Take a fresh look at your lifestyle.

అసాధారణ ప్రయత్నం…

తెలుగు సాహిత్యంలో ప్రామాణికతను పొందుగుకుని విశేషాదరాభిమానాలను పొందింది శతకం. అనుభవైక సంవేదననూ, ఒక అభిరుచినీ, ఒక విమర్శాదృష్టిని  కలిగించడంలో శతకానికి ప్రాధాన్యత ఉంది. ముఖం వ్యాకరణం స్మృతమ్‌…. ‌వేదానికి వ్యాకరణం ముఖప్రాయమని వైయాకరణులు భావించారు. శతకానికి ఛందస్సు ప్రధానమైనప్పటికీ సరళమైన పదజాలంతో పండిత పామర ప్రీతిపాత్రంగా సాగిన శతకాలు తెలుగులో ఎన్నో లభిస్తాయి. మారిన కాలానికి అనుగుణంగా శతరచనకు వస్తువులో  కూడా మార్పులొచ్చాయి. భక్తి, నీతి, వైరాగ్యాల వంటి అంశాలతో శతకాలు ఎన్నెన్నో ఉన్నాయి. సర్వోన్నతమైన మానవతా  విలువలు చాటడం, ప్రకృతి శక్తుల పట్ల ప్రేమాభిమానాలను పెంపొందించి యువతలో ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపడం, సామాజిక రుగ్మతలను నిరసించడం వంటి అనేక ప్రగతిశీల ఆలోచనలతో సమకాలీన సామాజిక అంశాలపై చిగురుమళ్ల శ్రీనివాస్‌ 101 ‌శతకాలను రచించారు.

అక్షరయజ్ఞం చేసి తెలుగు భాషకు శతశతాభిషేకం జరిపారు. ఆటవెలది  ఛందస్సులో ఎంతో సరళమైన పదజాలాన్ని సమకూర్చుకుని పండిత పామర జనరంజకంగా శ్రీనివాస్‌ ‌శతక రచన సాగించారు. తెలుగు  భాషా శతకము – 2లో భూరి కృషిని రంగరించుకున్న పద్యాలున్నాయి. సహజ స్వచ్ఛతను నిత్య చైతన్యశీలమై సంతరించుకుని వెలుగొందేది అమ్మభాష. నిజమైన  మాధు ర్యగుణం ఆ భాషను పొందడం ద్వారా అందరి అంతరాళాల్లో ప్రతిధ్వనించాలని శ్రీనివాస్‌ ఒక పద్యంలో ఇలా చెబుతారు…
నింగినేల నిజము నీరు గాలి నిజము
                  అమ్మపాలు నిజము అమ్మ నిజము
                  అమ్మ ప్రేమ నిజము అమ్మ భాష నిజము
                  తెలుసుకొనుము నిజము తెలుగువాడ!
పద్యం తెలుగు వారి గుండె మీద ప్రవహించే పౌరుషం. హృద్యమైన కలాలు జాలువార్చిన విద్యుల్లతలు పద్యాలు. అమేయమై, అజరామమైన ఆ పద్య ప్రాభవాన్ని ఆలోచనాత్మకమైన రీతిలో చెప్పారిలా…
            మధుర భావములకు మన ఇల్లు పుట్టిల్లు
                  మహిని పద్య విద్య మనకె చెల్లు
                  కవనపు విరిజల్లు పవడంపు హరివిల్లు
                  పులకరించునోళ్ళు తెలుగువాడ!

తెలుగును కాపాడుకోవాలంటే ప్రతిగడపలో ఎవరికి వారే బాధ్యతతో భాషా దీపాలను వెలిగించాలంటారు. సీమ భాషకేమొ చీరలు  సారెలా…. తల్లి భాషకేమొ చిల్లుముతకా అని ప్రశ్నిస్తూ ముందుకొచ్చి ప్రశ్నించి పరిరక్షణ యజ్ఞంలో  భాగస్వామిగా మారమని పిలుపునిస్తారు శ్రీనివాస్‌.
తెలుగు పూలపాదు తెగులు సోకగరాదు
                  పూలువాడి నేల రాలరాదు
                    మొదలు ఎండరాదు మోడుగా మనరాదు
                   తెలుగు వీడరాదు తెలుగువాడ!

మహాకవుల వరప్రదాయిని తెలుగు. ప్రాచీనతను, అర్వాచీనతను సింగారించుకున్న తెలుగును తలపోస్తూ అమృత భాండాల్లాంటి రెండు  పద్యాలు ఈ శతకంలో కనిపిస్తాయి.

