Take a fresh look at your lifestyle.

మేటి జర్నలిస్టును కోల్పోయిన తెలుగు పత్రికారంగం

తెలుగు పత్రికారంగం అత్యంత విలువలతో కూడిన పాత్రికేయుడిని కోల్పోయింది. ఈ రంగానికి దశాబ్దాలుగా సేవలందించడం తోపాటు, జర్నలిజంలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రవేసుకున్న వ్యక్తి శకం గురువారంతో ముగిసిపోయిందంటే ఎవరూ నమ్మలేకున్నారు. అయిదు దశాబ్దాలుగా ఈ రంగంలో ఎనలేని సేవలందించినప్పటికీ ఏదో ఒక రాజకీయపార్టీకి అనుకూలుడన్న ముద్ర లేకుండా వృత్తి ధర్మాన్ని కాపాడిన వ్యక్తి డా।। పొత్తూరి వెంకటేశ్వర్‌రావు. సంపాదకులు తప్ప పత్రికా యజమానులెవరన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేని కాలం నుండి ప్రారంభించిన తన పాత్రికేయ ప్రస్తానాన్ని చివరి వరకు ఒకే పద్దతిలో కొనసాగించారు. అత్యంత సరళమైన తెలుగులో, సామాన్యుడికి కూడా సులభంగా అర్థమయ్యేరీతిలో ఆయనరాసిన సంపాదకీయాలు పలువురిని ఆసక్తిగా చదువనిచ్చేవంటే అతిశయోక్తికాదు. తుదిశ్వాస విడిచేవరకు ఆయన తెలుగుభాష వికాసంకోసం పాటుపడినవ్యక్తి. మేటి పాత్రికేయుడిగా ఆయనకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ రంగాలతో పాటు ఆధ్యాత్మిక, చమత్కార రచనలు కూడా పలువురిని ఆకట్టుకునేవిగా ఉండడం ఆయన అపార జ్ఞానసంపదకు అద్దంపట్టేవిగా ఉన్నాయి.

అలాంటి చమత్కార రచనలను ప్రచురించే భాగ్యం ‘ప్రజాతంత్ర’కు కూడా దక్కింది. దాదాపు ఇరవై ఏళ్ళకింద(1998-99) ‘కాసులయ్య సుద్దులు’ పేర యాభై వారాలపాటు వరుసగా ఓ వ్యంగ్య రచనను ప్రజాతంత్ర పాఠకులకు ఆయన అందించడం విశేషం. దానికి ప్రముఖ కార్టూనిస్టు ఆలూరి సత్యం వ్యంగ్య చిత్రాలు వేశారు. తాజాగా 2017లో ‘బులేనా’ పేర మరో వ్యంగ్య వ్యాఖ్యల పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంలో తన ఈ వ్యంగ్య రచనలకు దోహదపడింది ఆలూరి సత్యం కార్టూనులేనని చెప్పడం ఆయన గొప్పతనం. 1957లో ‘ఆంధ్ర జనత’ పత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టిన పొత్తూరి ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త పత్రికల్లో ప్రజలు గుర్తుంచుకునే రచనలెన్నో చేశారు.

