Take a fresh look at your lifestyle.

సరికొత్త రికార్డును నెలకొల్పబోతున్న తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రాష్ట్రం అనేక సరికొత్త రికార్డులను నెలకొల్పింది. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో అయితేనేమీ, ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో అయితేనేమీ తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా మారింది. కొరోనా విషయంలో కూడా ఇతర రాష్ట్రాలకన్నా సత్వరంగా స్పందించింది కూడా తెలంగాణనే. ఇప్పుడు అదే కొరోనా విషయంలో మరో కొత్త రికార్డును నెలకొల్పబోతున్నది. తమ దేశంలో పురుడు పోసుకున్న కొరోనాను నివారించే విషయంలో చైనా చాలా చురుగ్గానే వ్యవహరించినా పెద్ద సంఖ్యలో అక్కడ ప్రాణహాని జరగడాన్ని ఎవరూ కాదనలేని విషయం. రోగనివారణ చర్యల్లో భాగంగా ఆదేశం కేవలం ఎనిమిది రోజుల్లోనే వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రపంచ దేశాలతో ఔరా అనిపించుకుంది. ఇప్పుడలాంటి ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ఆవిష్కరించబోతున్నది. కొరోనా రోగులకోసం రాష్ట్ర రాజధానిలో ప్రత్యేకంగా 1500 పడకలు గల దవాఖానాను కేవలం పదిరోజుల్లోనే ఏర్పాటు చేసే దృఢ సంకల్పంలో రాష్ట్ర ప్రభుత్వముంది. కొరోనా వైరస్‌ ‌బారినపడుతున్న వారి సంఖ్య రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతుండడంతో ఇలాంటి దవాఖానా ఒకటి అవసరమని ప్రభుత్వం గుర్తించింది. దీంతో గచ్చిబౌలీలోని స్పోర్ట్ ‌సెంటర్‌ ‌భవనాన్ని ప్రత్యేక కొరోనా దవాఖానాగా మారుస్తున్నారు. పదిహేను అంతస్తుల్లో ఉన్న ఈ భవనంలో పదిహేను వందల పడకలను ఏర్పాటుచేయబోతున్నారు. తొమ్మిది ఎకరాల ఈ సువిశాల స్థలంలో ఒక్కో అంతస్తులో దాదాపు 36 గదులతో, మామూలు దవాఖానాల్లా కాకుండా ఫైవ్‌ ‌స్టార్‌ ‌హోటల్స్‌ని తలపించే విధంగా దీని నిర్మాణం జరుగుతున్నది.

ఇందులో అత్యంతాధునిక వైద్య సదుపాయాలను అందజేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొంత ఫర్నిచర్‌, ‌మెడికల్‌ ‌కిట్స్‌ను అక్కడ ఏర్పాటు చేయడమైంది. రోగులను కూడా అక్కడికి చేర్చే ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవంగా ఏప్రిల్‌ 15‌లోగా ఈ దవాఖానా ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు దాదాపు వెయ్యి మంది కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. డెబ్బై మంది వైద్య బృందాన్ని, వందకు పైగా నర్సింగ్‌ ‌స్టాఫ్‌ను, పారా మెడికల్‌ ‌స్టాఫ్‌ను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో పడకకు మధ్య ఆరు మీటర్ల దూరం ఉండేలా చూస్తున్నారు. కొరోనా అనుమానితులను, కొరోనా పాజిటివ్‌ ‌వచ్చిన వారిని వేరువేరు అంతస్తులో ఉంచే ఏర్పాటు చేస్తున్నారు. ఉస్మానియాకు అనుబంధంగా ఉండే దీన్ని కోవిడ్‌-19 ‌దవాఖానాగా ప్రభుత్వం ఇప్పటికే నామకరణం చేసింది కూడా. ఇది పూర్తి స్థాయిలో ఐసోలేషన్‌ ‌కేంద్రంగా రూపుదిద్దుకోబోతున్నది. ఈ నిర్మాణంతో తెలంగాణ ప్రభుత్వం మరో నూతన రికార్డును నెలకొల్పబోతోంది. మొదటి దశలో యాభై పడకల ఐసీయు విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల కొరోనా రోగులకు మరింత ఆత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చే అవకాశముంది. హైదరాబాద్‌లోని గాంధీ, ఛాతి, కింగ్‌కోఠి జిల్లా దవాఖానా, సరోజినీదేవి కంటి దవాఖానాలు ఇప్పటికే కొరోనారోగులకు సేవలు అందిస్తున్నాయి. అయినా రోజురోజుకు కొరోనా వైరస్‌ ‌రోగుల సంఖ్య పెరుగుతుండడంతో చికిత్స లేదా క్వారంటైన్‌ ‌కేంద్రాలుగా రాష్ట్రంలోని మరో ఇరవైరెండు మెడికల్‌ ‌కాలేజీ హాస్పిటళ్లను కూడా పూర్తిగా కొరోనా చికిత్స కోసమే వినియోగిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 453 కొరోనా కేసులు నమోదయ్యాయి ఇందులో 49 కేసులు కొత్తగా నమోదైనవేవున్నాయి. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు కేవలం 11 మంది మాత్రమే మృతిచెందారు. అయితే వైద్యులు తీసుకుంటున్న నిరంతర శ్రద్ధ కారణంగా దాదాపు 45మంది రికవరీ అయి డిశ్చార్జి అయినారు.

ఢిల్లీలోని తబ్లిగీ జమాత్‌ ‌కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వారివల్ల ఇక్కడ రోగుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే ప్రభుత్వం అక్కడికి వెళ్ళివచ్చిన వారందరినీ దాదాపుగా గుర్తించి క్వారంటైన్‌లో చేర్చడంతో ఊపిరి తీసుకున్నట్లైంది. దాదాపుగా ఇక కొత్త కేసులు వచ్చే అవకాశాలు చాలా అరుదని రాష్ట్ర ప్రభుత్వం ఆభిప్రాయపడుతున్నది. అయితే పక్క రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమెంత్తైనా ఉంది. అందుకు ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలను తీసుకుంటోంది. ప్రస్తుతమున్న 80వేల పర్సనల్‌ ‌ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ ‌కిట్లకు అదనంగా మరో అయిదు లక్షల కిట్లను తెప్పిస్తున్నారు. అలాగే లక్షకుపైగా ఉన్న ఎన్‌ 95 ‌మాస్క్‌లకు అదనంగా మరో అయిదు లక్షల మాస్క్‌లను, రెండు కోట్ల సర్జికల్‌ ‌మాస్క్‌లను, కోటి గ్లౌజ్‌లను, అయిదు లక్షల గాగుల్స్‌కు కూడా ఆర్డర్‌ ఇచ్చారు. ఇదిలా ఉంటే వివిధ దేశాల్లో నమోదు అవుతున్న కేసులవల్ల కూడా ఎటునుంచి ఎటు ముప్పు వాటిల్లుతుందోనన్న భయం లేకపోలేదు. అందుకే ప్రతీ చిన్న విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తపడుతున్నది. కొరోనా సోకిన వారి నోటి తుంపర్ల వల్ల మరొకరికి ఈవ్యాధి అంటుకునే ప్రమాదముండడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటున్నది. ఎవరైనా బహిరంగంగా ఉమ్మివేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే లాక్‌ ‌డౌన్‌ అన్నది ఒక్కటే కొరోనాకు మంచి మందవుతున్న దృష్ట్యా దాన్ని పొడిగించే విషయంలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు కేంద్రానికి సూచన చేశాయి. కేంద్రం దీనిపై ఇప్పుడు నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!