Take a fresh look at your lifestyle.

‌ప్రజాస్వామ్యం అపహాస్యం

Closed The Municipal Campaign Event

ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యం పరఢవిల్లుతుందని గొప్పగా చెప్పుకునే మన దేశంలో అది ఏమేరకు అపహాస్యం అవుతుందన్నది తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో సాక్షాత్కారమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీలు వోటర్లను ప్రలోభాలకు గురిచేశాయి. గతంలోకన్నా ఈసారి వోటు రేటు కూడా బాగానే పెరిగింది. ఒక్కో ప్రాంతంలో వోటు రేటు వేలల్లో పలికింది. దానికి తోడు బంగారం అంటే ఆశ ఎవరికుండదు. కొందరు బంగారు ముక్కుపుడకల పంపిణీ కూడా చేపట్టడంతో నిజంగా ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అపహాస్యంగా మారింది. ఈ సందర్భంగా  పలుచోట్ల దౌర్జన్యాలు, దాడులు, ఘర్షణలు జరిగినప్పటికీ మొత్తంమీద మొదటి విడుత ఎన్నికలు ముగిసాయి. అన్ని రాజకీయ పార్టీలు సాధ్యమైనంతవరకు ఎక్కువ వోట్లను పోల్‌ ‌చేసుకోవడానికి కృషిచేశాయి. పోలింగ్‌ ‌కేంద్రాలకు వెళ్ళిరావడానికి వోటర్ల కోసం అభ్యర్థులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి, రాని వారి ఇళ్ళలోకి వెళ్ళి వారిని పోలింగ్‌ ‌కేంద్రాలకు తరలించడంతో పోలింగ్‌ ‌శాతం కూడా పెరిగింది.

కాగా బుధవారం ఎన్నికలైన వివిధ మున్సిపాల్టీల పరిధిలో ప్రధానంగా అధికారపార్టీ కార్యకర్తలతో కాంగ్రెస్‌, ‌బిజెపి కార్యకర్తలు పలుచోట్ల ఘర్షణ పడ్డారు. కొన్నిచోట్ల తోపులాటలు, దాడులు కూడా జరిగాయి. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ జరిగింది. ఈ ఎన్నికల సందర్భంగా దాదాపు మూడు కోట్ల రూపాయల మద్యం అమ్ముడు పోయినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. కొన్ని చోట్ల బంగారు నాణాలను, వాహనాలను పంపిణీ చేసినట్లు తెలుస్తున్నది.  మొత్తం మీద ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందు కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తున్నది. ప్రధానంగా దొంగ వోట్లను వేయకుండ వోటర్లను గుర్తించేందుకు ఈసారి ఎన్నికల కమిషన్‌  ‌కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఫేస్‌ ‌రికగ్నేషన్‌ ‌యాప్‌ ‌విధానం మంచి ఫలితాన్ని అందించగా, దాన్ని మజ్లిస్‌పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. తమ మహిళలను బురఖా తీయమనడాన్ని తాము ఒప్పుకునేది లేదంటూ కొన్ని చోట్ల ఎన్నికల సిబ్బందితో ఎంఐఎం కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. అయితే దీన్ని కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీల కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. బురఖాను అడ్డుపెట్టుకుని ఆ పార్టీ దొంగ వోట్లు వేయించుకుంటున్నదని వారు పలు చోట్ల ఎన్నికల సిబ్బందికి ఫిర్యాదులు కూడా చేశారు. హైదారాబాద్‌లోని దబీపురాలో ఇలాంటి సంఘటనే ఎదురైంది. అధికార పార్టీకి ఆర్థిక బలం, అంగబలం ఉండడంతో అవినీతికి పాల్పడిందంటూ ప్రతిపక్షపార్టీలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. పోలీసు యంత్రాంగం, ఎన్నికల అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించారన్నది వారి ఆరోపణ. ఎదుటి పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని ఆ వర్గాల ఆరోపణ. ఈ ఎన్నికల్లో తమకు పెద్దగా ప్రచారం అవసరం లేదని మొదటి నుండీ అధికార పార్టీ చెబుతూ వొచ్చింది.

కాని, మంత్రులకు, ఎంఎల్‌ఏలకు టార్గెట్‌ ‌పెట్టింది. వారి పరిధిలోని అభ్యర్థుల గెలుపుకు, వారి పదవులకు అధిష్టానం లింక్‌ ‌పెట్టడంతో, ఎట్టి పరిస్థితిలోనూ తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని మంత్రులు, ఎంఎల్‌ఏలు అడ్డదారులు తొక్కారన్నది ప్రతిపక్షాల ఆరోపణ. తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పుకున్న టిఆర్‌ఎస్‌ ‌విపరీతంగా డబ్బును వెదజల్లిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌విమర్శిస్తున్నారు. పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారాయన. ఆయన ప్రధానంగా టిఆర్‌ఎస్‌, ‌మజ్లీస్‌ ‌పార్టీపైనే విమర్శలు గుప్పించారు. టిఆర్‌ఎస్‌ అయితే స్వంత బౌన్సర్లను పెట్టిందన్నారు. తమ అభ్యర్థులు ఉన్న దగ్గర మరీ దౌర్జన్యానికి పాల్పడిందంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు కూడా. ఇదిలా ఉంటే టిఆర్‌ఎస్‌ ‌మాత్రం తమకు సంపూర్ణ విజయం సిద్ధిస్తుందన్న భరోసా వ్యక్తం చేస్తున్నారు. తొంబై శాతం మున్సిపాలిటీలను గెలుచుకోబోతున్నామంటూ ఆ పార్టీ కీలక నేతలు ప్రకటనలు చేస్తున్నారు. మొదటి విడుతగా 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పెరేషన్‌లకు ప్రస్తుతం ఎన్నికలు జరగ్గా, ఈ నెల 24న కరీంనగర్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగనున్నాయి. ఏదిఏమైనా ఈ ఎన్నికల ప్రభావం తప్పకుండా కరీంనగర్‌ ఎన్నికలపై పడే అవకాశాలు లేకపోలేదు. ఈ ఎన్నికల సందర్భంగా పలు పార్టీలు ప్రజాకర్షణ పథకాలను తమ ఎన్నికల మెనిఫెస్టోలో ప్రవేశ పెట్టాయి. ప్రధానంగా నిరుపేద వర్గాలు, మధ్యతరహా వర్గాలవారిని ఆకట్టుకునే అనేక హామీలను  గుప్పించాయి. అయితే ప్రజలు ఎవరి పక్షాన నిల్వనున్నారన్నది వోట్ల లెక్కింపు తర్వాతే తేలనుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మేయర్లు, చైర్‌పర్సన్‌ల ఎంపిక జరుగనుంది. జనవరి 27న కొత్త పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్స్ ఎన్నిక ఉంటుంది. కరీంనగర్‌ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజున విడుదల కానున్నాయి. అంతవరకు బాగానే ఉన్నా రాష్ట్రంలో ఒక్కో ఎన్నిక జరిగినప్పుడల్లా అప్రజాస్వామ్య పార్టీల అప్రజాస్వామ్య వైఖరి బయటపడుతున్నది. ప్రజాస్వామ్య విధానానికి గొడ్డలిపెట్టుగా ఉన్న ఈ విధానం ఎలా మారుతుందోనని ప్రజాస్వామ్య వాదులు తలలు పట్టుకుంటున్నారు.

Leave a Reply