Take a fresh look at your lifestyle.

జలవిలయం గుప్పిట్లో జగిత్యాల

తెగిన రహదారులు..లోతట్టు ప్రాంతాలు జలమయం
పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
మత్తడి దుంకుతున్న చెరువులు కుంటలు
నేలకూలుతున్న పాత ఇండ్లు
కొట్టుకుపోయిన పొలాలు..కూరగాయ పంటలు ద్వంసం
పరిస్థితిని పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్‌ ఎస్పీ
గోదావరి ఉగ్రరూపం.. తీరప్రాంత ప్రజల అప్రమత్తం
జగిత్యాల అర్బన్‌, ‌జూలై 23 (ప్రజాతంత్ర విలేఖరి) : జల విలయం గుప్పిట్లో జగిత్యాల విలవిల లాడుతోంది. కుండపోతగా కురుస్తున్న వర్షం ధాటికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న వర్షాలతో జగిత్యాల జిల్లా జల ప్రళయం తో నీటమునిగింది. ఎక్కడా చూసినా వరద నీటి ప్రవహంతో రహదారులు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జగిత్యాల జిల్లా ప్రజానీకం రోడ్ల మీదికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పాత ఇల్లు నేలమట్టం అవుతున్నాయి. పలువురు రైతులు ఇటీవలి వర్షాలకు పొలాలు దున్ని నాట్లు వేయగా వరద నీటి ప్రవాహంలో కొట్టుకు పోయాయి. కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి. ఎక్కడ చూసినా వరద బీభత్సంతో భయానక పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో రహదారులు తెగిపోగా, విద్యుత్‌ ‌స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో జగిత్యాలలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రం నుండి వెళ్లే అన్ని రహదారుల పై నుండి నీరు ఉదృతంగా ప్రవహిస్తుండ టంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. నీట మునిగిన గోతులతో రహదారులు ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలు వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. జగిత్యాల ధర్మపురి వెళ్లే రహదారిపై జగిత్యాల మండలంలోని అనంతారం, ఆకసాయి పల్లె వద్ద పసుల పాపన్నగుట్ట వద్ద లో లెవల్‌ ‌వంతెనల పై నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో ధర్మపురి, మంచిర్యాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు వరుస కట్టాయి.

కోరుట్ల, మెట్పల్లి, సారంగాపూర్‌, ‌ధర్మారం,ధర్మపురి వెళ్లే రహదారులన్నీ అన్నింటిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో• రాకపోకలఅంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చెరువుల నుండి చేపలు వరద ఉధృతికి ప్రవాహంలో కొట్టుక పోవడంతో జాలర్లు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాను ఆనుకుని ఉన్న గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీరాంసాగర్‌, ‌కడెం ప్రాజెక్టులు నీటితో నిండి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. వరద నీటి ప్రవాహంతో గోదావరి పోటెత్తుతుంది.• గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేపల వేటకు, పశువులమేతకు గోదావరి తీర ప్రాంతానికి వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి నిండుగా ప్రవహిస్తుండటంతో తీరప్రాంత ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. అన్ని గ్రామాల గోదావరి తీర ప్రాంత గ్రామాల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ ‌రవి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ని వెల్గటూర్‌ ‌మండలం లోని కోటిలింగాల వద్ద గోదావరి వరద ఉధృతిని కలెక్టర్‌ ‌పరిశీలించగా, ఎస్పీ ధర్మపురిలో గోదావరి తీరా ప్రాంతాన్ని పరిశీలించారు. లోతట్టు ప్రాంత ప్రజలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. పలు గ్రామాల్లో మట్టి ఇల్లు నేలకూలాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కంట్రోల్‌ ‌రూమ్‌ ‌కు ఫోన్‌ ‌చేయాలని కలెక్టర్‌ ‌రవి కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయంలో కంట్రోల్‌ ‌రూమ్‌ ‌ను అధికారులు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ‌రవి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ ‌సూచించారు.

Leave a Reply