Take a fresh look at your lifestyle.

పోటీ సభలతో హోరెత్తుతున్న తెలంగాణ

వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ పేరున కాంగ్రెస్‌ ‌పార్టీ ఇటీవల నిర్వహించిన సభ విజయవంతం అవడంతో కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో  నూతనోత్సాహం వెల్లివిరిసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం, మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్‌గాంధీ అడుగు పెట్టి అటు రైతులను, ఇటు యువతను అకట్టుకునే విధంగా మాట్లాడిన తీరు కాంగ్రెస్‌ ‌పార్టీకి జీవం పోసినట్లు అయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన దాదాపు ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌తన ప్రతిష్టను కోల్పోతూనే వొచ్చింది . దీంతో క్యాడర్‌లో తీవ్ర నిరశ ఏర్పడింది. అయితే రేవంత్‌రెడ్డికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అప్పగించిన తర్వాత ఆ పార్టీ మళ్ళీ కొద్ది కొద్దిగా పుంజుకోవటం ప్రారంభించింది. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బ తాకినప్పటికీ అధికార టిఆర్‌ఎస్‌ను అడుగడుగున నిలదీస్తూ  కాంగ్రెస్‌ ‌ప్రజల పక్షాన ఉందన్న నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేయడంలో రేవంత్‌రెడ్డి ఒక విధంగా సక్సెస్‌ అయినాడనే చెప్పవొచ్చు.

పార్టీలో మరింత ఊపు తీసుకురావడానికి వరంగల్‌ ‌సభను ఒక గీటు రాయిగా పెట్టుకుని దాన్ని విజయవంతం చేయడం ద్వారా పార్టీలోని అసంతృప్తి వాదులకు, నిరాశకు గురి అయిన క్యాడర్‌కు ఒక నమ్మకాన్ని కలిగించినట్లు అయింది. ఇది ఒక విధంగా అధికార పార్టీకి తామే ప్రత్యమ్నాయం అని చెప్పుకుంటున్న బిజెపికి చురుకు తగిలించినట్లు అయింది. రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు దూసుకుపోతున్న బిజెపికి ఇప్పుడు మరింత దూకుడు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఒకటి రెండు సంవత్సరాలు మినహా ఆ తర్వాత తామే గోలకొండమీద కాషాయ జండాను ఎగురవేస్తామని చెబుతున్న బిజెపికి రాష్ట్ర రాజకీయాలు కూడా దాదాపు అనుకూలంగా మారుతూ వచ్చాయి. దాదాపు అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హుజురాబాద్‌ ‌స్థానాన్ని దక్కించుకోవడంతో విజయపరంపర తమదేనన్న ధీమాలో ఆ పార్టీ ఉంది. దానికి తగినట్లుగా మొదటినుండి రాష్ట్ర రాజకీయాలపై ఆ పార్టీ జాతీయ నాయకులు పకడ్బందీగా వ్యవహరిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ చేపట్టే ప్రతీ కార్యక్రమానికి స్కెచ్‌ అం‌తా కేంద్ర పార్టీ నుండే జరుగుతున్నదన్న ప్రచారం ఉంది.

కాంగ్రెస్‌ ‌జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటిస్తున్న క్రమంలోనే బిజెపి జాతీయ అధ్యక్షుడు  జెపీ నడ్డా తెలంగాణలో పర్యటించారు. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా రాష్ట్రానికి రాబోతున్నారు. రాహుల్‌ ‌వొచ్చి వెళ్ళిన సరిగ్గా వారం రోజులకే అమిత్‌షా పర్యటన ఖరారైంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్ర పేరున రెండవ విడుత తెలంగాణ జిల్లాల్లో జరిపిన పాదయాత్ర  ముగింపు సభను ఈ నెల 14వ తేదీన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో అమిత్‌షా పాల్గొని ప్రసంగించనున్నందున, రాహుల్‌ ‌సభకన్నా ధీటుగా ఈ సభను నిర్వహించాలని ఆ పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సభకు కనీసం అయిదు లక్షల మంది హాజరయ్యేట్లుగా నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే  కాంగ్రెస్‌ ‌పార్టీ ఇటీవల నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌తో అధికార టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి ఇప్పటికే చల్ల చమటలు పడుతున్నాయని  కాంగ్రెస్‌పార్టీ వర్గాలు అంటుంటే, ఇప్పుడు దూకుడుగా వొస్తున్న బిజెపి సభ తర్వాత టిఆర్‌ఎస్‌ ‌పరిస్థితి ఏమిటన్న మాటలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో  ఉండి దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికలను చే జార్చుకున్న టిఆర్‌ఎస్‌ ఈ ‌రెండు పార్టీల దూకుడుతో రానున్న శాసనసభ ఎన్నికల్లో  ఏమేరకు ఎదుర్కుంటుందన్నది ఇప్పుడు అందిరిలో ప్రశ్నగా మిగిలింది.

కాంగ్రెస్‌ను మొదటినుండి దూరం పెట్టిన టిఆర్‌ఎస్‌, ఇప్పుడు బిజెపిని కూడా దూరం పెట్టడమేకాకుండా ఆ పార్టీ కేంద్ర నాయ••త్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ఈ రెండు పార్టీలను మినహాయించి ఇతర పార్టీలతో జాతీయ స్థాయిలో థర్డ్ ‌ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌చేసిన ప్రయత్నాలేవీ ఇప్పటిరకైతే ఫలించిన దాఖలాలు లేవు. దేశంలో ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఫలితాలు చూసిన తర్వాత పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని ఒక విధంగా అ విషయంలో వెనుకడుడు వేసినట్లు కనిపిస్తున్నది. అంతమాత్రన ఆ విషయాన్ని అటుకెక్కించలేదనడానికి ఇటీవల పికెతో జాతీయ స్థాయిలో జరుగుతున్న మంతనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు వొస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అటు బిజెపి, ఇటు కాంగ్రెస్‌ అభ్యర్థులను నిలుపనున్నాయి. ఈ రెండు పార్టీల్లో ఎవరిపక్షాన నిలువాలన్నదిప్పుడు టిఆర్‌ఎస్‌కు విషమ పరీక్షకానుంది. దీంతో మరోసారి దేశ రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. మొత్తానికి వొద్దనుకుంటున్న కాంగ్రెస్‌, ‌బిజెపిలతోనే రానున్న కాలంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు టిఆర్‌ఎస్‌కు ఏర్పడనున్నాయి.

Leave a Reply