Take a fresh look at your lifestyle.

ముంబై తెలుగువారు – కరోనా ప్రభావం

 ‌”ముంబైలో కరోనా తీవ్రమైన వేగంతో విస్తరిస్తోంది. త్వరలోనే వూహాన్‌ ‌నగరాన్ని మించిపోయే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముంబైలో కరోనా విజృంభించడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. విపరీతమైన జనాభా, అందులో 60 శాతం మురికివాడల్లో, సింగిల్‌ ‌రూముల్లో కాపురం ఉండడం, కామన్‌ ‌టాయ్‌లెట్స్ ఉపయోగించడం లాంటివెన్నో ఉన్నాయి. తెలుగు కేంద్రాలైన వర్లీ, ఖేడ్‌గల్లీ, ప్రభాదేవి, లోయర్‌ ‌పరేల్‌, ‌కమాటిపురా, కామ్‌రాజ్‌ ‌నగర్‌లాంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది తెలుగువారు సింగిల్‌ ‌రూముల్లోనే నివాసముంటున్నారు.”

ముంబై..! ఉరుకులు పరుగుల విశ్వనగరం. దేశ ఆర్థిక రాజధాని. క్షణం కూడా నిదురపోని కాస్మోపాలిటన్‌ ‌సిటీ. ముంబైలో బతకలేనివాడు ప్రపంచంలో మరెక్కడా బతకలేడని అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. బతికుంటే ఒక్కసారైన ‘ ముంబై ’ చూడాలని తెలంగాణ ప్రాంతంలో అంటూ ఉంటారు. అలాంటి నగరమిప్పుడు అకస్మాత్తుగా స్థాణువైపోయింది. శిలావిగ్రహంలా నిశ్చలంగా నిలబడిపోయింది. కంటికి కనుపించని మహమ్మారి కరోనా విషప్పురుగు ముంబై నగరాన్ని కట్టిపడేసింది. ముంబై నగరానికి, తెలంగాణ ప్రజలకు అవినాభావ సంబంధం ఉంది. ఈ సంబంధం ఈనాటిది కాదు. దాదాపు మూడు శతాబ్దాల ఆ అనుబంధం ఇప్పటికీ ఇంకా లంగా కొనసాగుతూనే ఉంది. నిరంతరం నిర్లక్ష్యానికి గురైన కోటి గాయాల తెలంగాణ జనజీవనంపై, ముంబాయి, దుబాయి, బొగ్గుబాయిల ప్రభావం ఎంతో ఉంది. దుబాయి, బొగ్గుబాయిలు ఇటీవలి కాలానికి చెందినవైతే ముంబాయి మాత్రం తెలంగాణ ప్రజలకు ఆది నుండి అన్నపూర్ణలాంటిది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతానికి చెందిన కొన్ని జిల్లాల్లో దాదాపుగా ప్రతి ఇంటి నుండి ఒక వ్యక్తి ముంబైకి వలసవెళ్ళిన వాడై ఉండేవాడంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇప్పటికీ నిజామాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ‌వరంగల్‌, ‌మెదక్‌, ‌పాలమూరు, నల్గొండ లాంటి జిల్లాలకు చెందిన లక్షలాది మంది తెలంగాణ ప్రజలు ముంబైలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. వీళ్ళేగాక ప్రతి సంవత్సరం పాలమూరుకు చెందిన వేలాది మంది కూలీలు ఋతువులననుసరించి ముంబైకి వస్తుంటారు..పోతుంటారు. తెలంగాణ సుసంపన్నతలో ముంబై తెలంగాణ ప్రజల పాత్ర ఎంతో ఉంది. సంవత్సరానికి కొన్నివేల కోట్ల రూపాయలు ముంబై నుండి తెలంగాణకు వస్తుంటాయి. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో కూడా తెలుగువారు పాల్గొని అమరులయ్యారు. రాజకీయాల్లో పాల్గొని కార్పొరేటర్‌లుగా, ఎమ్మేల్యేలుగా, లోక్‌సభ సభ్యులుగా, మంత్రులుగా కూడా ఎదిగారు. మహారాష్ట్ర మొదటి స్పీకర్‌ ‌శీలం సయాజీరావు, రెండవ ముఖ్యమంత్రి మారుతీరావ్‌ ‌కన్నంవార్‌ ‌తెలుగువారే కావడం విశేషం. ఎన్నో నగరాల్లో తెలుగువారు మున్సిపల్‌ ‌కౌన్సిలర్‌లుగా, చైర్మెన్‌లుగా పదవులనలంకరించారు. భవన నిర్మాణ రంగంలో ఉంటూ, నేడు పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్న ప్రముఖ భవనాలను నిర్మించి చరిత్రలో తమ స్థానాన్ని సుస్థిరంగా లిఖించుకున్నారు.