నన్నె చోడసుకవి నన్నయ తిక్కనల్‌
                   ‌భవ్యముగను బాట పరచినారు
                   సిరుల  గూర్చినాడు శ్రీనాధు సీసాలు
                   తెలుగు వీడకోయి తెలుగువాడ!
 
                   భూరిగొంతు తోడ పోతన్న పద్యాలు
                   అన్నమయ్య కీర్తనాళి నీవు
                   పాడవోయి తెలుగు పారవశ్యమున
                   తెలుగు వీడకోయి తెలుగువాడ!

భాషని మరచిపోవడం మన అస్తిత్వానికి దూరమవడమేనని అంటారు. తెలుగు ధనమని, ఒకవరమని అంటూ మాట్లాడడం మరచిపోయి పరుల భాష కోసం పరుగులు పెడితే మట్టిగడ్డలమై పోతామని హెచ్చరికతో కూడిన హతవు  పలికారు. తెలుగు గొప్పదనం తెలిసి కార్యోన్ముఖులను కమ్మంటారు.

    అందమైన తెలుగు అవనికే ఘనవెల్గు
                  రమ్యమైన తెలుగు రత్నమగుచు
                  తెలుగు ఎచట కలదొ తేనెలచటకురియు
                  తెలుగు వీడకోయి తెలుగువాడ!

మాతృభాష పరిరక్షణ ఇప్పటి తక్షణ అవసరమంటూ ఇందుకోసం ధీటైన కృషి బహుముఖంగా జరగాలని శ్రీనివాస్‌ ఆకాంక్షిస్తారు. మాసిపోక ముందే ఘన భాషయైన మన భాషను కాపాడుకుందామటారు.

       మట్టివాసనలను మరువదగునె నీవు
                   మాతృభాష నీవు మరువదగునె
                   మనదియనెడి భాష మరచిపోవదగునె
                   తెలుగు మాటలాడు తెలుగువాడ!
పరవశాన్ని ఇచ్చేది పద్యమంటూ ధరణి పులకించేలా ఆ మాధుర్యాన్ని ఆస్వాదించి అంతటి మధురిమను అందరికీ పంచమని సందేశిస్తారు.

 పరవశించవోయి పాల్కుర్కి సోమన్న
                     పద్యములను నీవు పాడుకొనుచు
                     ధరణి పులకరింప దాశరథి పఠించు
                     తెలుగు తిరిగి తెమ్ము తెలుగువాడ!

ఆలోకనం అంటే చూపు అని అర్థం. సృష్టిలో  చూపు ప్రధానమైంది. చూడగలిగిన శక్తి ఉన్నప్పుడే దర్శించిన దాని నుండి ఆనందాన్ని అందుకోగలుగుతాం. తెలుగును కాపాడుకోవాలన్న దృష్టి అందరిలో పెరిగి రక్షణకు ద్వారాలు తెరుచుకోవాలన్న ప్రగాడాభిలాషను ఈ శతకంలోని ప్రతిపద్యం వ్యక్తం చేసింది. చిలకమర్తి, తాపీ ధర్మారావు, చిన్నయసూరి,  ఉన్నవ, అడవి బాపిరాజు, అక్కిరాజు, భక్తరామదాసు, బమ్మెరపోతన, అల్లసాని, మొల్ల, అన్నమయ్య, కట్టమంచి, పానుగంటి, త్యాగరాజు, కృష్ణదేవరాయలు, సోమశేఖరశాస్త్రి, రాళ్ళపల్లి,  పాల్కురికి సోమన్న, దాశరథి, జాషువా, కొప్పరపు వంటి ఎందరెందరో తెలుగు వృద్ధికి చేసిన కృషిని పద్యాలలో స్మరించుకుని వారి స్ఫూర్తితో శ్రీనివాస్‌ ‌భావితరాలకు కర్తవ్యాన్ని సూచించారు. సకల జనులు మెచ్చిన ధీటైన భాషయైన తెలుగును కాపాడుకోమని చెబుతారు.

                     తెలుగు  భాషతోడ తెగిపోదు బంధము
                     అందమైన మట్టి చందమదియె
                     మాతృబంధమిదియె మాసిపోబోదురా
                     తెలుసుకొనుము నీవు తెలుగువాడ!
మాతృభాషలోనే పిల్లలకు పునాది వేసి మన భాష, సాహితీ సౌరభాల గొప్పతనం వారికి అందించాలని గొప్ప సంకల్పంతో ఈ పద్య యజ్ఞం సాగింది.
 – తిరునగరి శ్రీనివాస్‌
                               8
466053933 

Leave a Reply