Take a fresh look at your lifestyle.

ఒక వైపు అలకలు.. మరోవైపు హర్షం

telangana municipal elections live results

రాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ ముందుగా చెప్పినట్లు విజయపరంపరలో ముందుకు దూసుకు పోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపల్‌, ‌కార్పొరేషన్‌ ‌పరిధిలో అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక ఆ పార్టీలో నూతనోత్సాహాన్ని కలిగిస్తున్నది. తెరాసకు ప్రత్యమ్నాయం తామేనని చెప్పుకుంటూ వొస్తున్న భారతీయ జనతాపార్టీకి అభ్యర్థుల కరువేర్పడడంతో ఇక ఫలితాల నాటికి తెరాస మెజార్టీ స్థానాలను గెలుచుకుని విజయ దుందిభిని మోగిస్తుందనడంలో సంశయం లేకుండా పోయింది. టిఆర్‌ఎస్‌ ‌సాధించిన ఈ ఏకగ్రీవాల వెనుక ఆ పార్టీ అధికార అంగ, అర్థబలం ఉందని,, ప్రత్యర్థులను బెదిరించి పోటీనుండి ఉపసంహరించుకునేలా చేసిందన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా బిజెపి పార్టీనే టిఆర్‌ఎస్‌ ‌టార్గెట్‌ ‌చేసిందని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు తాజాగా మీడియా సమావేశంలోనే ఈ ఆరోపణ చేయడం గమనార్హం. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని పరకాల మున్సిపాలిటీలో బిజెపి పార్టీకి చెందిన ఎనిమిది మంది బిజెపి అభ్యర్థులను సామ దాన భేదోపాయాలను ప్రయోగించి నామినేషన్‌ ఉపసంహరించుకునేట్లు చేశారన్నది ఆయన ఆరోపణ. ఒక్క పరకాలలోనే కాకుండా ఖమ్మం, నల్లగొండల్లో కూడా ఇదే వైఖరిని అధికార పార్టీ అనుసరించిందని ఆయన చెప్పుకొచ్చారు. లొంగని చోట ప్రలోభాలకు గురిచేయడం, నామినేటెడ్‌ ‌పోస్టులు ఇస్తామని ఆశపెట్టి తమ అభ్యర్థులకు పోటీ లేకుండా చేసుకున్నారని, ఎన్నికల కమిషన్‌ ‌కూడా అధికార పార్టీ ఏం చెబితే అదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నదంటూ బిజెపి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నది. ఇదిలా ఉండగా టికెట్లు దక్కని పలువురు ఆశావహులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం పెద్ద హల్‌చెల్‌నే సృస్టించింది. జనగామలో ఇద్దరు మహిళలు తమకు టికెట్‌ ‌దక్కకపోవడం కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. అందులో ఒకరైన గంగాభవాని అనే మహిళ మెడలో వేసుకున్న గులాబి కండువతోనే ఉరివేసుకోవడానికి ప్రయత్నించింది.

సూర్యాపేటలో రహీం అనే వ్యక్తి ఉదంతం కూడా ఇదే. మేడ్చల్‌లో తనకు భీఫారం ఇవ్వలేదని విజయ్‌ అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్‌ ‌పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తే, అక్కడున్న వారు అడ్డుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే టిఆర్‌ఎస్‌లో అసంతృప్తుల చిట్టా చాలా పెద్దగానే ఉంది. పార్టీ ఇన్‌ఛార్జీలు ఎంత వారించినప్పటికీ చాలా మంది తమ బతుకు రాజకీయ జీవితంతోనే ముడివడి ఉన్నందున చావోరేవో అన్నట్లు ఈ ఎన్నికల్లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని రెబల్‌ అభ్యర్థులుగా రంగంలో నిలిచారు. టికెట్‌ ‌దక్కని మరికొందరు ఫార్వర్డ్ ‌బ్లాక్‌ ‌పార్టీ టికెట్‌ ‌సంపాదించుకుని, ఆ పార్టీ పక్షాన పోటీలో దిగుతున్నారు. ఈ అసంతృప్తుల్లో కొందరిని కాంగ్రెస్‌ ‌మచ్చిక చేసుకుని ఆ పార్టీ పక్షాన పోటీలో నిలిపింది. కాగా, కొందరైతే తమకు టికెట్‌ ‌లభించనందుకు కోపంతో ఏకంగా పార్టీకే రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే ఎన్నికలు కాకముందే టిఆర్‌ఎస్‌ ‌విజయాలవైపు దూసుకుపోతుండడం ఆ పార్టీ వర్గాలకు అమితోత్సాహాన్ని కలిగిస్తున్నది. అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లపైన గులాబీ జంఢానే ఎగురుతుందని వారు గంటాపథంగా చెబుతున్నారు.

