(ఫోర్బస్ 30 అండర్ 30 ప్రతిభాశీలుర యువత జాబితా ఆధారంగా)
ప్రఖ్యాత అంతర్జాతీయ ఫోర్బ్ సంస్థ రూపొందించిన 30-ఏండ్ల లోపు ఔత్సాహిక ప్రతిభశీలుర 30 మంది జాబితా-2021 (30 అండర్ 30)లో తెలంగాణకు చెందిన యువ తేజం కొత్త కీర్తి రెడ్డి స్థానం దక్కించుకోవడం విశేషంగా చెప్పవచ్చు. 2021 సంవత్సర జాబితాలో వివిధరంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న 30 మంది ఔత్సాహిక వినూత్న యువతీయువకుల జాబితాలో 13 మంది మహిళలకు చోటు దక్కింది. ఫోర్బస్ జాబితాలో చోటుదక్కించుకున్న ఔత్సాహిక యువతుల్లో అముల్ కూల్ కంపెనీకి చెందిన శఫాలీ విజయ్వార్గియా(వయస్సు 28), యూట్యూబ్ ఇండియాకు చెందిన నీహారిక కపూర్(28), కళాకారిని బిరాజ్ దోడియా(27), నెక్సాస్ ఈ-పవర్ భాద్యులు నిషిత బలియార్సింగ్(23) మరియు నికిత బలియార్సింగ్(23), సమకాలీన అంశాలకు చెందిన వీడియోల రూపశిల్పి నియతి మవికుర్వే(29), సుప్రీమ్ కోర్టు లాయర్ పౌలోమి పవిని శుక్లా(28), సినీ నటి కీర్తి సురేష్ (28) మరియు నటి త్రిప్తీ (26) సఫలీకృతం అయ్యారు.
హైదరాబాద్? కేంద్రంగా పని చేస్తున్న ‘స్టాట్విగ్’ వ్యవస్థాపకురాలైన 24-ఏండ్ల కొత్త కీర్తి రెడ్డి కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సిఓఓ)గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా విశ్వమహమ్మారిని తరిమికొట్టేందుకు ఉపకరించే కృషిలో భాగంగా కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ సేవలను అందించే స్టాట్విగ్ కంపెనీ పని తీరుతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. యువ ధృవతార కీర్తి రెడ్డికి ప్రపంచ ఎకనమిక్ ఫోరమ్ సౌజన్యంతో ‘గ్లోబల్ ఇన్నొవేటర్ ఆవార్డు’ కూడా లభించడం సంతోషదాయకం. చిరు ప్రాయంలోనే స్టాట్విగ్ కంపెనీకి తన సేవలు అందిస్తూ 5 శాతం భాగస్వామ్యం కలిగిన ఉంది. ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన కీర్తి రెడ్డి కోవిడ్-19 టీకా మందును ఫార్మా కంపెనీ నుండి ఇతర ప్రాంతాలు మరియు ప్రపంచ దేశాలకు సరఫరా శృంఖల (సప్లై చైన్) మేనేజ్మెంట్తో అవసరమైన శీతలీకరణ వాతావరణంలో రవాణ చేస్తూ పేరు తెచ్చుకుంది. ప్రజాపంపిణి వ్యవస్థ కోసం అభివృద్ధి చేసిన ‘బ్లాక్‌చైన్ టెక్నాలజీ’ ఆధారంగా కరోనా వ్యాక్సీన్ కోల్డ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ చేయడంలో స్టాట్విగ్ కంపెనీ సఫలీకృతం కావడంలో కీర్తి రెడ్డి ప్రతిభ రుజువు చేయబడింది.
ప్రస్తుత మెదక్ పార్లమెంట్ సభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు మంజులతల కూతురైన కీర్తి రెడ్డి గతంలో సింగపూర్‌కు చెందిన సప్లై చైన్ కంపెనీ ‘క్యూనికస్’లో కొంత కాలం పని చేసి తన సత్తా చాటుకున్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన కొత్త కీర్తి రెడ్డి చిరుప్రాయం నుంచే వినూత్న ఆలోచనలతో ఎదుగుతూ చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు.ఆహారంతో పాటు టీకాలను కూడా వృధా కాకుండా ధీటైన వ్యవస్థను పటిష్ట పరచడంలో కీర్తి కృషి ప్రశంసనీయమని తెలుస్తున్నది. పాఠశాల విద్యను హైదరాబాద్? పబ్లిక్ స్కూల్, ఇంటర్నీడియట్ విద్యను చిరెక్ కళాశాలలో మరియు బిబిఏను సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో పూర్తి చేశారు.
అనంతరం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో గ్లోబల్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత విద్య అనంతరం ఉద్యోగం వైపు చూడకుండా తన ప్రతిభతో స్వతహాగా స్టాట్విగ్ అనబడే సాంకేతిక ఆధారిత కంపెనీ స్థాపించిన కొద్ది కాలంలోనే కరోనా టీకాలను శీతలీకరణ వాతావరణంలో సరఫరా చేసే గురుతర భాద్యతలను తీసుకొని అంతర్జాతీయ ఫోర్బ్ సంస్థ దృష్టిని ఆకర్షించుటలో సఫలీకృతం అయ్యింది మన తెలుగు తెలంగాణ తేజం కీర్తి రెడ్డి. 24-ఏండ్ల వయస్సులోనే ఫోర్బస్ జాబితాలో చోటు దక్కించుకొని ప్రపంచ స్థాయి గుర్తింపు స్వంతం చేసుకున్నది. కొత్తదనం శ్వాసించే కొత్త కీర్తి రెడ్డి భవిష్యత్తులో ‘తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్’ జాతీయ అంతర్జాతీయ వేదికలో సుస్థిర స్థానం దక్కించుకోవాలని కోరుకుందాం.

జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్ – 99497 00037