Take a fresh look at your lifestyle.

గంటల్లో తేలనున్న పార్టీల భవితవ్యం

Rebels that turn heads into partiesగత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కుస్తీ పడుతున్న ప్రధాన రాజకీయ పార్టీల భవితవ్యం మరో కొన్నిగంటల్లో తేలనుంది. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పును తీసుకు వొచ్చేవిగా ఉన్నాయన్న భావన ఉంది. మున్సిపల్‌, ‌కార్పొరేషన్‌ ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుండీ  ప్రారంభమైన విమర్శలు, ప్రతి విమర్శలు, నినాదాలు, సభలు, సమావేశాలకు సోమవారంతో తెరపడింది. ఈసారి అభ్యర్థులంతా విభిన్న రీతుల్లో తమ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. కాగా ప్రధాన పార్టీలు మాత్రం గెలుపు ధీమాను ప్రకటిస్తున్నాయి. సర్వేలు, ప్రజల అభిప్రాయాలు తమకు అనుకూలంగా ఉన్నాయని ఎవరికివారు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నా, లోపల మాత్రం ఆందోళన చెందుతున్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఆందోళనగా ఉన్న టిఆర్‌ఎస్‌కు ఎప్పుడైతే అఖండ విజయం లభించిందో ఇక మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు కూడా తమకే అనుకూలంగా వొస్తాయన్న నమ్మకం ఏర్పడింది. అయినా ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వ్యూహరచన చేసుకుంటూపోయింది. ఎన్నికల తేదీ ప్రకటన అందులో భాగమే. ఇంకా ప్రతిపక్షాలు ఎన్నికలు సిద్ధం కాకుండానే తేదీల ప్రకటన, అభ్యర్థుల గుర్తింపు లాంటి ప్రక్రియలకు అనుగుణంగానే గుట్టుచప్పుడు కాకుండా ఆ పార్టీ చేసుకుంటూపోయింది. దానికి తోడు నియోజక వర్గాల వారిగా మంత్రులు, ఎంఎల్‌ఏలను ఇన్‌ఛార్జీలుగా పెట్టి, పట్టణ స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటుచేసి అటు అభ్యర్థులను, ఇటు రెబల్స్‌ను సమన్వయ పర్చింది. చెపిన మాట వినని వారిని పార్టీ నుండి వెలివేస్తానని చెప్పినా, కొందరు రెబల్స్‌గా పోటీలో ఉండిపోయారు. గెలిచిన తర్వాత వారు తిరిగి పార్టీలోనే ఉంటామని చెబుతుండగా, పార్టీ అధిష్టానవర్గం ఆ విషయంలో ఇప్పటివరకు స్పందించలేదు. కాగా, మంత్రులు కూడా తమ పోస్టుకు ఎక్కడ ముప్పు వస్తుందోనని కాలుకు బలపం కట్టుకుని తిరిగారు. వివిధ గ్రూపులను సమన్వయపర్చడం, బుజ్జగించడం, పార్టీ పదవులను ఎరబెట్టడం లాంటి ప్రక్రియలతో వారు తమ శక్తిమేర కృషిచేశారు. ఎన్నికలకు చివరి గంటలే ప్రాధాన్యం. ఊహించని మార్పులు, చేర్పులు ఈ కొద్దిగంటల్లోనే జరుగుతాయి. ఏమాత్రం ఏమరు పాటు లేకుండా ఇంకా అమ అభ్యర్థుల కోసం వారు ప్రయాసపడుతూనే ఉన్నారు.
అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేకపోయిన కాంగ్రెస్‌ ఎట్టి పరిస్థితిలో మెజార్టీ చైర్‌పర్సన్స్, ‌మేయర్‌ ‌స్థానాలను గెలుచుకోవాలని ఉత్సాహపడుతోంది. రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా పార్టీలో తమ ప్రాధాన్యతను పెంచుకోవాలని ఆపార్టీ నాయకులు గత కొద్ది రోజులుగా అభ్యర్థుల ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమైనారు. గత ఎన్నికలప్పటి నుండీ పిసిసి అధ్యక్షుడి మార్పుపై అనేక ఊహాగానాలు వొస్తున్నాయి. ఒకవేళ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిని మారిస్తే ఫలానా వారికి అవకాశం దక్కేలా ఉందన్న ఊహాగానాలు, మీడియాలో  ప్రబలుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడం ద్వారా  అధ్యక్ష అవకాశాలను చాలామంది ఆశిస్తున్నారు.

గత లోకసభ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న భారతీయ జనతాపార్టీ ఈ ఎన్నికల్లో కూడా అలాంటి అనూహ్య విజయాన్ని సాధించే అవకాశాలున్నాయని చెబుతోంది.  కనీసం తమ ఎంపీలు గెలిచిన సికింద్రాబాద్‌, ‌కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌ ‌పరిధిలోనైనా అత్యంత అధిక స్థానాలను గెల్వటం ప్రతిష్టగా ఆ పార్టీ భావిస్తోంది. అధికార పార్టీ కుటుంబ పాలన సాగిస్తున్నదని, మజ్లీస్‌ ‌పార్టీని భుజాన వేసుకుని మోస్తున్నదన్న ఆపార్టీ  ప్రచారం ప్రజలను ఆకట్టుకునేవిగా ఉన్నాయి.అధికారపార్టీ టికట్‌ ‌లభించకపోవడంతో రెబల్‌గా నిలబడిన అభ్యర్దులకు మద్దతిచ్చి వారిని గెలిపించాలన్న ఆలోచనలో ఆపార్టీ ఉంది.   ప్రధానంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఈ ఎన్నికలు పరీక్షగా మారాయి. అధికారపార్టీపై ఎన్ని విమర్శలు చేసినా గెలిచే స్థానాలనుబట్టి ఆయన అధ్యక్షపీఠం ఆధారపడి   ఉంది. కాంగ్రెస్‌లోలాగానే చాలాకాలంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై చర్చజరుగుతున్నది. పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌నే కొనసాగించాలా లేక మరెవరినైనా నియమించాలా అన్న వీలుమాంస ఆ పార్టీ అధిష్టానవర్గంలోకూడా ఉంది. ఆపార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడమే ఇంకా పెండింగ్‌లో ఉన్న విషయం తెలియందికాదు. ఏదిఏమైనా ఈ ఎన్నికలు లక్ష్మణ్‌ అధ్యక్షస్థానానికి ఓ పరీక్షగా మారనున్నాయి. ఈ ఎన్నికలపై రానున్న శాసనసభ ఎన్నికల్లో బిజెపి పాత్ర ఏమిటన్నది ఆధారపడిఉందంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ఎంపి కిషన్‌రెడ్డి రాబోయే ఎన్నికల్లో కాబోచే సిఎంను నేనేనంటూ తాజాగా ఆసక్తిగల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  అలా అంటూనే  2024 ఎన్నిక) తర్వాత తాను సాధారణ కార్యకర్త కూడా కావచ్చంటూ ఒక ట్విస్ట్ ఇచ్చారు.  ఇదిలా ఉంటే  రాష్ట్రంలో  బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎంఐఎం రాష్ట్రంలో బిజపి ఒక్క స్థానంలోకూడా గెలువద్దన్న పట్టుదలతో ఉంది. మొత్తానికి ఈ ఎన్నికలు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయనుకుంటున్నారు.

Leave a Reply