- Advertisement -

ఎన్నికలు కాకుండానే రాష్ట్రంలో ఎనభైనాలుగు వార్డులను, ఒక డివిజన్‌ను తెరాస స్వంతం చేసుకుంది. ఇది ఒక విధంగా మంత్రులు, ఎంఎల్‌ఏల ముఖాలు వికసించేందుకు కారణమైంది. ఈ ఎన్నికల్లో మొత్తం బాధ్యతను వారిపైనే అధిష్టానం పెట్టిన విషయం తెలియంది కాదు. దాంతో వారిలో టెన్షన్‌ ‌మొదలైంది. తమ బాస్‌ ‌దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికే ప్రత్యర్థులను ప్రలోభాలకు, భయాందోళనకు గురిచేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదైతేనేమీ మొత్తానికి ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌వ్యూహం ఫలితాలనిచ్చిందని చెప్పడానికి ఎనభైనాలుగు వార్డులు ఏకగ్రీవం కావడం. తెరాస ఎత్తుగడో, ప్రతిపక్షాల చాతకానితనమోగాని మొత్తం మీద కాంగ్రెస్‌ ‌పార్టీ 400 స్థానాల్లో పోటీ చేయడం లేదు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు ఏడు వందల స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టలేకపోయింది. విచిత్రమేమంటే అన్ని స్థానాల్లో ఎంఐఎం పార్టీ కూడా పోటీ చేయకపోయినా ఇప్పటికే మూడు స్థానాల్లో ఆ పార్టీ ఏకగ్రీవం సాధించగలగడం ఒకింత ఆశ్చర్యకరవిషయమే. ఏది ఏమైనా ఈ ఎన్నికలను మాత్రం అన్ని పార్టీలు సీరియస్‌గానే తీసుకుంటున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అధికారపార్టీ వంద స్థానాల్లో గెలుస్తామని ధీమాగా చెబుతోంది. తెలంగాణ వొచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. నగర ప్రజలకు కావాల్సిన సదుపాయాలన్నిటినీ అందిస్తున్న ప్రభుత్వంగా ప్రజలను వోటు అడిగే అధికారం తమకే ఉందంటోంది అధికార పార్టీ. నిరంతరాయ విద్యుత్‌, ‌మంచినీటి సదుపాయం తదితర అంశాలను విస్తృత ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకుంటోంది. అలాగే పల్లె ప్రగతి పేరున ఏవిధంగా గ్రామాల ప్రగతికి బాటలు వేస్తున్నామో అదే విధంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా త్వరలో అమలు చేయనున్నట్లు ఆ పార్టీ చేస్తున్న ప్రచారం ప్రజలను ఆకట్టుకునేదిగా ఉంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న తామే ఏమన్నా చేయగలం కాని, అధికారంలో లేని పార్టీలు ఏంచేస్తాయన్న మాట ప్రజలను ఆలోచింపచేస్తోంది. ఇది టిఆర్‌ఎస్‌కు కలిసివొచ్చే అవకాశంగా భావిస్తున్నారు.

Tags: telangana elections, municipal election, counting, results

Leave a Reply