Take a fresh look at your lifestyle.

ఎం‌బీబీఎస్‌ ‌సీట్లలో తెలంగాణ నం.1…

  • వరంగల్‌ ‌హెల్త్ ‌సిటీని పరిశీలించిన ఆరోగ్య శాఖ మంత్రి
  • సూపర్‌ ‌స్పెషలిటీ  హాస్పిటల్‌ ‌నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి
  • దసరా  నాటికి  వైద్య సేవలు  అందించాలని లక్ష్యం

సుబేదారి, ప్రజాతంత్ర, జనవరి 28 :ఎంబీబీఎస్‌ ‌సీట్లలో తెలంగాణ నెంబర్‌ ‌వన్‌ ‌పొజిషన్‌లో ఉందని, పీజీ సీట్లలో రెండో స్థానంలో ఉందని, మెడికల్‌ ‌చదువు కోసం మన పిల్లలు ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు..వరంగల్‌ ‌సెంట్రల్‌ ‌జైలు ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌ను  శనివారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్త్ ‌సిటీ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ ‌తర్వాత వరంగల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హెల్త్ ‌సిటీని త్వరలో పూర్తి చేయుటకు నిర్వాకులు 24 గంటలు  కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ  హాస్పిటల్‌  ‌వరంగల్‌ ‌తో పాటు, ఉత్తర తెలంగాణ ప్రజల కోసం కార్పొరేట్‌ ‌స్థాయి వైద్యం అందించేందుకు సిఎం కేసీఆర్‌ 2250 ‌పడకల హాస్పిటల్‌ ‌కి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. 2023 చివరి నాటికి భవనం పూర్తి అవుతుందన్నారు.

దసరా నాటికే పూర్తి అయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్‌అం‌డ్‌బి, ఏజెన్సీ, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. రాత్రి పగలు కష్టపడాలని ఆదేశాలు ఇచ్చామని, మొత్తం పదహరున్నర లక్షల చదరపు అడుగులలో   24 అంతస్తుల నిర్మాణం జరుగుతుందని, వరంగల్‌ ‌హెల్త్ ‌సిటీ చారిత్రాత్మక భవనం రాష్ట్రానికే కాదు దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు ఇక్కడ అందబోతున్నాయన్నారు. 216 ఎకరాల్లో ఈహెల్త్ ‌సిటీ రూపుదిద్దుకుంటోందని, అవయవ మార్పిడి ఆపరేషన్లు కూడా వరంగల్‌లో అందుబాటులోకి రాబోతాన్నాయని, హైదరాబాద్‌ ‌తర్వాత వరంగల్‌ ‌ను అంతగా అభివృద్ధి చేయాలని సిఎం భావిస్తున్నారన్నారు. రాజకీయాల కోసం కొందరు విమర్శలు చేస్తారని, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా విమర్శలు చేశారని, విమర్శలు చేసినోళ్లే ఇవాళ నోరెళ్లబెడుతున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ‌హయాంలో నేను రానుబిడ్డో సర్కారు దవాఖనకు అనే వారు ఇప్పుడు నేను పోత బిడ్డో సర్కార్‌ ‌దవాఖనకు అంటున్నారన్నారు.

సమైక్య రాష్ట్రంలో మెడికల్‌ ‌విద్యలో వెనకబడ్డ తెలంగాణలో మంచి పథకాలు అమలు చేస్తున్నారని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు చెబుతున్నారన్నారు. దిల్లీలో, పంజాబ్‌ ‌లో కంటి వెలుగు ప్రారంభిస్తామని ప్రకటించారన్నారు. కంటి వెలుగుకు భారీ  స్పందన వస్తోందని, ప్రభుత్వ దవాఖానల  వద్దకు ప్రజలు కాదు, ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లి పరీక్షలు చేస్తుందన్నారు. కేంద్రం ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందన్నారు. యాసంగిలో రెండు పంటలు పండుతున్నాయంటే కాళేశ్వరం కారణమని, వరంగల్‌ ‌నగరానికే కాదు జాతీయ స్థాయిలో అద్భుతమైన అవసరాలు తీర్చే దవాఖాన   దేశానికే ఒక మోడల్‌ ‌కానుందన్నారు. మూడు షిఫ్టుల్లో పనులు చేసి, నాణ్యత ప్రమాణాలు పూర్తి స్థాయిలో పాటించి యుద్ద ప్రాతిపదికన భవనం పూర్తి చేయాలని, జిల్లాకు ఒక మెడికల్‌ ‌కాలేజ్‌ ఏర్పాటు చేస్తున్నామని, 926 మంది డాక్టర్లు నియామకం చేశామని, 12,13 వందల ప్రొఫెసర్‌ ‌పోస్టుల రిక్రూట్‌ ‌చేస్తున్నామన్నారు.

కేంద్రం సహకారం ఇవ్వడం లేదని, వివక్ష పూరిత వైఖరితో 157 కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి  ఇవ్వలేదని, రాష్ట్ర సొంత నిధులతో సీఎం 8 మెడికల్‌ ‌కాలేజీలు కట్టారని, జిల్లాకు ఒకటి ఏర్పాటు చేస్తున్నారన్నారు.  ఎలాంటి నిధుల కొరత లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌ ‌వినయ్‌ ‌భాస్కర్‌ ‌మాట్లాడుతూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో విద్య, వైద్యం అత్యంత ప్రధానమైనవని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేసి ఓరుగల్లులోని ఈ ప్రాంతాన్ని హెల్త్ ‌సిటీగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వరంగల్‌ ‌తూర్పు శాసన సభ్యులు నన్నపనేని నరేందర్‌, ‌నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి, మేయర్‌ ‌గుండు సుధారాణి, కూడా చైర్మన్‌ ‌సుందర్‌ ‌రాజ్‌ ‌యాదవ్‌, ‌కలెక్టర్‌ ‌గోపి కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply