవిడ్ 19 వైరస్ వ్యాప్తిపై పరిశీలన జరుపుతున్న శాస్త్రవేత్తల గత కొన్ని నెలలుగా వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులపై చేసిన అధ్యయనంలో వైరస్ ఈ పది రాష్ట్రాల్లో ప్రమాదంగా ప్రబలుతున్న విషయాన్ని గమనించారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కేసుల్లో దాదాపు ఎనభై శాతం కేసులు ఈ పది రాష్ట్రాల నుండే నమోదు అవుతుండడంతో ఈ పది రాష్ట్రాల ముఖ్యమంత్రులను మంగళవారం వీడియో కాన్ఫ్రెన్స్ ద్వారా మోదీ జాగృతం చేశారు. దేశంలో కోవిడ్ విజృంభణ మొదలైనప్పటి నుండి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటివరకు దాదాపు ఆరేడుసార్లు ఇలాంటి సమావేశాలను నిర్వహించి, ఎప్పటికప్పుడు తగినసూచనలు ఇస్తూనే, వారి నుండి సలహాలను కూడా తీసుకుంటున్నా దేశంలో వైరస్‌ను మాత్రం తగ్గించలేకపోతున్నారు. అయితే మోదీ చెబుతున్నదేమంటే పాజిటివ్‌కేసులు బాగానే నమోదు అవుతున్నప్పటికీ మరణాల సంఖ్యను మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే చాలా వరకు తగ్గించగలిగామన్నది. ఆ నమ్మకంతోనే లాక్‌డౌన్‌ను సడలిస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ను మూడవ అన్‌లాక్ చేసిన తర్వాత ఇదే ప్రథ•మ సమావేశం. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల పాజిటివ్ కేసుల నమోదు తీరును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రధానంగా ఈ పది రాష్ట్రాలపై దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరాన్ని గుర్తించడమైంది. ఈ రాష్ట్రాల్లో ఎంత తక్కువ సమయంలో కోవిడ్ టెస్ట్‌లు చేయగలిగితే దేశం అంత తొందరగా కోలుకుంటుందన్నది మోదీ చెబుతున్నమాట. అందుకే డెబ్బై రెండు గంటల్లోగా పరీక్షలను పూర్తిచేయాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. సాధ్యమైనంతవరకు పాజిటివ్ వచ్చిన వారిని వేరుచేయగలిగితే ఒకరినుండి ఒకరికి చేరే అవకాశం లేకుండా పోతుందన్న అధ్యయనకారుల అభిప్రాయాన్ని ఆయన ముఖ్యమంత్రులతో పంచుకున్నారు.
విస్తృతమవుతున్న ఈ కోవిడ్ కేసులను పరిశీలిస్తే దేశంలో తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య 22.68 లక్షలకు చేరుకుంది. ఇప్పటివరకు నలభై వేలకుపైగానే మృత్యువాత పడినప్పటికీ చాలామంది కోలుకుంటున్న విషయం సంతృప్తిని ఇస్తుందంటారు మోదీ. ఇప్పటివరకు ఈ వ్యాధిబారిన పడి కోలుకున్నవారి సంఖ్య పదహారు లక్షలకు పైన్నె ఉంది. రాష్ట్రాల విషయానికొస్తే మొదటినుండి మహారాష్ట్ర టాప్‌లో ఉంటూనే ఉంది. ఆ తర్వాత స్థానంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు అయిదు లక్షల పదిహేను వేలకు పైగా కేసులు నమోదుకాగా, పదిహేడు వేల ఏడువందల మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న తమిళనాడులో దాదాపు రెండు లక్షల తొంబై ఏడు కేసులకు గాను ఇప్పటివరకు నాలుగువేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది మరణించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబందించి ఏపిలో గత అయిదారు రోజులుగా రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణకన్నా ఎక్కువ కొరోనా పరీక్షలు ఏపిలో చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నా, అదే తరహాలో పాజిటివ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ పాజిటివ్ కేసులు నమోదయిన సంఖ్య రెండు లక్షల ముప్పై అయిదు వేలకు పైగానే ఉంది. అలాగే ఇంతవరకు ఇక్కడ రెండు వేల నూటా పదహారు మంది వైరస్‌తో మృతిచెందారు. ఏపితో పోటీ పడినట్లుగానే తెలంగాణలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఇంతవరకు పాజిటివ్ కేసులు 82 వేల ఆరువందలకు పైగా చేరుకోగా, ఈ వ్యాధికారణంగా మృత్యువాతపడినవారి సంఖ్య 645కు చేరుకుంది. అయితే రికవరీ రేటుకూడా ఇక్కడ బాగానేఉంది. 71.84 శాతంతో రికవరి అయినవారు 59వేలకు పైగానే ఉన్నారు. కాని, ఇక్కడ పరీక్షలు చాలా తక్కువగా నిర్వహించడంతో కాంటాక్టు కేసులు బయట పడకుండా ఉన్నాయి. అయితే ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన నీతి అయోగ్ సభ్యులు మాత్రం తెలంగాణలో పరీక్షలు నిర్వహిస్తున్న తీరు, హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి అందిస్తున్న టెలిమెడిసన్ సేవలపట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం.
కోవిద్ పరీక్షలు నిర్వహించడంలో అమెరికా తర్వాత భారతే ముందు వరుసలో నిలిచింది. దేశంలో నేటికీ రోజూ దాదాపు ఏడు లక్షల కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనివల్లనే కోవిడ్ సోకినవారిని ్వ •రగా గుర్తించి వారికి చికిత్సలు జరుపడం వల్లే మరణాల సంఖ్యను తగ్గించగలమన్నది మోదీ మాట. అయితే నాలుగైదు నెలలుగా చేయలేని పనిని మోదీ సూచించినట్లు 72 గంటల్లో చేయడం సాధ్యపడుతుందా అన్నది ప్రధాన ప్రశ్న. ఈ 72 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు జరిపి వైరస్ వ్యక్తులను వేరు చేయడం అంత సులభమైన విషయం కాదంటున్నారు వైద్యరంగ నిపుణులు. రాష్ట్రాల వద్ద అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడమే ప్రధానకారణంగా వారు పేర్కొంటున్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు నిందించుకోకుండా సంయుక్తంగా రంగంలోకి దిగినప్పుడే దేశంలో కొరోనాను కట్టడి చేయడమవుతుందన్న విషయాన్ని ప్రజలు గుర్తుచేస్తున్నారు.