Take a fresh look at your lifestyle.

ఆం‌ధ్ర రాజధాని కోసం తెలంగాణలో పూజలు

capital-issue-amaravathi-telugudesam-party

ఆరేళ్ళ కింద ఏర్పడిన ఆంధ్రరాష్ట్ర రాజధానిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం లేకపోవడంతో అమరావతి రైతులు సమ్మక్కకు విన్నవించుకోవడానికి రావడం విశేషం. ఏపి రాజధాని అమరావతి బదులుగా మూడు రాజధానులను ఏర్పాటుచేస్తామని ఏపి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌తీసుకున్న నిర్ణయాన్ని అమరావతి రైతులు చాలాకాలంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేస్తామంటేనే తమ విలువైన భూములను త్యాగం చేశామని, కాని, సిఎం జగన్‌ ‌మోహన్‌రెడ్డి గత నిర్ణయాన్ని కాదనడం తమకు శాపంగా మారిందంటూ గత యాభై రోజులుగా వారు దీక్షలు చేపట్టారు. అయినా జగన్‌ ‌మోహన్‌రెడ్డి ఏమాత్రం వారి గోడును పట్టించుకోకపోవడంతో తెలంగాణలో అసియాలో పెద్ద జాతరగా చెప్పుకుంటున్న మేడారం సమ్మక్కకు తమ గోడును విన్నవించుకోవడానికి ఏకంగా బస్సులో అమరావతి రైతులు వొచ్చారు. కోరిన కోరికలను తీరుస్తుందన్న నమ్మకం ఈ అమ్మపట్ల ఉంది కాబట్టి, తమ ముఖ్యమంత్రి ఆలోచనను మార్చాలని ఆ అమ్మను వేడుకునేందుకు తాము వచ్చామని వారు చెబుతున్నారు. నిరసనలు, ధర్నాలు, విన్నపాలు ఎన్ని చేసినా లాభంలేకపోయింది. ఇప్పుడు తాము సిఎం దగ్గరకు వెళ్ళే పరిస్థితిలేదు. కనీసం అమ్మకు విన్నవించుకోవడం ద్వారానైనా ఆయనలో ఏమైనా మార్పు వస్తుందేమోన్న ఆశతో వొచ్చామంటున్నారు. విజయవాడలో దుర్గమ్మను ఎలా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నామో, మేడారం సమ్మక్కను కూడా దర్శించుకుని తమ విన్నపాన్ని చెప్పామని,అమరావతి రాజధానిగా అవుతే అమ్మవారికి ఘనంగా తాము మొక్కులు సమర్పించుకుంటా మంటున్నారు అమరావతి మహిళలు. ఈ సందర్భంగా వారు మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అన్న నినాదాలుకూడా చేశారు. ఈ సందర్బంగా వారు భావోద్వేగానికి గురై, కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎదురుగా ములుగు ఎంఎల్‌ఏ ‌సీతక్క కనిపించడంతో విలపిస్తూనే ఆమె కాళ్ళమీద పడ్డారు.

అయితే అమ్మవార్ల ఆశిస్సులు వారికి తప్పక ఉంటాయని ఆమె ఓదార్చింది. కాని, ఏపి రాజధానిపై ఆ రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెల్లవారింది మొదలు రాష్ట్ర రాజధానియే ప్రధాన చర్చగా మారింది. అయితే దీనిపై కేంద్రం కూడా కీలక ప్రకటన చేయడం విశేషం. మూడు రాజధానులంటూ ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్రం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇస్తున్నట్లే కనిపించడతో ఇప్పుడు ఏపి రాజకీయాలు వేడెక్కాయి. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికే వదిలిపెట్టినట్లు కనిపిస్తున్నది. కేంద్రం మొదటినుండీ చెబుతున్నట్లుగానే ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికూడా రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిందనడం అమరావతి రైతులను అయోమయంలో పడేస్తున్నది. అలాగే రాజధానికోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సి ఉందని ఆయన నర్మగర్భంగా అన్న మాటలుకూడా జగన్‌ ‌ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయనిపించడంతో ఆందోళన చేస్తున్నవారి గుండెల్లో రాయి పడినట్లైంది. అలాగే రైతుల ఆందోళనలపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయంతీసుకుంటుందని కూడా ఆయన చెప్పడం చేతులు దులుపుకున్నట్లుగానే కనిపిస్తోందంటున్నారు. అలాగే ఆపార్టీ ఎంపి, పార్టీ అధికార ప్రతినిధి జివిఎల్‌ ‌నరసింహారావు మాటలు కూడా అమరావతి ఆందోళనకారులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో యాభై శాతం మంది ప్రజలు వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని, అలాంటి ప్రభుత్వంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందనడంకూడా కేంద్రం ఆందోళనకారులను పట్టించుకోదన్నది స్పష్టమవుతున్నది. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశం, ఆ ప్రభుత్వం ఎక్కడ పెట్టుకోవాలన్నది నిర్ణయించుకుంటుందని, రాష్ట్రానిదే తుదినిర్ణయమని ఖచ్చితంగా చెప్పడంతో ఇక జగన్‌ ‌నిర్ణయానికి తిరుగులేదని స్పష్టమవుతోంది. అయితే ఇప్పటికే అమరావతే రాజధానిగా ఉండాలని దాని పరిసరాల్లోని 29 గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. మూడు రాజధానులవల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, పైగా మూడు పంటలు పండే పొలాలను ఇచ్చి, తమ పిల్లల భవిష్యత్‌ ‌బాగుపడుతుందనుకున్న తమను ఇలా అన్యాయం చేయడమేంటని గత యాభై రోజులుగా అమరావతికి చెందిన మహిళలు కూడా రోడ్డెక్కారు. ఇప్పుడు వారంతా ఒక బస్సులో మేడారం వచ్చి, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తమకు లభించిన అమ్మవారి ప్రసాదమే తమను కాపాడుతుందన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధానిగా ఏర్పడితే తప్పకుండా మరోసారి దర్శనానికి వచ్చి, మొక్కు తీర్చుకుంటామంటున్నారు అమరావతి మహిళలు.

Leave a Reply

error: Content is protected !!