Take a fresh look at your lifestyle.

బిజెపి జేబు సంస్థగా ఈడి

విచారణపేరుతో వేధించడం దారుణం
మోడీ అవినీతి చిట్టాలను వెలికి తీయాలి
విపక్ష గొంతును నొక్కేందుకు బెదిరింపు కేసులు
గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్‌ ‌నేతల మండిపాటు
తెలంగాణ ఇచ్చిన సోనియాకు మద్దతు : గాంధీ భవన్‌ ‌సత్యాగ్రహ దీక్షలో గద్దర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌నిరసన దీక్షలు చేపట్టింది. ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్త ప్రదర్శనలకు కాంగ్రెస్‌ ‌పిలుపునిచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ ‌గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ‌నేతలు సత్యాగ్రహ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా నేతలు కేంద్రం తీరును దుయ్యబట్టారు. సత్యాగ్రహ దీక్షలో వీహెచ్‌ ‌మాట్లాడుతూ…బీజేపీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు సోనియా, రాహుల్‌ను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హావి•ల నుండి ప్రజల దృష్టి  మరల్చడానికే ఈడీ కేసులు అని వీహెచ్‌ ‌పేర్కొన్నారు.  సీనియర్లతో మాట్లాడితే అధిష్టానానికి వాస్తవాలు తెలుస్తాయన్నారు. బీజేపీ గెలుస్తదని కొందరు కలలు కంటున్నారని వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీని జైల్లో పెడితే దేశం అగ్నిగుండం అవుతుందని అన్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఒక బ్లాక్‌ ‌మెయిలర్‌ అని విరుచుకుపడ్డారు. ఒకే కేసులో విచారణకు ఇన్నిన్ని గంటలు అవసరమా? అని ప్రశ్నించారు. ఈడీ దగ్గర దమ్ము లేదని విమర్శించారు. నాగపూర్‌ ‌నుండి అడ్వైజ్‌ ‌రాగానే ఇక్కడ రెచ్చగొట్టే టెర్రరిస్టులు బీజేపీ వాళ్లు అని ఆయన మండిపడ్డారు. ఇన్నిరోజులు ఎగరేయని జెండా ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వొచ్చినప్పుడు బీజేపీ పుట్టనేలేదన్నారు. అక్టోబర్‌ 2‌న కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు జెండా ఎగురేయాలని పిలుపునిచ్చారు. బండి సంజయ్‌ ఏం ‌చేస్తున్నాడని..ఊర్లు తిరుగుతున్నారని నిలదీశారు. పీసీసీ మాజీ చీఫ్‌ ‌పొన్నాల మాట్లాడుతూ…ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డిపై పరోక్ష విమర్వలుచేశారు. ఈడీ  పిలిస్తే వెళ్ళాలని కొందరు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రధాని నరేంద్ర మోదీది నీచ చరిత్ర అంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోవడం సిగ్గుచేటన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీజేపీలో కలుపుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. రాహుల్‌, ‌సోనియా గాంధీలపై ఈడీ విచారణ కుట్ర పూరితమేనని అన్నారు. మోదీ దుబారా ఖర్చులపై సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు ఎందుకు కళ్లు మూసుకుంటున్నాయని ప్రశ్నించారు. ‘మోదీ…నీ మేకిన్‌ ఇం‌డియా’ ఎక్కడికి పోయిందని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. గాంధీ వారసులను సావర్కర్‌, ‌గాడ్సేల వారసులు  ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఈడీ బీజేపీ అనుబంధ సంస్థ లాగే పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్‌ ‌నాయకులపైనే ఈడీ కన్ను అని..దేశాన్ని దోచుకుంటున్న వాళ్ల పట్ల కళ్ళు మూసుకుందని మండిపడ్డారు.

బ్రిటీష్‌ ‌వాళ్ళు ఇండియాని దోచుకుంటున్నట్టు ఇప్పుడు కొందరు దోచుకుంటున్నారన్న సీతక్క..ప్రతి వస్తువుపై గబ్బర్‌ ‌సింగ్‌ ‌ట్యాక్స్ ‌వేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ ‌విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీది నీచ చరిత్ర అని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు షబ్బీర్‌ అలీ అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోవడం సిగ్గుచేటన్న ఆయన.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తమతో కలుపుకొని ప్రభుత్వాలని ఏర్పాటు చేయడం దుర్మార్గమని విమర్శించారు. రాహుల్‌, ‌సోనియాలపై ఈడీ విచారణ కుట్ర పూరితమన్నారు. మోడీ దుబారా ఖర్చులపై సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు ఎందుకు కళ్లు మూసుకుంటున్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌పార్టీని డ్యామేజ్‌ ‌చేయడానికే..సోనియా, రాహుల్‌పై ఈడీ దర్యాప్తు చేస్తుందని కాంగ్రెస్‌ ‌నాయకులు మల్లురవి మండిపడ్డారు. సోనియా, రాహుల్‌కి ప్రజాస్వామిక వాదులు అండగా ఉండాలన్నారు. తప్పుడు కేసులతో కాంగ్రెస్‌ ‌నేతలను అవమానపరిస్తున్నారని..ఎంతకాలం తమ నాయకులను వేధిస్తారో  అంతకాలం కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు పోరాడుతూనే ఉంటారని చెప్పారు. దీక్షలో ఇంకా కాంగ్రెస్‌ ‌నేతలు మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, దామోదర్‌ ‌రెడ్డి,అంజన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.  పార్టీ మారే యోచనలో ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డిపై పీసీసీ మాజీ చీఫ్‌ ‌వీ.హనుమంతరావు సెటైర్లు విసిరారు.

తెలంగాణ ఇచ్చిన సోనియాకు మద్దతు : గాంధీ భవన్‌ ‌సత్యాగ్రహ దీక్షలో గద్దర్‌
‌భౌగోళిక తెలంగాణ రావడంలో సోనియా గాంధీ పాత్ర గొప్పది అని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. గాంధీ భవన్‌లో జరుగుతున్న సత్యాగ్రహ దీక్షలో గద్దర్‌ ‌మాట్లాడుతూ… భౌగోళిక తెలంగాణ ఏర్పాటులో ప్రధానపాత్ర పోషించిన సోనియాను ఇబ్బంది పెట్టడాన్ని ఖండిస్తున్నానన్నారు. అనారోగ్యం తో ఉన్న సోనియాని ఈడీ పిలవడంపై గద్దర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌  ‌నాయకులు గ్రామాలకు వెళ్లి సోనియా గాంధీ గూర్చి చెప్పాలన్నారు. గ్రామాలకు వెళ్ళాలని  కాంగ్రెస్‌ ‌నాయకులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల దగ్గరికి వెళ్ళడం తప్పా మనకి వేరే మార్గమే లేదన్నారు. పార్లమెంట్‌ ‌ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బతకడం అవసరం అని తెలిపారు. సోనియాకి కష్టం వచ్చిందని పల్లెపల్లెకి వెళ్లి ప్రచారం చేయండని కాంగ్రెస్‌ ‌నేతలకు గద్దర్‌ ‌సూచన చేశారు.

Leave a Reply