Take a fresh look at your lifestyle.

‌వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంపైన ఆధిపత్యం కోసం రాజకీయ పార్టీలన్నీ పోటాపోటీగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, బిఆర్‌ఎస్‌ల మధ్య పొలిటికల్‌ ‌వార్‌ ‌కొనసాగుతున్నది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా  బిజెపి కేంద్ర నాయకత్వం ప్రణాళికలను రచిస్తోంది. ఏదోఒక కార్యక్రమంతో రాష్ట్రంలో నిత్యం హడావిడిచేస్తోంది. తాజాగా మరోసారి ప్రధాని నరేంద్రమోదీ పర్యటనను ఖరారు చేసింది. మోదీ  ఈనెల 19న రాష్ట్రానికి రానున్నారు. గత సంవత్సరం మోదీ వివిధ కార్యక్రమాలతో రాష్ట్ర పర్యటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆయన పర్యటన మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పది రోజులకిందనే క్యాలండర్‌ ‌మారింది. ఈ నూతన సంవత్సరం ఎన్నికల సంవత్సరంకావడంతో రాజకీయ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు చేపడుతున్నాయి .  తెలంగాణపైన తమ జండాను ఎగురవేసేందుకు రాష్ట్రంలోని దాదాపు అన్ని పార్టీలు ఉత్సాహ పడుతున్నాయి. అయినప్పటికీ ముందుగానే చెప్పుకున్నట్లు వాతావరణం   అసలైన పోటీ బిఆర్‌ఎస్‌, ‌బిజెపిల మధ్యనే అన్నట్లుగా ఉంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఈ ఎనిమిదేళ్ళలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చెబుతున్నదానికి, బిజెపి భిన్నమైన ప్రచారం చేస్తోంది. అభివృద్ధి అన్నది కేవలం కెసిఆర్‌ ‌కుటుంబానికే పరిమితమైందంటూ ఆ పార్టీ ప్రజల్లో విస్తృత ప్రచారం చేస్తోంది. కేంద్రం న్యాయంగా ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి దిశలో పయనిస్తోందని, ఇప్పుడు దేశంలోని  ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయని అధికార పార్టీ వాదిస్తోంది. ఇప్పుడు దేశ ప్రజలు కూడా తెలంగాణ రోల్‌ ‌మాడల్‌ ‌కావాలని కోరుకుంటున్నారంటూ, జాతీయ స్థాయి పార్టీగా మార్చిన తమ పార్టీని దిల్లీ వైపు  పరిగెత్తించే ప్రయత్నం చేస్తోంది బిఆర్‌ఎస్‌. అం‌దులో భాగంగానే ఈ నెల 18న ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆవిర్భావ సమావేశాన్ని బిఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర నాయకులను ఆ పార్టీ ఆహ్వానించింది. టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌ అం‌టూ జాతీయ పార్టీగా మారిన వైనాన్ని, ఆ పార్టీ ఎజండాను, విధి విధానాలను  ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత కెసిఆర్‌ ‌ప్రకటించబోతున్నారు. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా  బిఆర్‌ఎస్‌ ‌ప్రణాళిక ఉండబోతుందన్నది సుస్పష్టం.

అయితే ఇదే సమయంలో బిజెపి ప్రభుత్వం తెలంగాణ సాధనే లక్ష్యంగా మరోసారి ప్రధాని మోదీని తీసుకువొస్తున్నది. ఎప్పటిలాగా మోదీ ఈసారి నాలుగు మాటలు చెప్పిపోవడానికి కాకుండా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేయబోతున్నారు. సికిందరాబాద్‌నుండి విశాఖ వెళ్ళే వందేమాతరం ఎక్స్‌ప్రెస్‌ ‌ప్రారంభోత్సవానికి వొస్తున్న ప్రధాని, సుమారు 12 వందల కోట్లతో చేపడుతున్న సికిందరాబాద్‌ ‌టు మహబూబ్‌నగర్‌ ‌రైల్వే డబ్లింగ్‌ ‌పనులను కూడా ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రజలు చాలాకాలంగా డిమాండ్‌ ‌చేస్తున్న కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీకి బదులు 521 కోట్లతో చేపట్టనున్న  రైల్వే పిరియాడిక్‌ ఓవర్‌ ‌హోలింగ్‌ ‌వర్క్‌షాపుకు భూమిపూజ చేయబోతున్నారు. ఇప్పటికే కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నదన్న ప్రచారం విస్తృతం చేస్తున్న బిజెపి, పలు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలతో తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే ప్రధాని తెలంగాణకు వొచ్చినప్పుడల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు పలువురు మంత్రులు, నాయకులు అనేక ప్రశ్నలను సంధిస్తూ వొస్తున్నారు. రాష్ట్రం విడిపోయి ఎనిమిది ఏళ్ళు అయినప్పటికీ ఇంతవరకు విభజన హామీలను నెరవేర్చలేక పోతున్నదంటూ కేంద్రంపైన విరుచుకుపడుతున్న రాష్ట్ర నాయకత్వం దీనిపైన ప్రధాని స్పందించాలని పలుసార్లు డిమాండ్‌ ‌చేస్తూనే ఉంది. కేంద్రం పరిష్కరించాల్సిన కృష్ణా జలాల విషయమైతేనేమీ, రాష్ట్రానికి అందించాల్సిన నిధుల విషయంలోనైతేనేమీ రాష్ట్రం అడుగుతున్న ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉండిపోతున్నాయన్నది స్థానిక నేతల ఆరోపణ.

ఇదిలా ఉంటే ఎంఎల్‌ఏల కొనుగోలు వ్యవహారం, దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌  ‌కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మరింత దూరం చేశాయి. ఎంఎల్‌ఏల కొనుగోలు వ్యవహారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఏవిధంగానైనా దోషిగా నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కూతరు, ఎంఎల్సీ కవితతో పాటు మరికొందరు బిఆర్‌ఎస్‌ ‌నేతల ప్రమేయాన్ని ఎత్తి చూపడంద్వారా లబ్ధిపొందాలనుకుంటోంది బిజెపి. ఇలాంటి పరిస్థితిలో ఒక రోజు తేడాతో రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు పెద్ద ఎత్తున బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈసారికూడా ప్రధాని రాక విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోటోకాల్‌ను పాటిస్తారా అన్నది కూడా మరో చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు నాలుగు సార్లు రాష్ట్రానికి ప్రధాని వొచ్చినప్పటికీ అంతకు ముందుగానే తన పర్యటనను ఖరారు చేసుకుంటున్న ముఖ్యమంత్రి ప్రధానిని ఆహ్వానించడానికి స్వయంగా వెళ్ళిందిలేదు. ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న స్థితిలో జరుగుతున్న  ప్రధాని పర్యటన  ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.

Leave a Reply