- బాకీలు చెల్లించకపోవడంపై మండిపాటు
- తక్షణం కదలిన సర్కార్
- వెంటనే బకాయిలు చెల్లించాలని
- టెలికాం సంస్థలకు తాఖీదులు
టెలికాం సంస్థలపై సుప్రీమ్‌కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టెలి సంస్థలు సవరణ సుమారు 1.5 లక్షల కోట్ల బాకీ చెల్లించకపోవడాన్ని సుప్రీం తప్పుపట్టింది. భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలికమ్యూనికేషన్స్ సంస్థలకు సుప్రీం సమన్లు జారీ చేసింది. ఆయా కంపెనీలు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు సుప్రీం పేర్కొన్నది. మార్చి 17వ తేదీ ఆ కంపెనీల డైరక్టర్లు కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ ఆదేశించింది. ఎన్ని ఆదేశాలు ఇచ్చినా.. టెలికాం కంపెనీలు చలించడం లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్దుల్ నజీర్, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. ఇప్పటి వరకు ఏజీఆర్‌కు సంబంధించిన బాకీల నుంచి టెలికాం కంపెనీలు నయా పైసా కూడా చెల్లించలేదని జస్టిస్ మిశ్రా ఆవేశంగా అన్నారు. ఇంత అర్థంలేని వ్యవస్థను ఎవరు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని జస్టిస్ మిశ్రా ఊగిపోయారు.
ఈ దేశంలో చట్టానికి స్థానంలేదని, ఈ దేశంలో జీవించడం కన్నా.. మరో దేశానికి వెళ్లడం మేలు అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. టెలికాం సంస్థల బాకీల గురించి తనను అడగాల్సిన అవసరం లేదని టెలికాంశాఖ అధికారి అటార్నీ జనరల్‌కు రాసిన లేఖను కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. టెలీ సంస్థల నుంచి డబ్బులు వసూల్ చేయరాదు అని శాఖాధికారి ఎలా ఆదేశాలు ఇస్తారని కోర్టు ప్రశ్నించింది. సుప్రీం ఆదేశాలను ఓ డెస్క్ ఆఫీసర్ ఎలా అడ్డుకుంటారని జస్టిస్ మిశ్రా ప్రశ్నించారు. డబ్బు ఉందన్న అధికారంతో ఆ డెస్క్ ఆఫీసర్ ఇలా చేశారని, లేదంటే కోర్టు ఆదేశాలను ఎలా అడ్డుకుంటారని మిశ్రా అన్నారు. బాకీలను 90 రోజుల్లో చెల్లించాలని గత ఏడాది అక్టోబర్‌లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. జనవరి 24వ తేదీ వరకు ఆ ఆదేశాలు ముగిశాయి. కానీ టెలికాం కంపెనీలు బాకీ డబ్బులు చెల్లించలేదు. దీంతో కోర్టు సీరియస్ అయ్యింది.