Take a fresh look at your lifestyle.

ఉ‌క్రెయిన్‌పై దాడులకు తాత్కాలిక బ్రేక్‌

  • ‌విదేశీయులు తిరిగి వెళ్లేందుకే అని రష్యా ప్రకటన
  • పది రోజులయినా రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య…యుద్ధ నివారణ చర్యలకు పడని అడుగు
  • ఇంకా కొనసాగితే మరింత ముప్పు

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా కాసేపు కాల్పుల విరమణను ప్రకటించింది. రెండు నగరాల్లో మానవతావాద సాయం అందజేయడానికి వీలుగా శనివారం తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటిస్తామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మాస్కో స్థానిక సమయం ప్రకారం మార్చి 5న ఉదయం 10 గంటల నుంచి కాల్పుల విరమణ ప్రారంభమవుతుందని తెలిపింది. మరియు పోల్‌, ‌వోల్నోవాకా నగరాల నుంచి సాధారణ ప్రజలు బయటకు వెళ్ళటానికి వీలుగా మానవాతా వాద నడవ(కారిడార్‌)‌లను తెరుస్తున్నట్లు తెలిపింది. మరియు పోల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత కొద్ది రోజుల నుంచి విద్యుత్తు, తాగునీరు, ఆహారం, హీటింగ్‌, ‌రవాణా సదుపాయాలను రష్యా దళాలు నిలిపేశాయి. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణ సుమారు ఐదున్నర గంటలపాటు అమలవుతుందని తెలుస్తుంది. ఈ ఐదున్నర గంటల పాటు ఎలాంటి దాడులు జరపమని స్పష్టం చేసింది.

ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయులను తరలించడంతో పాటు దేశ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ విరామం ప్రకటించినట్లు వెల్లడించింది. ఈ మేరకు విదేశీయుల తరలింపునకు సహకరిస్తామని యునైటెడ్‌ ‌నేషన్స్ ‌హ్యూమన్‌ ‌రైట్స్ ‌కౌన్సిల్‌(‌యూఎన్‌హెచ్‌ఆర్సీ)కు రష్యా తెలిపింది. మానవతా దృక్పథంతో విరామం ఇచ్చామని రష్యా పేర్కొంది. విదేశీయులు త్వరితగతిన ఉక్రెయిన్‌ ‌వీడాలని సూచించింది. కేవలం కాల్పుల విరామం మాత్రమే ఇచ్చామని..పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ఆపలేదని స్పష్టత ఇచ్చింది. మరోవైపు ప్రపంచ దేశాల ఒత్తిడితోనే రష్యా ఈ యుద్ధ విరామ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రష్యా తాజా నిర్ణయంతో పది రోజుల నుంచి జరుగుతున్న యుద్దానికి తాత్కాలికంగా కొన్ని గంటలు బ్రేక్‌ ‌పడింది.

పది రోజులయినా రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య… యుద్ధ నివారణ చర్యలకు పడని అడుగు
న్యూ దిల్లీ, మార్చి 5 : ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలు పెట్టి పదిరోజులుకావొస్తున్నా ప్రపంచదేవాలు సమస్యలను రాజేస్తూ ..ఎగదోస్తున్నాయే తప్ప యుద్ధాన్ని నివారించేందుకు రంగంలోకి దిగడం లేదు. ఉక్రెయిన్‌ ‌తగలబడుతున్నా దేశాద్యక్షుడు జెలెన్‌స్కీ ఇంకా బీరాలతో ప్రగల్బాలుపలుకుతున్నారే తప్ప తన కారణంగా ఉక్రెయిన్‌ ‌సర్వనాశనం అవుతుందని గమనించడంలేదు. ఒకవైపు రెండు దేశాలు తగ్గేదే లేదంటుండగా… మరోవైపు నాటో దేశాల రెచ్చగగొట్టే వ్యాఖ్యలు చేస్తుండడంతో సర్వత్రా ఈ యుద్ధం ఎటునుంచి ఎటు దారి తీస్తుందో అనే ఆందోళన నెలకొంది. పది రోజులవుతున్నా యూరప్‌ ‌దేశాలు రష్యాను రెచ్చగొడుతూనే ఉన్నాయి తప్ప యుద్ధ నివారణకు పూనుకోవడం లేదు.

అమెరికా, బ్రిటన్‌, ‌జర్మనీ, యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌సహా వివిధ దేశాలు ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా, దీర్ఘకాలిక పథకంతో రష్యా చేసిన దురాక్రమణ అంటూ నాటో ప్రకటించింది.అయతే ఉక్రెయిన్‌ ‌వ్యవహారంలో భారత్‌ ‌సంయమనం పాటించిన తీరు సరియైనదే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలోనే మనవాళ్ళను సురక్షితంగా స్వదేశానికి తేవడమే ప్రాధాన్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటున్నది. యుద్ధ ప్రభావంతో స్టాక్‌మార్కెట్‌ ‌పతనం, పసిడి ధర 30 శాతం పెరగడం, అంతర్జాతీయ చమురు ధరకూ రెక్కలు రావడం రానున్న గడ్డుకాలానికి సూచనగా కనిపిస్తున్నది. అందుకే ఈ యుద్ధాన్ని నివారించి శాంతి స్థాపన లక్ష్యంగా ప్రపంచ దేశాలు ముందుకు రావాలని అందరూ కోరుకుంటున్నారు.

Leave a Reply