సామాజిక రంగంలో ఉంటూ మహాత్మా జ్యోతిబా ఫులే స్థాపించిన సత్యశోధక సమాజానికి ఎంతో అండదండగా నిలబడ్డారు. డా।।బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌ప్రింటింగ్‌ ‌ప్రెస్‌ ‌కోసం స్థలాన్ని కెటాయించడమే కాకుండా ఆర్థిక సహాయం చేసిన ఘనత కూడా తెలుగువారికి ఉంది. శివసేన లాంటి ప్రాంతీయ పార్టీలు ఉద్భవించి, ముంబయిలో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టినప్పుడు కూడా తెలుగువారిపై ఈగ వాలలేదు. మరాఠీయులు తెలుగువారిని ఏనాడూ పరాయివాళ్లుగా చూల్లేదు. కాకపోతే, బాలా సాహెబ్‌ ‌ఠాక్రే ప్రాంతీయ ఉద్యమ ప్రభావం కాస్తో కూస్తో తెలుగువారిపై కూడా పడింది. అది మున్ముందు తెలుగువారు రాజకీయంగా ఎదగడానికి అడ్డుకట్ట వేసింది. చిత్రమేమంటే సోలాపూర్‌కు చెందిన ఒక మహిళ బాలాసాహెబ్‌ ‌ఠాక్రేకు ప్రతి రాఖీ పండగ నాడు సోలాపూర్‌ ‌నుండి ప్రత్యేకంగా వచ్చి రాఖీ కట్టిన తర్వాతే బాలా సాహెబ్‌ ‌ఠాక్రే తన ఇంటి ఆడపడుచులతో రాఖీ కట్టించుకునేవారు. అంతటి విశేషానుబంధం ఉండేది తెలుగు మరాఠీయుల మధ్య. 1970 నుండి ముంబయి తెలుగువారి మధ్య పెరిగిన అంతర్గత అనైక్యత వల్ల రాజకీయంగా ఎదగడం నెమ్మదించింది. గ్లోబలైజేషన్‌ ‌ప్రభావం వల్ల క్రమక్రమంగా తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బట్టల మిల్లుల పరిస్థితి దయనీయంగా మారడం, ఆ తర్వాత అతి పెద్ద సమ్మె జరగడం, ఆ సమ్మె సుదీర్ఘంగా సాగి తనంత తానుగా సమిసిపోవడంతో ఆ మిల్లుల్లో పనిచేసే వేలాది మంది తెలుగువారు రోడ్డున పడ్డారు. ఆర్థిక పునాదులు కదిలిపోయి, ఒక తరం పూర్తిగా దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ స్థితి నుండి లేచి వచ్చిన మరోతరం తమ విద్వత్తుతో ఆధునిక సాంకేతిక రంగాల్లో, విద్య, వైద్య రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ దూసుకుపోయారు. కానీ రాజకీయ రంగంలో మాత్రం చాలా వెనుకబడిపోయారు.

ఏ జాతికైనా రాజకీయ అండ లేకుంటే ఆ జాతి మనుగడ కష్టసాధ్యమవుతుంది. ముఖ్యంగా పరాయి ప్రాంతంలో అయితే అది మరీ కష్టంగా మారుతుంది. ప్రస్తుతం ముంబైలో తెలుగు జాతి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.. మనుగడ కోసం పోరాటం..! ఎన్నో సందర్భాల్లో ముంబైలో తెలుగువారి రాజకీయ శూన్యత కలవరపరిచింది. తెలుగువారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు కూడా..! ఇన్ని శతాబ్దాలుగా ముంబైలో ఉంటున్నప్పటికీ, ఎన్నో రంగాల్లో అగ్రశ్రేణిలో ఉన్నప్పటికీ, వర్తమాన మరాఠీతరం తెలుగువారిని రెండవ తరగతి పౌరుల్లాగే చూడడం నిజంగా విషాదం. అందుకు కారణం రాజకీయంగా మనవాళ్ళు ఉన్నత స్థానంలో లేకపోవడమే..! కాలేజీల్లో అడ్మిషన్‌ల నుండి కులధృవీకరణ పత్రాలు పొందేదాకా తెలుగువారు నానా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. దక్షిణాదికి చెందిన కేరళ, కన్నడ, తమిళవారి కంటే తెలుగువారు ముంబైలో భారీ సంఖ్యలో ఉన్నారు. కానీ, రాజకీయంగా కేరళ, కన్నడ, తమిళులు ఎంతో బలంగా ఉన్నారు. వారి మాట నెగ్గించుకునే సామర్థ్యం కలిగి ఉన్నారు. అదే సమయంలో తెలుగువారి రాజకీయ పరిస్థితి ఇతరులపై ఆధారపడి బతికే స్థాయికి దిగజారిపోయింది. అత్యంత పూర్వవైభవం కలిగిన తెలుగువారి రాజకీయ చరిత్ర నేడు వెలవెలబోతోంది. సయాన్‌ ‌ప్రాంతం నుండి ఎన్నికైన ఒకే ఒక కార్పొరేటర్‌ ‌కృష్ణవేణిరెడ్డి బృహన్ముంబయి మహానగర్‌ ‌పాలికలో తెలుగువారి ఏకైక ప్రతినిధిగా ఉన్నారు.

