Take a fresh look at your lifestyle.

మాంసం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం.. ఎంపి బడుగు లింగయ్య

మాంసం ఉత్పత్తిలో రాజస్థాన్‌ను వెనక్కి నెట్టి తెలంగాణ మొదటి స్థానానికి చేరిందని రాజ్య సభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్‌ అన్నారు. రెండో విడతలో గొర్రెల పంపిణీ కోసం 6 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, దీంతో 3.81 లక్షల మందికి లబ్ది చేకూరనున్నట్లు తెలిపారు. గతంలో ఒక గొర్రెల యూనిట్‌ ‌ధర లక్షా 31 వేలుగా ఉంటే, ప్రస్తుతం లక్షా 75 వేలకు పెరిగిందని తెలిపారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కుల వృత్తులకు చేయూతనిస్తుందని అన్నారు. బీసీల్లో గుణాత్మక మార్పు రావాలని కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు అయన తెలిపారు.

దళిత క్రాంతి పథకం ద్వారా దళిత వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు 5 లక్షల బీమా, చేపల పంపిణీ, మార్కెటింగ్‌కు సిఎం కెసిఆర్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మిషన్‌ ‌కాకతీయతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ జరిగిందన్నారు. ఈ నెల 24న పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌జన్మదినం సందర్భంగా చేపట్టిన కోటివృక్షార్చనను టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మల్లిఖార్జున ఖర్గేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : రేవంత్‌ ‌రెడ్డి
కాంగ్రెస్‌ ‌రాజ్యసభ పక్ష నేత మల్లి ఖార్జున ఖర్గేకు టీపీసీసీ ప్రెసిడెంట్‌, ఎం‌పి రేవంత్‌ ‌రెడ్డి బర్త్ ‌డే విషెస్‌ ‌తెలిపారు. పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీలో ఉన్న రేవంత్‌…‌బుధవారం మల్లిఖార్జున ఖర్గేను కలిసి, పుష్పగుచ్చం అందజేశారు. అయనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే సంపత్‌ ‌కూడా వెంట ఉన్నారు. అనంతరం కర్ణాటక మాజీ సిఎం సిద్ధ రామయ్యతో రేవంత్‌ ‌భేటి అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై వీరిద్దరి మధ్య చర్చకు వొచ్చినట్లు తెలిసింది.

Leave a Reply