Take a fresh look at your lifestyle.

తెలంగాణా జిందాబాద్‌ !

ఇది హైదరాబాద్‌ ‌సంస్థానం విముక్తి (ఆ సంస్థానంలో అత్యధిక భాగం తెలంగాణం గనుక తెలంగాణ విముక్తి అని చెప్పవలసి ఉంటుంది.) శుభసందర్భం. డెబ్భై మూడు సంవత్సరాల కిందట 1948 సెప్టెంబర్‌ 17‌వ తేదీనాడు తెలంగాణ ప్రాంతం, హైదరబాద్‌ ‌సంస్థానంలో భాగంగా ఉన్న మరాఠ్వాడ, కన్నడ ప్రాంతాలు నిజాం రాజు నిరంకుశత్వం శృంఖలాలనుంచి, రజాకార్‌ ‌మతోన్మాదుల రాక్షసత్వం నుంచి విముక్తి పొందాయి. భారత యూనియన్‌ ‌సైన్యం 1948 సెప్టెంబర్‌ 13‌వ తేదీన ప్రారంభించి కేవలం ఐదు రోజులలో ముగించిన ‘ఆపరేషన్‌ ‌పోలో’ (పోలీస్‌ ‌చర్య) పర్యవసానంగా ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌బహద్దుర్‌ ‌బేషరతుగా లొంగిపోయి తల వంచక తప్పలేదు. అది ఏడు తరాల, రెండు వందల ఇరవయి నాలుగు సంవత్సరాల ఆసఫ్‌జాహి పాలన అంతమయిన చరిత్రాత్మక సమయం.

నిజాం పరాజయం నిజానికి తెలంగాణ ప్రజల అనేక, అపూర్వ అద్వితీయ త్యాగాలతో, సాహస పోరాటాలతో సాధించిన మహత్తర విజయం. ఆపరేషన్‌ ‌పోలోను విజయవంతంగా నిర్వహించి, నిజాం నిరంకుశ రాజరిక వ్యవస్థ మీద చివరి దెబ్బ కొట్టి, ఒక చెరసాలగా మారిన తెలంగాణ ఇనుప ద్వారాలు తెరిచిన…ఎన్ని వివాదాలు ..విమర్శలు ఉన్నప్పటికీ భారత సైనికులను, సైనికాధికారులను హృదయ పూర్వకంగా అభినందించవలసి ఉంటుంది. అయితే, ఆపరేషన్‌ ‌పోలో సత్వర విజయానికి దోహదపడిన, మార్గం వేసిన అఖండ శక్తి తెలంగాణ ప్రజలది. వంద సంవత్సరాల నిరంతర,నిర్విరామ వీరోచిత పోరాటాలతో, అనేక ఉద్యమాలతో తెంగాణ ప్రజలు నిజాం నిరంకుశ రాజరిక వ్యవస్థ పునాదులను పెకిలించడంలో విజయం సాధించి ఆపరేషన్‌ ‌పోలో అనతికాలంలో సులభంగా ముగియడానికి కారకులయినారు.

అది తెలంగాణ ప్రజలకు పునర్జన్మ! మానవతకు, నాగరికతకు తిలోదకాలు ఇచ్చి మతోన్మాద దానవత్వం విష జ్వాలలతో బుస కొట్టడానికి తోడ్పడింది నిజాం నిరంకుశ ప్రభుత్వం, సామూహిక హత్యలతో, దహనాలతో, దోపిడిలతో, మానభంగాలతో అతి నీచమయిన రాక్షస కృత్యాలతో తెలంగాణ అంతట మంటలు అంటుకున్నాయి. హాహాకారాలు చెలరేగాయి, తెలంగాణ ప్రజల ప్రాణాలకు, మానాలకు, ఆస్తులకు, ఆత్మగౌరవానికి భయంకరమయిన విపత్తు వాటిల్లింది. ప్రళయకాల భయానక పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఊరూర,వాడవాడ ఆత్మరక్షణార్థం రాళ్లు, రప్పలు, కర్రలు, కట్టెలు, కొడవళ్లు, గొడ్డళ్లు, వడిసెలలు మొదలయిన వాటిని ఆయుధాలుగా ఉపయోగించారు. తెలంగాణ తల్లులు, స్త్రీలు రక్కసుల బారి నుంచి తమ మానాలను రక్షించుకోవడానికి, ప్రాణాలను కాపాడుకోవడానికి కారపు పొడి మీద ఆధారపడ్డారు.

ఏ క్షణాన ఎవరి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందో తెలియని ఒక రక్త సిక్త రణరంగం నాటి తెలంగాణం! ఇంకా వెనుకకు వెళ్లి అవలోకిస్తే తెలంగాణ ప్రాంతంలో చైతన్యం కల్గించడానికి కొన్ని దశాబ్దాల పాటు కొనసాగిన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య ఉద్యమాలు కన్పిస్తాయి. నిజాం నిరంకుశ ప్రభుత్వపు నిర్బంధాలను, అవరోధాలను, ఆంక్షలను ధైర్య సాహసాలతో ప్రతిఘటిస్తూ ప్రాథమిక పౌరసత్వాల కోసం, తమ భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం కంకణ ధారణ చేసి ఆ ఉద్యమాలలో అగ్రగాములయి నిలిచిన స్వాతంత్య్ర యోధులు, దేశ భక్తులు కనిపిస్తారు. వారందరికి ఆ త్యాగధనులందరికి, ఆ వైతాళికులందరికి ఈ సందర్భాన ఇదే మా శ్రద్ధాంజలి. తెలంగాణ పునర్జన్మ పొందడానికి, నిజాం నిరంకుశ రాజరిక వ్యవస్థ నడ్డి విరిగి నేలకూలడానికి వివిధ పోరాటాలలో ప్రముఖ పాత్ర వహించి ప్రాణాలను త్యాగం చేసిన వేలాది అమరవీరులకు ఇదే మా అవనత వందనం – ఇదే మా విప్లవ అభినందనం.

Leave a Reply