తమ ప్రాంతాల్లో రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయాలని తెలంగాణ ఎంపిలు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలసిని ఎంపిలు తమప్రాంత సమస్యలను ప్రస్తావించారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని పలు సమస్యలపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో లోక్‌సభ సభ్యులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు సమావేశమయ్యారు. జాతీయ రహదారి 44 పరిధిలో కొత్తూరు నుంచి కొత్తకోట వరకు సర్వీసు రోడ్డు నిర్మాణం లేక జనం పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకుపోయారు. పలు చోట్ల అండర్ పాస్ లు లేక జరుగుతున్న ప్రమాదాల్లో అనేక మంది మృతి చెందిన విషయాన్ని ఆయనకు తెలిపారు. సర్వీస్ రోడ్లు, అండర్ పాస్ మరియు రోడ్ అండర్ బ్రిడ్జెస్ నిర్మాణం చేపట్టాలని కోరారు. కనిమెట్ట, వేముల, ముదిరెడ్డిపల్లి వద్ద అండర్ బ్రిడ్జిల నిర్మాణం అత్యవసరమని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఎంపీ వినతిపత్రం సమర్పించారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటు అయిన తర్వాత నేటి వరకు ఒక్క జవహర్ నవోదయ విద్యాలయాన్ని కూడా మంజూరీ చేయలేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ కు మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వెంటనే తొలి ప్రాధాన్యంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో జె.ఎన్.వి. ఏర్పాటు చేయాలని కోరారు. వెనకబడిన ప్రాంతాలపై కేంద్రం వెంటనే దృష్టి సారించాలని వినతిపత్రం సమర్పించారు. కల్వకుర్తి ప్రజల చిరకాల కోరిక అయినా దుందుభి నది పైన రఘుపతిపేట- రామగిరిని కలుపుతూ తెల్కపల్లి మరియు లింగాలను కలిపే రహదారికి సంబంధించి వంతెన నిర్మాణం కోసం నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బ్రిడ్జి నిర్మాణం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్ర మంత్రికి వివరించారు. బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 45 కోట్ల మంజూరు చేయమని కోరుతూ కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించారు.
గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ
కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలోని పలు అంశాలపై ఈ సమావేశంలో ఆయన చర్చించారు. ముఖ్యంగా తెలంగాణలో రహదారుల నిర్మాణం గురించి మంత్రితో చర్చించారు. నకిరేకల్ నుంచి నాగార్జున సాగర్ వరకు రహదారి పనులకోసం రూ.200 కోట్లు, ఎన్ హెచ్-65 విస్తరణ పనులకోసం రూ.375 కోట్లు మంజూరు చేసినందుకు గడ్కరీకి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా వలిగొండ, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబ్ నగర్, ఇల్లెందు దుగా హైదరాబాద్ కొత్తగూడెం మధ్య రహదారిని జాతీయ రహదారిగా గుర్తించినా మరమ్మతులు కావడంలేదని గడ్కరీకి ఎంపీ తెలిపారు.