Take a fresh look at your lifestyle.

విముక్తి ఉత్సవాల్లో ఎవరిదారి వారిదే

మూడు పార్టీలు మూడు పేర్లతో నిర్వహణ
పరస్పర దూషణలకే ప్రాధాన్యం

మండువ రవీందర్‌రావు

ఆంగ్లేయుల పాలన నుండి దేశానికి విముక్తి లభించిన రోజును పురస్కరించుకుని దేశ ప్రజలంతా నేటి వజ్రోత్సవాల వరకు ‘స్వాతంత్య్ర దినోత్సవం’ పేర వేడుకలను నిర్వహించుకోవడమన్నది అనవాయితీగా వస్తున్నది. కాశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి వరకు ఎవరిని పలకరించినా ఆ రోజును ఒకే పేరుతో (స్వాతంత్య్ర దినం) సంభోదిస్తారు. కాని, తెలంగాణలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. దేశానికి స్వాతంత్య్రం లభించిన పదమూడు నెలల తర్వాత ఇక్కడి ప్రజలు స్వేచ్చా •వాయువులను పీల్చుకున్న రోజును ఇక్కడి ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో పేరున పిలుస్తున్నది. ఒక ప్రాంతం లేదా ఒక దేశం ఆవిర్భవించిన రోజును లేదా స్వాతంత్య్ర లభించిన రోజును పరిగణనలోకి తీసుకుని ఏదైన ఒక నామంతో ఉత్సవాలు జరుపుకుంటారు. తెలంగాణ విషయంలో మాత్రం ఎవరి ఇష్టం వారిదే అన్నట్లుగా తయారైంది. నిజాం నిరంకుశ పాలన నుండి 1948 సెప్టెంబర్‌ 17‌న ఈ ప్రాంతం స్వేచ్ఛను సంతరించుకుంది. అప్పటి నుండి ఈ ప్రత్యేకమైన రోజును ఏ పేరుతో పిలువాలన్న విషయంలో రాజకీయ పక్షాలు, మేథావి వర్గాలు గత ఏడున్నర శతాబ్ధాలుగా చర్చోపచర్చలు జరుపుతూనే ఉన్నాయి. అయినా ఇంతవరకు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి.

విచిత్రమేమంటే ఇంతకాలం అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకూడా ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలన్న ఆలోచన చేయకపోవడం కూడా సెప్టెంబర్‌ 17‌కు ఇంతవరకు నామకరణం చేయకపోవడానికి కారణంగా మారి ఉంటుంది. డెబ్బై అయిదేళ్ళ తర్వాత కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ, రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాలకు తాము ఇంతకాలం ఈ వేడుకలను చేయలేకపోయామేనన్న విషయంపైన జ్ఞానోదయం కలిగినట్లుంది. ఉన్నపళంగా పోటీలు పడుతూ ఉత్సవాలను నిర్వహణకు శ్రీకారం చుట్టాయి. అది కూడా ఏదో ఒక పేరున కాకుండా ఎవరికి తోచిన పేరుతో వారు ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని విమోచన దినంగా పేర్కొంటూ ఏకంగా సంవత్సరం పాటు ఉత్సవాలను నిర్వహించాలని తలపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి మరో కొత్త నామకరణతో మూడు రోజుల ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. జాతీయ సమైఖ్యతా వజ్రోత్సవాలంటూ ఇంతవరకు విమోచన, విముక్తి లాంటి వివాదాల నుండి బయటపడింది. ఈ రాష్ట్రాన్ని (ఉమ్మడి రాష్ట్రాన్ని) ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్‌ ‌కూడా ఏనాడు అధికారికంగా ఈ ఉత్సవాలను చేయాలని ఆలోచించిందిలేదు. కాని, ఇక ముందు తాము అధికారంలోకి వొస్తే అధికారికంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని చెబుతుంది.  ఆ పార్టీ కూడా ప్రస్తుతం ఈ రోజును తెలంగాణ విమోచన దినంగానే పరిగణిస్తూ  ఉత్సవాలను చేపట్టింది. నిజాం నుండి ఈ ప్రాంతాన్ని విముక్తి కలిగించడంలో ప్రధాన పాత్ర వహించిన కమ్యూనిస్టులు మాత్రం దీన్ని విద్రోహ దినంగా పరిగణిస్తున్నారు.

ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు వారికి తోచిన పేరుతో ఈ ఉత్సవాలను నిర్వహించడంతోపాటు, పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున ఒక్కో పార్టీ ఒక్కో దగ్గర జాతీయ పతాకాలను ఎగురవేశాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాజధానిలోని ఎన్టీఆర్‌ ‌స్టేడియంలో పతాకావిష్కరణ అనంతరం చేసిన ప్రసంగంలో బిజెపి పేరెత్తకుండానే ఆ పార్టీ విధానాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేయాలని కొన్ని శక్తులు చూస్తున్నాయని తీవ్ర ఆరోపణ చేశారు. పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టే కుట్రలు జరుగుతున్నాయని, విద్వేశ మంటలు లేపి ఆశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రజలు అలాంటి శక్తులపట్ల జాగురూకతగా ఉండాలని ప్రబోధించారు. నిజాం కబంధ హస్తాల నుండి స్వేచ్ఛను పొందిన తెలంగాణ రెప్పపాటు కాలం అదమరిచినందుకు సుదీర్ఘకాలం పోరాడాల్సి వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, తిరిగి అలాంటి పొరపాటు జరుగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

గాంధీభవన్‌లో ఎన్‌ఎస్‌యుఐ చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా అదే తరహాలో బిజెపిని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి, మత విద్వేషాలను రెచ్చగొట్టాలని బిజెపి చూస్తున్నదన్నారు. స్వతంత్ర పోరాటంలో కాని, తెలంగాణ పోరాటంలోగాని బిజెపి పాత్రలేదు. కాని, ఇతర పార్టీల నుండి నాయకులను అరువు తెచ్చుకుని తమ వారిగా, తమ పార్టీ కూడా ఉద్యమ పార్టీ అనిచెప్పుకునే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. సర్థార్‌ ‌వల్లభభాయి పటేల్‌ను బిజెపి వాడుకుంటుందని, ఆయన కాంగ్రెస్‌ ‌వాడు, కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడిగా చేసినవాడన్న విషయాన్ని గుర్తు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ ‌ప్రాంతాల్లో తెలంగాణ గ్రామాలు కలిశాయి. ఇవ్వాళ తెలంగాణపైన చూపిస్తున్న ప్రేమను ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం పక్షాన అధికారికంగా ఎందుకు చేపట్టలేక పోయిందంటూ ఆయన బిజెపిని నిలదీశారు. ఇక్కడ విద్వేశాలు రెచ్చగొట్టి, ఇక్కడి  పరిశ్రమలను గుజరాత్‌కు తరలించుకు పోవాలన్న కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ ఉత్సవాలకోసం ఢిల్లీ నుండి ఒక రోజు ముందే నగరానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పరేడ్‌ ‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ సమావేశంలో మాట్లాడుతూ వోటు బ్యాంకు రాజకీయాలతోనే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారింగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదని ఆరోపించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంతకాలంగా ఉత్సవాలను నిర్వహించలేక పోయిందన్న విషయంలో మాత్రం ఆయన వివరణ ఇవ్వలేదు. కాగా మహారాష్ట్ర, కర్నాటక సిఎంలను ఆహ్వానించిన బిజెపి ఆ రాష్ట్రాల్లోకూడా అధికార వేడుకలను ఎందుకు ప్రారంభించలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంకో విచిత్రకర విషయమేమంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా గన్‌ ‌పార్క్ ‌వద్ద పటేల్‌ ‌విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు జిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌, ఎంఎల్‌ఏ ‌రఘునందన్‌రావు, మాజీ ఎంపి వివేక్‌ ‌వెంకటస్వామిలు పాల్గొన్నారు. మొత్తానికి రానున్న ఎన్నికల్లో పోటీ పడనున్న ఈ మూడు పార్టీలు మూడు పేర్లతో వేరువేరుగా తెలంగాణ విమోచనాన్ని నిర్వహించుకున్నాయి. అయితే ఈ ప్రాంత ప్రజలు స్వేచ్ఛ కోసం సుదీర్ఘకాలం చేసిన పోరాటంలో ఎంత నష్టపోయారు, ముందు తరాలవారికి ఆ నష్టాన్ని ఏ విధంగా పూడుస్తామన్న విషయాన్ని మాత్రం ఏ ఒక్క పార్టీ వివరించ లేకపోయింది.

Leave a Reply