Take a fresh look at your lifestyle.

Telangana Political Hot Topics: ఆ ‌పద్దెనిమిది మంది ఎవరు?

తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జైల్‌కు వెళ్ళటం ఖాయమని మరోసారి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రకటించారు. ఇప్పటికే చాలా సార్లు ఈ మాట అంటూ వొస్తున్న సంజయ్‌ ఈసారి దీనిపై మరికొంత వివరణ ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో ఇది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్‌ ‌బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టినప్పటినుండీ టిఆర్‌ఎస్‌పై ముఖ్యంగా కెసిఆర్‌, ఆయన కుటుంబసభ్యులపై దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల సందర్భంగా నైతేనేమీ, జీహెచ్‌ఎం‌సి, వరంగల్‌, ‌ఖమ్మం కార్పోరేషన్‌ ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్‌ అధినేతపై ఘాటైన విమర్శలు చేశారు. బండి సంజయ్‌ ‌కన్నా ముందున్న అధ్యక్షుడు కూడా ఇలానే మాటల దాడిచేసినప్పటికీ అవి రాష్ట్రానికే పరిమితమైనట్లుగా ఉండేవి. రాష్ట్రంలో బిజెపి విమర్శ కాస్త మితిమీరినప్పుడు కెసిఆర్‌ ఏదో సందర్భం చూసుకుని ఢిల్లీ పర్యటన చేయడం, అక్కడ బిజెపి ప్రధాన నాయకులను కలిసిరావడంతో ఈ విమర్శల ప్రాధాన్యత లోపించినుట్లుగా ఉండేది.

కాని, ఈసారి బండి సంజయ్‌ ‌మాటలు ఏదో జరుగుతున్నదన్న ఆలోచనను కలిగిస్తున్నట్లు కనిపిస్తున్నది. గతంలోలాగా కెసిఆర్‌ను జైలుకు పంపడం ఖాయమని చెప్పడంతోపాటు గత వారం రోజులుగా ఆయన అవినీతి వ్యవహారాలపై సంపూర్ణంగా అధారాలను సేకరించే పనిలోనే ఉన్నామని చెప్పడం బిజెపి చేస్తున్నది ఊకదంపుడు ఉపన్యాసాలు కావన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నది. దానికి తగినట్లుగా ఆయన కొంత క్లూ కూడా ఇచ్చినట్లైంది. కెసిఆర్‌పై ఉన్న ఇతర కేసులేవన్నవి చెప్పకపోయినా రెండింటిని మాత్రం ఆయన బయటపెట్టాడు.

Also Read: తెలంగాణ అద్వితీయ సంస్కృతి ..!

అందులో ఒకటి సహార, మరోటి ఇఎస్‌ఐకి సంబందించిన కేసుల వివరాలన్నీ సేకరించినట్లు చెప్పుకొచ్చాడు. వివిధ కేసులకు సంబంధించిన వివరాలు సేకరించినప్పుడు తామెంత ఆశ్చర్యపోయిందన్నది ఆయన వివరించాడు. ఒక్కో స్క్యాం వివరాలు సేకరించినప్పుడు కెసిఆర్‌ ఎం‌త అవినీతిపరుడన్నది తేలిపోయిందంటూ, ఆయన్ను ఎప్పుడైనా కటకటాల వెనక్కు పంపటం ఖాయమన్నది తాజాగా సంజయ్‌ ఉవాచ. అయితే జైలుకు ఎప్పుడు పంపాలన్న విషయంలో కూడా తాము వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామం టాడాయన.

అంతటితోనే ఆగకుండా టిఆర్‌ఎస్‌ ‌నేతల్లో చాలామంది అవినీతి పరులున్నారు. వారి వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు పద్దెనిమిది మంది ముఖ్యనేతలకు సంబందించిన సమాచారాన్ని సేకరించినట్లు చెబుతున్న సంజయ్‌, ఆ ‌విషయంలో న్యాయపరమైన అభిప్రాయాలను నిపుణుల నుంచి తీసుకుంటున్నట్లుకూడా చెబుతున్నప్పుడు టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని పడదోసేందుకు భారతీయ జనతాపార్టీ చాలా పకడ్బందీ వ్యవహారం నడుతున్నదనిపిస్తున్నది. అయితే ఆ పద్దెనిమిది మంది ఎవరన్న విషయంలోమాత్రం రాష్ట్రంలో తీవ్రస్థాయిలో చర్చజరుగుతోంది.

రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను మంత్రివర్గంనుండి బర్తరఫ్‌ ‌చేసినప్పుడు ఆయనపై పలు అవినీతి ఆరోపణలను టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసింది. ఆయన అక్రమంగా పేదలకు సంబందించిన అసైన్డ్ ‌భూములను ఖబ్జా చేసినట్లు, దేవాలయ భూములను ఆక్రమించినట్లు ఒకదాని వెనుక ఒకటిగా ఆరోపణలు చేయడంతోపాటు, వాటిపై గంటల వ్యవధిలో రిపోర్టులు రావడం, సర్వేలు చేయడం జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎంత చురుగ్గా వ్యవహరించిందంటే హైకోర్టుకుకూడా ఆశ్చర్యమేసింది. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల అవినీతి చిట్టాలను ప్రజల ముందుంచారు.

కెసిఆర్‌ ‌కుటుంబ సభ్యులతో పాటు, ప్రస్తుతం మంత్రులుగా చెలామణి అవుతున్నవారు, ఇతర హోదాల్లో ఉన్నవారి పేర్లతో సహా ప్రెస్‌ ‌మీట్‌లుపెట్టడం, సోషల్‌ ‌మీడియా ద్వారా చర్చించారు. ఎవరి గురించి విన్నా వందల ఎకరాలు, కోట్ల విలువచేసే భూముల కుంభకోణాలున్నట్లు వారి ఆరోపణలద్వారా అర్థమవుతున్నది. ఇప్పుడు బండి సంజయ్‌ ‌వారిలో పద్దెనిమిది మంది వివరాలను సంపూర్ణంగా సేకరించినట్లు చెబుతున్నాడు. ఆ పద్దెనిమిది మంది ఎవరన్నదిప్పుడు అందరిని ఆలోచింపజేస్తున్నది. అవినీతి వివరాలను ఏమేరకు సేకరిస్తున్నదన్న విషయాన్ని ఇంత వివరంగా సంజయ్‌ ‌చెప్పడంవెనుక ఉద్దేశ్యంకూడా ఏమిటన్నది మరో ప్రశ్న. మంత్రివర్గంనుండి బహిష్కృతుడైన ఈటెల రాజేందర్‌ ‌తన భవిష్యత్‌ ‌కార్యక్రమాన్ని ప్రకటించేందుకు చాలా సయమమే తీసుకున్నాడు.

చివరకాయన రహస్యంగా ఏమి హామీ పొందాడోగాని తమ పార్టీలో చేరుతున్నట్లు సంజయ్‌ ‌తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కయ్యం, కేంద్రంతో నెయ్యంగా ఉంటున్న టిఆర్‌ఎస్‌తో భవిష్యత్‌లో బిజెపి దోస్తీ కడితే తమ పరిస్థితేమిటని ఈటెల ప్రశ్నకు సంజయ్‌పై విధంగా చేసిన ప్రకటన సమాధానమై ఉంటుందనుకుంటున్నారు. అది ఒక ఈటెల ప్రశ్నేకాదు.. టిఆర్‌ఎస్‌లోని ఇతర అసంతృప్తివాదులకు కూడా సంజయ్‌ ‌ప్రకటన పరోక్షంగా భరోసానిచ్చేదిగా ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దానితోపాటు టిఆర్‌ఎస్‌ను బలహీనపర్చేందుకే కెసిఆర్‌ ‌జైల్‌కు పోవడం ఖాయమన్న మాటను సంజయ్‌ ‌పదేపదే చెప్పడమంటున్నారు.

Leave a Reply