Take a fresh look at your lifestyle.

ప్రాచీన భాషల కమిటీలో ‘తెలుగు’కు దొరకని ప్రాధాన్యత

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ : ప్రాచీన భాషల కమిటీలో తెలుగువారి ప్రాధాన్యం ఇవ్వరా? అంటూ రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ‌ప్రశ్నిచారు. మైసూరులోని భారతీయ భాషల విశ్వవిద్యాలయం విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించడానికి, ప్రాచీనభాషల కేంద్రాలను ఈ విశ్వవిద్యాలయంతో కలిపే విషయమై తగు సూచనలు ఇవ్వాల్సిందిగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11మంది సభ్యుల కమిటీలో తెలుగువారికి ప్రాతినిధ్యం కల్పించకపోవడం విచారకరమని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అన్నారు.

ఈ చర్య ఎంతమాత్రం సరికాదని ఆయన ఎలుగెత్తారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్లో నెల్లూరు ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రంపై మాట్లాడిన ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు విశ్వవిద్యాలయాల శాఖలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని భారతీయ ప్రాచీన భాషల విశ్వవిద్యాలయంతో కలపవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం గతంలో మైసూరులో ఉండేదని, అయితే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవతో ఈ కేంద్రాన్ని నెల్లూరుకు తరలించారని తెలిపారు. తెలుగు కేంద్రానికి సంచాలకుల నియామకం తర్వాత ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయని, మైసూరులోని భాషా సంస్థను భారతీయ భాషల విశ్వవిద్యాలయంగా మార్చాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా, నెల్లూరులోని కేంద్రం స్వయం ప్రతిపత్తిని కోల్పోయి దాని అభివృద్ధి కుంటుపడుతుందని కనకమేడల రవీంద్రకుమార్‌ ‌కేంద్రానికి రాజ్య సభ జీరో అవర్లో తెలిపారు.

Leave a Reply