తెలుగువారిపై కరోనా ప్రభావం:
ఏ జాతైతే బలహీనంగా ఉంటుందో ఆ జాతికి అధిపతులెక్కువగా ఉంటారు. ప్రస్తుతం ముంబైలో తెలుగు వారి పరిస్థితి అందుకు ఉదాహరణంగా చెప్పుకోవచ్చు. శాసించే స్థాయిలో ఉండే తెలుగువారు పాటించే స్థాయికి తగ్గారు. ఇది అన్ని రంగాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది. కరోనా విషయంలో కూడా అదే జరుగుతోంది. ముంబైలో కరోనా తీవ్రమైన వేగంతో విస్తరిస్తోంది. త్వరలోనే వూహాన్‌ ‌నగరాన్ని మించిపోయే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముంబైలో కరోనా విజృంభించడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. విపరీతమైన జనాభా, అందులో 60 శాతం మురికివాడల్లో, సింగిల్‌ ‌రూముల్లో కాపురం ఉండడం, కామన్‌ ‌టాయ్‌లెట్స్ ఉపయోగించడం లాంటివెన్నో ఉన్నాయి. తెలుగు కేంద్రాలైన వర్లీ, ఖేడ్‌గల్లీ, ప్రభాదేవి, లోయర్‌ ‌పరేల్‌, ‌కమాటిపురా, కామ్‌రాజ్‌ ‌నగర్‌లాంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది తెలుగువారు సింగిల్‌ ‌రూముల్లోనే నివాసముంటున్నారు. అయితే, మిగతా వారికంటే తెలుగు వారి జీవనశైలి కాస్త సాంప్రదాయబద్ధంగా ఉండడం, క్రమశిక్షణతో మెదలడం వల్ల కరోనా కేసుల సంఖ్య వారిలో ఎక్కువగా లేకపోయినప్పటికీ, ఇప్పుడిప్పుడే వర్లీ బిడిడి చాల్స్ ‌లాంటి ప్రాంతాల్లో తెలుగు రోగులు పెరుగుతున్నారు. ఈ కరోనా రావడం వల్ల ముంబై యంత్రాంగంలోని లోపాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. ముంబయి నగరం బయటకు కనిపిస్తున్నంతగా లోపల్నుండి పటిష్టంగా లేదనే చెప్పాలి. నిర్వహణ లోపం వల్ల, వివిధ ప్రభుత్వ విభాగాల్లో సమన్వయం లేకపోవడం వల్ల, రోగులు పెరుగుతున్న కొద్దీ పరిపాలనా లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. రోగులు కూడా అయోమయంలో ఉంటున్నారు. ఉన్నత స్థాయిలో ఏర్పాట్లు బాగానే జరుగుతున్నప్పటికీ కింది స్థాయికి వచ్చేసరికి డొల్లాతనం బయటపడిపోతోంది. ఇక్కడే రాజకీయ నాయకుల అవసరం ఏర్పడుతోంది.
గుజరాతీయుల కోసం స్థానికంగా గుజరాతీ నాయకులు బలంగా ఉండడమే కాకుండా గుజరాత్‌ ‌శాసనసభ సభ్యులు కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్‌లు చేసి గుజరాతీయులను పట్టించుకోవాలని విన్నపం చేస్తున్నారు. అట్లాగే బీహార్‌, ‌చత్తీస్‌ఘడ్‌, ‌బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ ‌లాంటి రాష్ట్రాల నుండి కూడా ఉన్నత స్థాయి వ్యక్తులు తమతమ రాష్ట్రాల ప్రజల కోసం నేరుగా ముఖ్యమంత్రికే ఫోన్‌లు చేస్తున్నారు. స్థానిక నేతలు కూడా బలంగా ఉండడంతో ఆయా ప్రాంతాల రోగులకు కాస్త ఓదార్పుగా ఉంటోంది. ఆ మధ్య ఉత్తరాదికి చెందిన ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ‌ఠాక్రేతో జరిపిన సంభాషణ వైరల్‌ అయింది. కానీ, తెలుగు రోగుల్ని పట్టించుకునేందుకు ఒక్కరంటే ఒక్కరు నాయకులు లేకపోవడం దురదృష్టకరం. నెల రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసియార్‌ ‌వలస కూలీల గురించి తనతో మాట్లాడార•ని ఉద్దవ్‌ ‌ఠాక్రే ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఈ మధ్య శివసేన పార్టీ ఉప శాఖ ప్రముఖుడైన ఒక తెలుగు వ్యక్తి కుటుంబంలో కరోనా కేసులు బయటపడితే, మొదట్లో కనీసం పట్టించుకున్న నాయకుడు లేడు. మరో తెలుగు వృద్ధుడు మరణిస్తే డెత్‌ ‌సర్టిఫికెట్‌ ‌కోసం రోజంతా కెఈఎమ్‌ ఆసుపత్రి ఆవరణలో దిక్కుతోచని స్థితిలో కుటుంబం బేజారైపోయింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో..! తెలంగాణ నుండి వలస కూలీలను ఉత్తరాది రాష్ట్రాలకు శ్రామిక రైళ్ళ ద్వారా తరలిస్తున్నారు. మహారాష్ట్ర నుండి కూడా వివిధ రాష్ట్రాలకు వలసకారుల్ని తరలిస్తున్నారు. ప్రముఖ నటుడు సోనూ సూద్‌, ‌తన సొంత డబ్బుల్తో 350 మంది కన్నడిగులను ప్రత్యేక బస్సుల్లో కర్ణాటకకు తరలించాడు. ముంబై నుండి 1200 మంది జాలర్లతో కూడిన ఒక ప్రత్యేక రైలు ఆంధ్రప్రదేశ్‌కు కూడా వెళ్లింది. కానీ, ఇంత వరకు ఒక్కటంటే ఒక్కటి రైలు తెలంగాణకు వెళ్ళలేదు. ముంబై వర్గాల నుండి వచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రైళ్ళ కోసం ఎలాంటి ప్రతిపాదన చేయలేదని తెలుస్తోంది.

