Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడిలో ముందు వరుసలో తెలంగాణ

కొరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకన్నా ఎప్పుడూ ముందే ఉంటున్నది. దేశంలో వైరస్‌ ‌నివారణకు లాక్‌డౌన్‌ ఒకటే ఏకైక మార్గంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి మూడుసార్లుగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తున్నది. అయితే కేంద్రం పొడిగింపుకన్నా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటూ వస్తున్నది. ముందుగా మే 3వ తేదీవరకు లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం మే ఏడవ తేదీ వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ‌యథావిధిగా  కొనసాగుతుందని ప్రకటించింది. ఆతర్వాత దేశంలో కొరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని  కేంద్రం మే 3 నుండి 17వ తేదీవరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కాని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం అంతకు మరో నాలుగురోజులు అదనంగా మే 21 వరకు పొడిగించే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇంకా ఈ విషయంలో అధికార ప్రకటనేదీ రాలేదు. కాని, కొత్తగా పలు కొరోనా కేసులు దేశ వ్యాప్తంగా వెలుగుచూస్తున్న దరిమిలా లాక్‌డౌన్‌ను మే 21వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఉన్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో కొరోనా వ్యాధి విషయంలో అధికారులు, మంత్రులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనే పొడిగింపుపై అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తున్నది. కాగా నేడు జరిగే క్యాబినెట్‌ ‌సమావేశం దీనిపై తుదినిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.  దేశంలో రోజురోజుకు కొరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఇప్పటివరకు ఆ సంఖ్య 40వేల 263కు చేరుకోగా 1,306 మంది మృత్యువాత పడ్డారు. అయినప్పటికీ గత నలభై రెండు రోజులుగా ప్రజలు స్వీయ నిర్బంధంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో  కేంద్రం మూడవసారి లాక్‌డౌన్‌ ‌పొడిగింపులో కొన్ని సడలింపులను ప్రకటించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్‌ ఎప్పటిలాగానే కొనసాగుతుందని తెలిపింది.  అయితే ఎంకి పెళ్ళి సుబ్బు చావుకొచ్చిందన్నట్లు కేంద్రం ఇచ్చిన సడలింపు మార్గదర్శకాలు తెలంగాణ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరంగా మారాయి.

అందులో ముఖ్యంగా మద్యం షాపులకు ఇచ్చిన వెసులుబాటు. సామాజిక దూరాన్ని పాటిస్తూ నిర్ణయించిన సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు మద్యాన్ని విక్రయించుకోవచ్చని కేంద్ర సూచించింది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు ప్రధాన ఆదాయమంతా మద్యం విక్రయాలనుంచే వస్తుందన్నది జగమెరిగిన సత్యం. దీంతో తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాలైన ఏపి, కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు మద్యం విక్రయాలకు సిద్దమైనాయి. కాగా, లాక్‌డౌన్‌ అమలు మొదలైనప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వం మాత్రం మద్యం దుకాణాల మూసివేతకు కట్టుబడి ఉంది. లాక్‌డౌన్‌ ‌సంపూర్ణంగా ఎత్తివేసిన తర్వాతే మద్యం విక్రయాలకు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే ఇక్కడి మద్యం ప్రియులు అప్పటివరకు ఆగే అవకాశం ఉందా? ఇప్పటికే మద్యం షాపులు తెరిపించాలంటూ చాలా రోజులుగా కొందరు డిమాండ్‌ ‌చేస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు పకడ్బందీగా కాపలా కాస్తున్నా అక్రమంగా మద్యం రాష్ట్రంలోకి వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్క రాష్ట్రాలు ఇప్పుడు విక్రయాలు ప్రారంభిస్తే అవి అక్రమంగా రాష్ట్రానికి  చేరుకునే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా అధిక ధరలకు విక్రయించే అవకాశం కూడా ఉంది. మద్యం విషయంలో తెలంగాణలో  నిర్బంధం ఇలానే కొనసాగితే కల్తీ మద్యం ప్రవేశించినా ఆశ్చర్యపడాల్సింది లేదంటున్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.  దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్తసమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.  ఈ పరిస్థితుల దృష్ణ్యా  మద్యం విక్రయాలపై ఏదో ఒక నిర్ణయాన్ని సత్వరం తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. లాక్‌డౌన్‌ ‌కారణంగా రాష్ట్రం ఇప్పటికే మద్యంపైన సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలమేర ఆదాయాన్ని కోల్పోయిందన్నది ఒక అంచనా. అయినప్పటికీ  ప్రజల ఆరోగ్యం దృష్ణ్యా ఇంకా  ఈ నిర్బంధాన్ని కొనసాగించాలనే అభిప్రాయపడుతున్నది. ఇదిలా ఉంటే కేంద్రం అలా సడలించిందో లేదో ఇలా సోమవారం ఉదయం నుండే మద్యం షాపుల దగ్గర మందు బాబులు బార్లు తీరారు. పక్కనే ఉన్న ఏపిలో అధికధరలకు విక్రయాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులొస్తున్నా, జనం మాత్రం మద్యం దుకాణాల ముందు మైళ్ళ తరబడి క్యూ కట్టారు. ఈ క్యూల్లో పోలీసులు ఎంతవారించినా వ్యక్తిగత దూరాన్ని ఎవరూ పాటించకపోవడంతో పోలీసులు చివరకు లాఠీలకు పనిచెప్పాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. అయితే మద్యం విక్రయాలను వెంటనే నిలిపివేయాల్సిందిగా ఆ రాష్ట్ర మహిళలు ఆందోళన చేపడుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఏం నిర్ణయంతీసుకుంటుందో వేచి చూడాలి.

Leave a Reply