Take a fresh look at your lifestyle.

వైద్యారోగ్యంలో దేశంలో తెలంగాణదే అగ్రస్థానం

రాష్ట్రంలో మొదటి డోసు 97 శాతం పూర్తి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి : సీఎం కేసీఆర్‌ ‌మార్గనిర్దేశంలో వైద్యారోగ్యంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌ ‌రావు అన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌తొలి డోసు 97 శాతం మందికి పూర్తయిందని పేర్కొన్నారు. సోమవారం నీలోఫర్‌ ‌హాస్పిటల్‌లో అధునాతనమైన సిటీ స్కాన్‌, ‌నియోనాటల్‌ ‌స్కిల్‌ ‌లాబ్‌ను మంత్రి హరీశ్‌ ‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక తలసరి ఆరోగ్య వ్యయం చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలచినట్లు రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసిందని తెలిపారు. ఆరోగ్య సంరోక్షణ కోసం ఒక్కొక్కరిపై రూ.1698 తలసరిగా ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. వెల్నెస్‌ ‌యాక్టివిటీస్‌లో తెలంగాణ నంబర్‌ 1 ‌రాష్ట్రంగా కేంద్రం గుర్తించిందనీ, ఎన్‌సిడి స్క్రీనింగ్‌లో రెండో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. కేంద్రం మూడు అంశాల్లో అవార్డులు ప్రకటిస్తే అందులో తెలంగాణకు రెండు వచ్చాయనీ, అందుకు వైద్య ఆరోగ్య శాఖను అభినందించారు. నీలోఫర్‌ ‌హాస్పిటల్‌లో 8 హెచ్‌వోడీ శాఖల వారీగా సమీక్షలు నిర్వహించామనీ, కావలసిన పరికరాలను సమకూర్చాలని టీఎస్‌ఎంఎస్‌ఐసిడిసిని ఆదేశించామని చెప్పారు. నీలోఫర్‌ ‌హాస్పిటల్‌లో ప్రతీ సంవత్సరం ఆరోగ్యశ్రీ కింద రూ.10కోట్లు వస్తున్నాయనీ, వీటిని హాస్పిటల్‌ అభివృద్ధికి వినియోగించుకునే అధికారం సూపరింటెండెంట్‌కు ఇచ్చామన్నారు.

గతంలో ఆరోగ్యశ్రీ ప్యాకేజీ కుటుంబానికి రూ.2 లక్షలు ఉంటే దానిని సీఎం కేసీఆర్‌ ‌రూ.5 లక్షలకు పెంచారనీ, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించామన్నారు. ప్రతీ నెలా రివ్యూ చేయాలని డీఎంఈకి సూచించామనీ, ప్రొఫెసర్లు, హెచ్‌వోడీలు కూడా వోపీలో కూర్చోవాలని ఆదేశించినట్లు తెలిపారు. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌ ‌హాస్పిటల్స్‌లో పారిశుధ్యం పెంచాలని నిర్ణయించామనీ, సరిగా పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌ ‌లిస్టులో పెడతామని హెచ్చరించారు. నీలోఫర్‌ ‌హాస్పిటల్‌లో కార్డియాలజీ విభాగం లేకపోవడంతో ఇబ్బంది అవుతున్న విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారనీ, దీనిపై కమిటీ వేశామనీ, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ ‌కేసులు నమోదు కాలేదనీ, రిస్క్ ‌దేశాల నుంచి వచ్చిన 15 మందికి పాజిటివ్‌గా రాగా వారందరికీ ఒమిక్రాన్‌ ‌నెగిటివ్‌గా వచ్చిందనీ ఈ సందర్బంగా మంత్రి హరీశ్‌ ‌రావు వెల్లడించారు.

Leave a Reply