ముంబైలో పెరుగుతున్న కరోనా ప్రమాదానికి బయపడి వేలాది మంది తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రానికి తరలి పోవాలనుకుంటున్నారు. వారు ప్రస్తుతం ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారు. కొందరు ప్రాణభయంతో సొంతంగా వేలాది రూపాయలు భరించి ప్రైవేట్‌ ‌కార్లల్లో, బస్సుల్లో తెలంగాణకు బయలుదేరి వెళుతున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబానికి తెలంగాణ వెళ్ళాలంటే దాదాపు 20 వేల వరకు ఖర్చు వస్తోంది. ఈ ప్రైవేట్‌ ‌వాహనాలకు తెలంగాణకు చెందిన ఓ విభాగం నుండి అనుమతులు లభించేవి. ఇప్పుడు అవి కూడా ఇవ్వడం లేదు. ముంబై, ఠాణే, పుణే నగరాల నుండి ఏ ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం తరఫున అనుమతులు లభించడం లేదు. ఈ అంశంపై ముంబయి తెలంగాణ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోతోంది. ఒక వైపు కరోనా మహమ్మారి భయం..మరో వైపు స్వరాష్ట్రానికి వెళ్లేందుకు విపరీతమైన అడ్డంకులు. సామాన్యజనం విలవిలలాడుతున్నారు. ‘‘ముంబైలో ఉన్న మేమందరం కరోనా రోగులం కాదనీ, సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతులు ఎందుకు అవసరమని, సరిహద్దుల్లో పరీక్షలు జరిపి అనుమానస్పదంగా అనిపించిన వ్యక్తిని హాస్పిటల్‌కి, సామాన్యంగా ఉన్నవారిని ప్రభుత్వ విధానాల ప్రకారం హోం క్వారంటైన్‌కి పంపించకుండా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారనీ..’’ వందలాది తెలంగాణ బిడ్డలు వాట్సాప్‌ ‌సమూహాల్లో వాపోతున్నారు. ‘అన్ని వర్గాల వారి గురించి ఆలోచిస్తున్న ముఖ్యమంత్రిగారు మా గురించి ఎందుకు ఆలోచించడం లేదని..’ ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ నుండి వలసకార్మికుల్ని ఆయా రాష్ట్రాలకు ఎంతో ఆత్మీయంగా తరలిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయ కేసియార్‌గారు, ముంబైలో ఉంటూ, తెలంగాణకు రావాలనుకుంటున్న తెలంగాణ బిడ్డల గురించి కూడా కాస్త మానవీయ కోణంలో ఆలోచించాలనీ, ఇందుకోసం ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమించి ఆదుకోవాలని కొందరు ముంబైలోని తెలుగు ప్రముఖులు కోరుతున్నారు.

Leave a Reply