కేవలం రచనలే కాకుండా ఆ రంగంలో విలువలను కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేసిన వ్యక్తాయన. ‘నాటి పత్రికల మేటి విలువేది’ లాంటి ఆయన రచించిన పుస్తకాలు(2000లో) నేటి తరం జర్నలిస్టులకు మార్గదర్శిగా ఉన్నాయి. అందుకే ఆయనను విలువలతో కూడిన జర్నలిజానికి ఆధ్యుడిగా పేర్కొంటారు. విలువలు, ప్రమాణాలతో కూడిన జర్నలిజాన్ని పరిరక్షించుకోవడం కష్టతరమవుతుందంటూ ఓ సందర్భంలో ఆయన ఆవేదన చెందారు. 2001లో ఆయన రాసిన చింతన, చిరస్మరణీయులు పుస్తకాలు కూడా ఆయనకు మంచిపేరును తెచ్చిపెట్టాయి. ఆయన గొప్ప చదువరి. ఏ పుస్తకాన్ని అయినా ఆసాంతం చదువందే విడిచిపెట్టేవారు కాదట. అలాగే దాన్ని పూర్తిగా ఆకళింపుచేసుకునేవాడు. మంచిగా చదవటం, మంచిగా రాయటమేకాదు.. మంచిగా మాట్లాడటం కూడా మనిషికి ఎంత్తైనా అవసరమని ఓ సందర్భంలో ఆయన చెప్పినమాటలకు తగినట్లుగానే చాలా మృదువుగా, స్పష్టంగా, మితంగా మాట్లాడేవారాయన. సాహితీకారు లందరితో ఆయనకు అత్యంత సాన్నిహిత్యం ఉండేది. వారందరికీ ఆందుబాటులో ఉండేవాడు. సంగీతంలో పెద్దగా ప్రవేశం లేకపోయినా సంగీతాన్ని ఇష్టపడేవాడు, ఆస్వాదించేవాడు. ఆంగ్లసాహిత్యాన్ని కూడా అభిమానించే వ్యక్తికావడంతో ఆయనకు చాలాకాలం బ్రిటీషు లైబ్రరీలో సభ్యత్వం ఉండేది. బహుభాషా కోవిదుడు, మేధావిగా పేరున్న దివంగత ప్రధాని పి.వి. పట్ల చాలా గౌరవభావంగా ఉన్న వ్యక్తి. పివి గురించి ‘ఇయర్స్ ఆఫ్‌ ‌పవర్‌’ ‌పేర రచించబడిన పుస్తక సహ రచయితగా ఉన్నారాయన. తిరుపతి తిరుమల దేవస్థానం ప్రచురణలకు సంపాదకుడిగా కూడా పనిచేశారు. కాగా, వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు, విధి నా సారధి, పారమార్ధిక పదకోశంతో పాటు ‘చింతన’ లాంటి ఆధ్యాత్మిక రచనలెన్నో ఆయన కలం నుండి వెలువడినాయి. ఎంతోమంది జర్నలిస్టులను తీర్చిదిద్దిన పొత్తూరి పాత్రికేయులు పాటించాల్సిన నైతిక విలువలగురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రెస్‌ అకాడమీ చెర్మన్‌గా పలు శిక్షణాతరగుతుల్లో బోధించేవాడు.

కేవలం అలంకార ప్రాయంగానే పదవిలో కొనసాగుకుండా ముందు తరాలవారికి ఉపయోగపడే విధంగా పాత పత్రికలన్నిటినీ డిజిటలైజ్‌ ‌చేయించడం ఆ వృత్తిపై ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తున్నది. వాస్తవానికి ఆయన పుట్టింది ఆంధ్రలో అయినా తెలంగాణ పట్ల, ఇక్కడి ప్రజల పట్ల ఆయనకు ఎనలేని అభిమానం. 1934 ఫిబ్రవరి 8న వెంకటసుబ్బయ్య, గంగమ్మ దంపతులకు గుంటూరు జిల్లాలో జన్మించిన పొత్తూరి వెంకటేశ్వర రావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని కోరుకున్న వ్యక్తి. తెలంగాణ ఉద్యమానికి మైలురాయిగా చెప్పుకునే 1969నాటి ఉద్యమకాలంలో తెలంగాణపై ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ పొత్తూరి అభిప్రాయాన్ని కూడా తీసుకుందంటేనే తెలంగాణ ఏర్పాటును ఆయన ఎంత బలంగా వాంచించింది అర్థమవుతోంది. 1969 మొదలు 2014వరకు కూడా ఆయన అదే మాటమీద నిలబడిన వ్యక్తి. ప్రజాస్వామ్యవాదిగా ఒక ప్రాంత వెనుకబాటుతనాన్ని అర్థం చేసుకున్న మానవతావాది. అదే సమయంలో ఆంధ్రను కూడా అభిలశించిన వ్యక్తికావడం వల్లే ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంతులేని అభిమానులున్నారు. ఆదేరీతిలో ప్రభుత్వం, నక్సలైట్ల మధ్య సామరస్య శాంతి చర్చల్లో నాటి ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఆర్‌ ‌శంకరన్‌ ‌నాయకత్వంలో చర్చలు జరిపాడంటేనే ఆయనకున్న అవగాహనను అంచనా వేసుకోవచ్చు. హింసను తగ్గించి, సామాజిక ఆర్థిక పురోభివృద్ధి జరుగాలన్నదే ఈ చర్చల సారాంశం. ఇంతటి ప్రతిభావంతుడిని తెలుగు పత్రికారంగం కోల్పోవడం దురదృష్టకరం. మానవతావాది డా।। పొత్తూరి వెంకటేశ్వర రావు ఆత్మకు శాంతి కలుగాలని ‘ప్రజాతంత్ర’ కన్పీళ్ళతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది.

Leave a Reply