Take a fresh look at your lifestyle.

మునిసిపల్‌ ఎన్నికల తేదీల్లో మార్పు ?

Telangana Municipal election dates Will changeకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో తెలంగాణలో ముందుగా ప్రకటించిన మునిసిపల్‌ ఎన్నికల తేదీల్లో మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వేషన్లు ముందస్తుగా ప్రకటించకుండా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంపై కాంగ్రెస్‌ ‌పార్టీ హైకోర్టుకు వెళ్ళిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లు ప్రకటించిన నెల రోజుల తర్వాత ఎన్నికలను నిర్వహించే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా ఆ పార్టీ హైకోర్టును కోరింది. ఈ విషయంలో అధికార పార్టీ కాంగ్రెస్‌పై పలు విమర్శలు చేసినప్పటికీ హైకోర్టు మాత్రం దీనిపై విచారణ జరిపింది. జనవరి నాలుగు నాటికి రిజర్వేషన్లు ప్రకటించి, ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రారంభించేలా రాష్ట్ర ఎన్నికల అధికారి గతంలో చేసిన ప్రకటనను పక్కకు పెట్టి, జనవరి ఏడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల లోపు రిజర్వేషన్ల వివరాలను తమకు అందజేశాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ ‌వివరాలతో ఎనిమిదవ తేదీన కోర్టులో అఫిడవిట్‌ ‌వేయాలని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ  తదుపరి విచారణను ఎనిమిదవతేదీకి వాయిదా వేయడంతో అనివార్యంగా ఎన్నికల తేదీల్లో మార్పు చేయక తప్పనిపరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వ, ఎన్నికల కమిషన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ముందుగా ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌ ‌ప్రకారం రాష్ట్రంలోని 120 మున్సిపాల్టీలు, పది కార్పొరేషన్‌ల ఎన్నికలు జరుగాల్సి ఉండింది. కాగా, 22న పోలింగ్‌, 25‌న వోట్ల లెక్కింపు జరుగాల్సి ఉంది. ఇదిలా ఉంటే మరోపక్క రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్ళిన కాంగ్రెస్‌తో పాటు, ఇతర ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు తమ పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నాయి.

ఈ ఎన్నికలకు ముందునుండే టిఆర్‌ఎస్‌ ‌సిద్దంగా ఉంది. తేదీలు, రిజర్వేషన్లు అన్ని తెలుసుకునే టిఆర్‌ఎస్‌ ఎదుటి పార్టీలకు ఆలోచించుకునే అవకాశం లేకుండా తేదీలను ప్రకటింపజేసిందని ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టిపారేస్తున్న టిఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో సింహ భాగం గెలుపు తమదేనన్న ధీమాను  వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే మూడు నాలుగు సర్వేలు చేయించిన ఆ పార్టీ గెలుపు తమకు నల్లేరుపై నడకేనంటోంది. అయినప్పటికీ ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎక్కువ స్థానాలను గెలుచుకునే విషయంలో వ్యూహరచనలో నిమగ్నమై పోయాడు. తాజాగా శనివారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎలాంటి బెదురు లేకుండా ముందుకు సాగాలని పార్టీ వర్గాలకు  సూచించారు.  ఒకసారి అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత, క్యాడర్‌ ‌మొత్తం అతని గెలుపుకోసం కృషి చేయాల్సిందేనంటూ, నియోజకవర్గాల వారీగా బాధ్యతను స్థానిక ఎంఎల్‌ఏలకు అప్పగిస్తూ, క్యాడర్‌తో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా వారిని ఆదేశించాడు.. అవసరం ఉన్నచోట మంత్రులు కూడా ప్రచార బాధ్యతను చేపట్టినా, ఒక వేళ రెబల్‌ అభ్యర్థులెవరైనా ఉంటే వారిని బుజ్జగించి, తిరిగి ప్రచార కార్యక్రమంలో నిమగ్నులను చేయాల్సిన బాధ్యతను కూడా ఎంఎల్‌ఏలే తీసుకోవాలని సూచించడంతో ఈ ఎన్నికల్లో ఎంఎల్‌ఏలదే ప్రధాన భూమికగా మారింది. అభ్యర్థుల విషయంలో గాని, వారి ప్రచార కార్యక్రమాల్లో గాని ఏమాత్రం అలసత్వం చూపించినా దాని ప్రభావం వారి పదవులపై ఉంటుందంటూ కెసిఆర్‌ ‌మంత్రులను, ఎంఎల్‌ఏలను ఘాటుగా హెచ్చరించడంతో ఈ ఎన్నికలను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నదన్నది స్పష్టమవుతున్నది. అయితే టిఆర్‌ఎస్‌లో చాలా కాలంగా నిగూఢంగా అసంతృప్తి ప్రబలుతోంది. అధికారంలో ఉన్నపార్టీ కావడం వల్ల అనేకమంది వివిధ పార్టీల నుండి వచ్చి చేరారు.

ఎన్నికల్లో అభ్యర్థిత్వం దక్కించుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో  ఒకే డివిజన్‌ ‌నుండి అనేక మంది ఆశావహులు ఉండడం, అందరినీ సంతృప్తి పర్చే అవకాశం లేకపోవడంతో  ఈ ఎన్నికల్లో చాలాచోట్ల రెబల్‌ అభ్యర్థుల తలనొప్పి ఆ పార్టీకి ఉండే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.  ఇదిలా ఉంటే దక్షిణాదిన ప్రధానంగా తెలంగాణలో కాషాయ జంఢా పాతాలనుకుంటున్న బిజెపి మునిసిపల్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గెలిచేవారికే టికెట్లు ఇస్తామని చెబుతున్న ఈ పార్టీ ఇప్పటికే ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు, ముఖ్యంగా మునిసిపల్‌ ఎన్నికల్లో గెలువగలరన్న నమ్మకం ఉన్నవారికి గాలం వేస్తున్నారు. ఈ మేరకు వారి విషయంలో సర్వేలను కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో గ్రామీణ వోటర్లను ప్రభావితం చేసేవారిపై ఆ పార్టీ దృష్టిసారిస్తోంది. సాధ్యమైనంత ఎక్కువ స్థానాలను గెలుచుకోవడం కోసం పార్లమెంట్‌ ‌నియోజకవర్గాలవారీగా ఇన్‌ఛార్జీలను నియమిస్తోంది. టిఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీదారు తామేనని చెబుతున్న కాంగ్రెస్‌ ఒక పక్క రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికాకుండానే ప్రకటించిన ఎన్నికల తేదీలను వాయిదా వేయించే పనిలో ఉంటూనే, మరో పక్క అధికార పార్టీ కన్నా ఎక్కువ స్థానాలను సాధించుకోవాలన్న పట్టుదలతో అభ్యర్థుల వేటలో ఉంది. ఈ ఎన్నికల్లో  టిఆర్‌ఎస్‌ను టార్గెట్‌ ‌చేసేందుకు  గత శాసనసభ ఎన్నిక) సందర్భంగా  మ్యానిఫెస్టోలో చెప్పి, నేటికీ పూర్తిచేయని పనులను ప్రజల ముందుకు తీసుకు వెళ్ళి టిఆర్‌ఎస్‌ను నిలదీయడం ద్వారా వోటర్లను ఆకట్టుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్‌ ఉం‌ది. దీంతో ఈసారి మునిసిపల్‌ ఎన్నికలు మంచి ఉత్కంఠ కలిగించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Tags: telangana, elections 2020, postpone, municipal elections results live

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply