Take a fresh look at your lifestyle.

పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయం భయంగా విద్యార్థులు

  • బడికి పంపడానికి నిరాకరిస్తున్న తల్లిదండ్రులు
  • శిథిలావస్థకు తిమ్మాపూర్‌ ‌ప్రభుత్వ పాఠశాల భవనం

జగదేవ్‌పూర్‌ ‌మండలంలోని తిమ్మాపూర్‌ ‌గ్రామం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని ఓ గ్రామం. ఈ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనం పెచ్చులూడుతూ ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు ఎట్టకేలకు సుదీర్ఘ విరామం తర్వాత అంటే 17 నెలల తర్వాత పున:ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు బడిబాటపట్టారు. తిమ్మాపూర్‌ ‌గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 80 నుంచి 100 మందికిపైగా విద్యార్థులు ఉంటారు. అయితే, పాఠశాల భవనం మాత్రం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో, ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననీ విద్యార్థులు భయం భయంగా చదువులు సాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన విద్యాశాఖ అధికారులు మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయనీ ఈ పాఠశాలను చూస్తే అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

తిమ్మాపూర్‌లో ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పెచ్చులూడుతున్న ఈ పాఠశాలకు పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు సైతం నిరాకరించే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, పెచ్చులూడుతున్న ఈ పాఠశాల భవనాన్ని మరమ్మతుల నిమిత్తం పాఠశాల అభివృద్ధి కోసం గజ్వేల్‌ ‌ప్రత్యేక అధికారి(గడా) ముత్యంరెడ్డి కృషి చేస్తాననీ, కావల్సిన నిధులు మంజూరు చేయిస్తాననీ చెప్పి నెలలు గడుస్తున్నా కూడా ఆచరణలో అమలుకు నోచుకోలేదనీ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం వానా కాలం కావడంతో చినుకు పడితే పాఠశాల చిత్తడిలా మారుతుందీ, ఎప్పుడు ఏ అపాయం జరుగుతుందోనని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు భయం పట్టుకుంది. ప్రమాదాల మధ్య భయంకరమైన వాతావరణంలో విద్య నేర్చుకునే సాహసం చేయలేక పలువురు విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల బాటపడుతున్నారు కూడా. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తిమ్మాపూర్‌ ‌పాఠశాలను మరమ్మతులు చేయాలి, లేదంటే కొత్త భవనాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్థానిక సర్పంచ్‌ ‌లక్ష్మీ రమేష్‌ ‌సిఎం కేసీఆర్‌ను కోరుతున్నారు.

Leave a Reply