Take a fresh look at your lifestyle.

తెలంగాణకు ‘నీటి’ ద్రోహం జరుగుతున్నదా ?

నీటి వనరుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా తప్పుచేస్తున్నదా? ఏపి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డికి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుల మధ్య ఈ విషయంలో రహస్య ఒప్పందమేదైనా ఉందా? అపెక్స్ ‌సమావేశానికి వెళ్ళకుండా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దోబూచు లాడడంవెనుక ఏముంది లాంటి ప్రశ్నలు ఇప్పుడు ఇరురాష్ట్రాల్లో ప్రధాన చర్చగా మారాయి. తెలంగాణ ఆవిర్భావం వెనుకున్న మూడు ప్రధాన అంశాల్లో నీటి వనరులను సమకూర్చుకోవడమన్నది ప్రధానమైంది. తెలంగాణ ఉద్యమం సాగినంతకాలం కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంత అంటూ ఎలుగెత్తి చాటిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత వాటాను దక్కించుకోవడంలో తెలంగాణ సర్కార్‌ ‌విఫలమవుతున్నదన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. తెలంగాణకు చెందాల్సిన ఒక్క బొట్టు నీటినికూడా వదులుకునేదిలేదని ఒక పక్క కెసిఆర్‌ ‌ప్రభుత్వం చెబుతున్నప్పటికీ తెలంగాణ జలాలను తన్నుకుపోయే ప్రణాళికలను ఏపీ రచిస్తున్నా తెరాస సర్కార్‌ ఉద్దేశ్యపూర్వకంగానే మౌనం వహిస్తోందని, ఇది ఒక విధంగా తెలంగాణకు ద్రోహంచేయడమేనని ప్రతిపక్షాలు తీవ్రంగా దుయ్యబడుతున్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత నారా చంద్రబాబునాయుడు ఏ పీ సిఎంగా ఉన్నంతకాలం ఇరు రాష్ట్రాల మద్య పచ్చగడ్డివేస్తే భగ్గుమన్నట్లుగానే ఉండింది. కాని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ఆర్‌ ‌జగన్‌ ‌పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు రాష్ట్రాల మద్య సమోధ్యకుదిరిందని అందరూ భావించారు. ఏ విషయంలోనైనా ఇరురాష్ట్రాలు సంప్రదించుకుని ముందుకు వెళ్తామని ఇరువురు ప్రకటించడంతో ఇక అంతా సవ్యంగానే జరిగిపోతుందనుకున్నారు.

అంతకుముందు అనేక ఆరోపణలు వినిపించినా కృష్ణా, గోదావరి అనుసంధానం విషయంలో ఇద్దరూ ఒకటైనారు. కాని, ఇప్పుడు పూర్వస్థాయిలోనే జల జగడం మళ్ళీముందుకు వొచ్చింది. ఇరు రాష్ట్రాలు కృష్ణా,గోదావరిలపై చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపించుకోవడంతోపాటు సుప్రీంకోర్టు తలుపులు తట్టే వరకు వెళ్ళింది.. ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం చేపడుతున్న పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం సామర్ధ్యం పెంచడం ద్వారా ఏపికి నీటిని తరలించుకుంటామని జగన్‌ ‌సర్కార్‌ ‌బాహాటంగా ప్రకటనచేసినా.. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఏమీ మాట్లాడకపోవడాన్ని కాంగ్రెస్‌ ‌తప్పుపడుతోంది. దీంతో సామర్ధ్యంపెంపుపై ఏపీ సర్కార్‌ ‌ముందుకు వెళ్ళుతూనే ఉంది. శ్రీశైలం ప్రాజెక్టునుండి ఎనిమిది వందల అడుగుల వద్దనుండి కృష్ణానదిలో తమకు కేటాయించిన నీటి వాటాను తెలంగాణ ఉపయోగించుకుంటోందని, తాముకూడా అదే ఎనిమిది వందల అడుగుల నుండి కృష్ణ నీటిని వాడుకునేందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ ‌ప్రతిపాదించినట్లు ఏపి ప్రభుత్వం చెబుతోంది. అందుకు పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచాలని ప్రతిపాదించింది. ఇదే జరిగితే శ్రీశైలంనుండి చుక్కనీరుకూడా నాగార్జునసాగర్‌ ‌ప్రాజెక్టులోకి చేరదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ ఈనెల 19వ తేదీలోగా ఇందుకు సంబందించిన టెండర్ల పక్రియను పూర్తిచేసే పనిలో ఏపీ ఉంది. దీనిపై తెలంగాణ సర్కార్‌ ‌కృష్ణాబోర్డుకు ఫిర్యాదుచేయడం.. బోర్డు ప్రాజెక్టు నిర్మాణ పక్రియను నిలిపివేయాలని ఏపీని ఆదేశించడం, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్డులో పిటీషన్‌ ‌వేయడం…. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపి ప్రభుత్వం కూడా కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు తదితర ప్రాజెక్టులను నిలిపివేయాలని పిటీషన్‌ ‌వేయడం అంతా చకచకా జరిగిపోయింది.

కాగా, ఈ ప్రాజెక్టుల నిర్మాణ వివాదాలపై అపెక్స్ ‌కౌన్సిల్‌ ఏర్పాటుచేసిన సమావేశానికి ఇరువురు ముఖ్యమంత్రులు హాజరు కాకపోవడంపట్ల రాష్ట్ర కాంగ్రెస్‌ ‌తీవ్రంగా తప్పు పడుతోంది. తెలంగాణ నీటి వాటాను చర్చలద్వారా సక్రమంగా రాబట్టుకునే అవకాశమున్నప్పటికీ ఆ సమావేశాన్ని వాయిదావేయమని కోరడమేంటని కాంగ్రెస్‌ ‌ప్రశ్నిస్తోంది. ఒకపక్క ఏపి సర్కార్‌ 19‌వ తేదీన టెండర్లను ఖరారు చేస్తుంటే ఆ మరుసటిరోజున అంటే 20వ తేదీన సమావేశానికైతే వీలవుతుందని తెలంగాణ సర్కార్‌ ‌చెప్పడంవెనుక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఏదో గూడపుఠాణి ఉందంటోంది రాష్ట్ర కాంగ్రెస్‌. ‌తెలంగాణ సర్కార్‌ ‌సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులు, ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను అపివేయాలన్న అంశమేలేదని కాంగ్రెస్‌ ‌వాదిస్తోంది. ఈ పిటీషన్‌ ‌లోపభూయిష్టంగా ఉందని, తెలంగాణకు అన్యాయం జరుగకుండా తమ పార్టీ పక్షాన ఈ కేసులో ఇంప్లీడ్‌ అవుతామంటోంది కాంగ్రెస్‌. ‌పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపుపై గతంలో ఏపి సిఎం జగన్‌ ‌ప్రకటన చేసినప్పుడే తమ పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోకపోవడంవల్లే ఏపి నీటిని దోచుకుపోవడానికి దూసుకుపోతోందని వాదిస్తున్న కాంగ్రెస్‌ ఇప్పటికే కృష్ణా నీటివిషయంలో చేపట్టిన ఆందోళనలో తెలంగాణ సర్కార్‌ ‌పలువురు నాయకులను గృహనిర్భంధంలో ఉంచి, మరికొందరిని అరెస్టుచేసిన విషయం తెలిసిందే. మొత్తానికి రెండు రాష్ట్రాల మద్య జలజగడం పునరావృతం అవుతుందనడానికి ప్రస్తుత పరిణామాలే నిదర్శనం.

Leave a Reply