Take a fresh look at your lifestyle.

విశాఖ ఉక్కుకు కేటీఆర్‌ ‌సంఘీభావం పట్ల సర్వత్రా హర్షం

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌రాష్ట్ర మంత్రి కె టి రామారావు చిత్ర పటానికి విశాఖలో గురువారం పాలాభిషేకం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య వెల్లివిరుస్తున్న సామరస్యానికి ఇది నిదర్శనం.ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడానికి అవసరమైతే విశాఖ వెళ్ళి పోరాటంలో పాల్గొంటామంటూ కేటీఆర్‌ ‌చేసిన ప్రకటనపై విశాఖ ఉద్యోగులు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ‌విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని అమలు జరపకుండా, ఉన్న ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులకు మంగళం పాడే రీతిలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల తెలుగు ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. తెలంగాణకు రావల్సిన ఐటిఐఆర్‌ , ‌కోచ్‌ ‌ఫ్యాక్టరీ తదితర ప్రాజెక్టుల విషయంలో కూడా కేంద్రం మొండి చేయి చూపడాన్ని ఆయన కొద్ది రోజుల క్రితం తీవ్రంగా విమర్శించారు.

తెలుగు ప్రజల ఐక్యత, సంఘటిత శక్తి ఏమిటో కేంద్రానికి చూపేందుకే విశాఖ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నట్టు ఆయన చేసిన ప్రకటన విశాఖ ఉక్కు కార్మికులు,ఉద్యోగుల్లో చిత్తస్థయిర్యాన్ని పెంచింది. రాష్ట్రంలో వివిధ పార్టీలు, ప్రజాప్రతినిధులు ఏ ఎండకా గొడుగు పట్టే రీతిలో వ్యవహరిస్తున్నప్పటికీ, పొరుగు రాష్ట్ర మంత్రి ధైర్యం గా మద్దతు ప్రకటించడం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఐదు దశాబ్దాల క్రితం సాగిన పోరాటంలో తెలంగాణ ప్రాంత వాసులు కూడా పాల్గొన్నారు. తెలంగాణలో కూడా నిరాహార దీక్షలు, ర్యాలీలు జరిగాయి. ఆ నాటి తరం వారు చెప్పిన అంశాలను గమనంలోకి తీసుకుని కేటీఆర్‌ ఈ ‌ప్రకటన చేశారు. బీజేపీ నాయకులు మరో వంక రాష్ట్రానికి గడిచిన ఏడేళ్ళలో ఎంతో చేసేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న వేళ,వారి గొప్పల బండారాన్ని ప్రజల ముందు ఉంచేందుకు ఆయన గడిచిన కొద్ది రోజులుగా గణాంకాలతో, సాక్ష్యాధారాలతో ప్రకటనలు చేస్తున్నారు.

ఐటిఐఆర్‌ ‌గురించి కేంద్రం చేసిన వాగ్దానం నీటిమూట అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఐటి రంగ విస్తరణ కోసం ఆయన నిజాయితీగానే పని చేస్తున్నారు. తెలంగాణలోని వరంగల్‌,‌కరీంనగర్‌ ,‌ఖమ్మంలలో ఐటి హబ్‌ ‌లు ఏర్పాటు చేయడం కోసం ఆయన కృషి చేస్తున్నారు. ఐటిఐఆర్‌ ‌ని కేంద్రం మంజూరు చేస్తే ఈ కార్యక్రమం మరింత వేగవంతం అవుతుందని ఆయన నమ్ముతున్నారు. తెలంగాణకు ఇస్తామన్న ప్రాజెక్టుల్లో కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ ముఖ్యమైనది. కాంగ్రెస్‌ ‌పాలనలో ఊరించి ఊరించి చివరికి విభజన చట్టంలో దీనిని చేర్చారు. ఇప్పుడు దానికి మంగళం పాడేందుకు ఎన్‌ ‌డిఏ ప్రభుత్వం యత్నించడం ఏమాత్రం సమంజసం కాదన్న వాదాన్ని జనంలోకి తీసుకుని వెళ్లడంలో కేటీఆర్‌ ఇప్పటికే చాలా మటుకు కృతకృత్యులయ్యారు. తెలంగాణకు కేంద్రం లో మోడీ ప్రభుత్వం చేసింది సున్నా అంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్య పై బీజేపీ నాయకులు విమర్శలు చేసినప్పటికీ , అది పూర్తిగా సత్యమేనని ఆయనతో పాటు తెరాస నాయకులంతా నమ్ముతున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కాళేశ్వరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై శ్రద్ధ తీసుకోవడం వల్లనే సాగునీటి సౌకర్యాలు లభిస్తున్నాయన్న వాస్తవాన్ని జనం గ్రహించారు. తెలంగాణలో ఉద్యోగాల సృష్టి కోసం రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న యత్నాలు ఫలించాలంటే కేంద్రం సహకారం కావాలి.కానీ, కేంద్రం రాష్ట్రానికి పరిశ్రమలు, ప్రాజెక్టుల విషయంలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఆ విషయాలను ఆయన ఇటీవల వరుసగా ప్రస్తావిస్తూ కేంద్రాన్ని విమర్శిస్తున్నారు..ఆయన విమర్శల్లో రాజకీయ ప్రయోజనం ఉన్న మాట నిజమే., తెలంగాణ లో పట్టభద్రుల ఎన్నికలో బీజేపీ నుంచి తెరాస తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. దానిని దృష్టిలో ఉంచుకునే కేటీఆర్‌ ‌విజృంభిస్తున్నారన్న విమర్శల్లో అసత్యం లేకపోవచ్చు.అయితే, ఆయన చెప్పేవన్నీ వాస్తవాలే. అయితే,ఇప్పుడే ఎందుకు ప్రస్తావిస్తున్నారన్న దానిపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందంటూ ఎద్దేవా చేశారు.

ప్రజలకు వాస్తవాలను తెలియజేయడానికే చెబుతున్నానంటూ కేటఆర్‌ ‌సర్దుకున్నారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై దృష్టిని కేంద్రీకరించింది. ఆంధ్రప్రదేశ్‌ ‌లో కూడా చాపకింద నీరులా వ్యాపిస్తోందని ఎంఐఎం నాయకుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఇటీవల చేసిన ప్రకటనలో అసత్యం లేదు.కానీ, చేసిన వాగ్దానల్లో కనీసం కొన్నింటినైనా అమలు జరపకుండా రాజకీయ ప్రయోజం పొందేందుకు బీజేపీ నాయకులు పడుతున్న తొందర చూస్తే జనానికి ఏహ్య భావం కలుగుతోంది. కొత్త వాటిని ఇవ్వకపోగా, ఉక్కుఫ్యాక్టరీని ఊడగొడతామంటూ ప్రకటనలు చేయడాన్ని తెలుగు ప్రజలు సహించలేకపోతున్నారు. పైగా రాష్ట్రానికి సంబంధం లేదంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌చేసిన ప్రకటనలో కవ్వింపు ధోరణి ఉంది. ఈ తరుణంలో తెలుగువారంతా సమైక్యంగా నిలిచి పోరాడటం అవసరమే.

Leave a Reply