Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌ ‌నీ తల ఎక్కడ పెట్టుకుంటావ్‌

  • ఆఖరి గింజ వరకు కొంటాం అని ఇచ్చిన హామీ ఏమైంది… వానొస్తదని తెలిసినపుడు ధాన్యం తడిస్తే మొలక వస్తదని తెలియదా?..
  • వికారాబాద్‌ ‌జిల్లా దోమ మండలం పాలేపల్లి గ్రామంలో రైతులను పరామర్శించిన తెలంగాణ వైఎస్‌ఆర్సిపి  అధినేత వైఎస్‌ ‌షర్మిళ.

పరిగి,జూన్‌11(‌ప్రజాతంత్ర విలేఖరి):ఆరుగాలం కష్టపడి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పండించిన పంట నేడు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణవైఎస్సార్సీపీ  అధినేత వైఎస్‌ ‌షర్మిళ అన్నారు.శుక్రవారం పరిగి నియోజక వర్గ పరిధిలోని దోమ మండలం పాలే పల్లి గ్రామంలో రైతులను పరామర్శించడం జరిగింది.ఇందులో భాగంగా గ్రామంలో ఐ కే పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా రైతులకు ఎదురవుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ ‌రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కరోనా కాలంలో దేశంలో ఇంకా బ్రతికి ఉన్నామంటే దానికి కారణం రైతు అని అన్నారు.పెద్ద రైతు అని చెప్పుకునే కేసీఆర్‌ ‌నీ తల ఎక్కడ పెట్టుకుంటావు అని అన్నారు. ఖమ్మం లో రైతులకు సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్‌ ‌ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

 

పంట పండించిన రైతే మా ధాన్యం కొనండి అంటూ కాళ్ళు మొక్కుతున్నా ప్రభుత్వానికి కనికరమే లేదా అంటూ ప్రశ్నించారు.ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పిన కేసీఆర్‌ ‌నెల దాటినా రైతులకు డబ్బులు రావడం లేదన్నారు. రైతులకు ఇచ్చిన హామీల్లో భాగంగా రుణ మాఫీ ఎక్కడ చేశారని ఆమె ఎద్దేవా చేశారు.కేవలం రైతు బంధు పేరిట 5వేల రూపాయలతో రైతు కష్టాలు ఎలా తీరుతాయని అన్నారు.కాంగ్రెస్‌ ‌పార్టీ  అధికారంలో ఉన్నపుడు వైఎస్‌ఆర్‌ ‌మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొన్నారని అలాంటిది వడ్లు వేయండి కొంటాం అని చెప్పిన తెరాస ప్రభుత్వమే ఇపుడు ఇట్లా అన్యాయం చేయడం తగదని అన్నారు.

అదే విధంగా ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్న కూడా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు.మిల్లర్లు క్వింటాలుకు 10 కేజీ ల వరకు తరుగు తీస్తూ రైతులను నిండా ముంచుతున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ ‌చేశారు.వారికి మద్దతు ధర కల్పిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్‌ ‌చేశారు.కార్యక్రమంలో గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply