Take a fresh look at your lifestyle.

తెలంగాణ.. భారతదేశ విత్తన భాండాగారం

  • విత్తన ఎగుమతుల్లో 65 శాతం రాష్ట్రం నుంచే
  • అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ ‌కృషితో తెలంగాణ భారత దేశానికి విత్తన భాండా గారంగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్న విత్తనాలలో 65 శాతానికి పైగా రాష్ట్రం నుంచే సరఫరా అవుతున్నాయని చెప్పారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ‌కోటి ఎకరాల మాగాణం కల నెరవేరుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తే లాభదాయకం అనేది రైతులకు తెలియజెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ నిపుణుల బృందం తెలంగాణలో రెండు పర్యాయాలు పర్యటించిందని చెప్పారు.

- Advertisement -

ఆ బృందం రాష్ట్రంలోని 23 జిల్లాలలో ఆయిల్‌ ‌పాం పంట సాగుకు అనువైన వాతావరణం ఉందని తెలిపిందని వెల్లడించారు. రాష్ట్రంలోని 18,100 హెక్టార్లలో ఆయిల్‌ ‌ఫాం పంటను సాగు చేసుకోవచ్చని కేంద్ర బృందం ప్రతిపాదించినట్లు తెలిపారు. దేశంలో చట్టబద్దత ఉన్న ఏకైక పంట ఆయిల్‌ ‌పాం అనీ ఈ పంట సాగుకు సంబంధించి రైతుల సరఫరా, బీమా, గిట్టుబాటు ధరతో పాటు కొనుగోలు వంటి విషయాలన్నింటినీ ప్రభుత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఆయిల్‌ ‌పాం పంటను నాలుగేళ్లకు ఒకసారి సాగు చేయాలనీ, మధ్యలో అంతర పంటగా మరే ఇతర పంటనూ వేయవద్దని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయిల్‌ ‌పాం సాగు చేసే రైతులకు ఎకరాకు రూ. 20 వేల సబ్సిడీ ఇస్తుందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 450కి పైగా విత్తనోత్పత్తి కేంద్రాలు ఉన్నాయనీ, అంతర్జాతీయ విత్తన ధృవీకరణ సంస్థను సైతం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం వాణిజ్య పంటల దిగుబడి భారీ స్థాయిలో పెరిగిందనీ, అయితే, రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు సరైన ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నప్పటికీ కేంద్రం ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.

Leave a Reply