Take a fresh look at your lifestyle.

ఎందుకీ తొందర..!

  • యాంజాల్‌ ‌భూములపై విచారణకు ఐఎఎస్‌ల కమిటీయా
  • ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం

‌దేవరయాంజల్‌ ‌భూముల దర్యాప్తుపై ఆదరాబాదరాగా ఐఎఎస్‌ల కమిటీ వేయడంలో ఆంతర్యం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.కొరోనా విజృంభిస్తుంటే ఇప్పుడా విషయంలో ఎందుకు తొందరెందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భూముల దర్యాప్తుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా .. ఎప్పటి నుంచో ఉన్న వివాదంపై ఇప్పుడే తొందర ఎందుకని ప్రశ్నించింది. ప్రజలు కొరోనా తో మరణిస్తుంటే లేని స్పందన ఈ అంశంపై ఎందుకని నిలదీసింది. కొరోనా విపత్తు వేళ నలుగురు ఐఏఎస్‌లతో విచారణ జరపాలా అని అడిగింది.కేవలం ప్రాథమిక విచారణ కోసమే కమిటీ ఏర్పాటు చేశామని అడ్వొకేట్‌ ‌జనరల్‌ ‌కోర్టుకు తెలిపారు. కమిటీ నివేదిక ఇచ్చాకే చట్టప్రకారమే చర్యలు ఉంటాయన్నారు. ఇప్పుడే కూల్చివేతలు వంటి చర్యలు ఉండవన్న అడ్వొకేట్‌ ‌జనరల్‌ ‌కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు .. ప్రాథమిక విచారణకైనా నోటీసులు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు ఇవ్వాలని కమిటీకి ఆదేశమిచ్చింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు కమిటీ విచారణకు సహకరించాలని సూచించింది. వారి వివరణ తీసుకున్నాకే నివేదక ఇవ్వాలని చెప్పింది. పిటిషనర్ల భూముల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ ‌దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మేడ్చల్‌ ‌జిల్లా శావి•ర్‌పేట మండల పరిధిలోని దేవరయాంజల్‌ ‌భూముల ఆక్రమణలపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శనివారం విచారణ చేపట్టింది. ఈ నెల 3న ప్రభుత్వం జారీ చేసిన జీవో 1014ను సవాల్‌ ‌చేస్తూ పిటిషన్‌ ‌దాఖలైంది. దానిపై విచారణ జరిపిన హైకోర్టు.. కొరోనా సమయంలో ఇంత హడావుడి అవసరమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

పక్కన ఉన్న ఓ వ్యక్తి చనిపోతే శ్మశానానికి తీసుకెళ్లేందుకు చాలా సమయం పట్టిందని గుర్తుచేసింది. ఇటువంటి క్లిష్ట సమయంలో నలుగురు అధికారులతో కమిటీని వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా జీవోలు ఇస్తారా అని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మిగిలిన ఆలయాల పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.అయితే హైకోర్టు ప్రశ్నలకు ఏజీ స్పందిస్తూ.. కమిటీ కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే చేస్తుందని తెలిపారు. ఎవరినీ ఖాళీ చేయించటం, ఆక్రమించటం లేదని ఏజీ పేర్కొన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. చట్టప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తోంని హైకోర్టుకు ఏజి వివరించారు. అక్రమాలకు పాల్పడిన వారికి నోటీసులు ఇవ్వొచ్చని చెప్పినప్పటికీ ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇక దేవరయంజాల్‌ ‌దేవాలయ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్‌ ‌కమిషనర్‌ ‌రఘునందన్‌రావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.

Leave a Reply