Take a fresh look at your lifestyle.

తెలంగాణలో మద్యం విక్రయాలకు నో ?

రాష్ట్రంలోని కొరోనా ప్రభావం అంతగా లేని గ్రీన్‌ ‌జోన్లలో మద్యం విక్రయాలకు అనుమతి లభించనుందన్న అందరి ఊహాగానాలను తలకిందులు చేస్తూ సీఎం కేసీఆర్‌ అనూహ్య నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గ్రీన్‌ ‌జోన్లలో నిబంధనలతో కూడిన మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు రెండు రోజులుగా పొరుగునే ఉన్న ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో మద్యం విక్రయాలు ప్రారంభం కాగా, మందుబాబులు నిద్ర లేవడంతోనే వైన్స్ ‌షాపుల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో ఆయా ప్రభుత్వాలకు మద్యం విక్రయాల వల్ల వచ్చే ఆదాయం మాట అటుంచితే ఆ ప్రాంతాలలో మళ్లీ కొరోనా విజృంభిస్తుందనే భయాందద•ళనలు నెలకొన్నాయి. తాజాగా, రాష్ట్రంలో మే 7 తరువాత లాక్‌డౌన్‌ ‌పొడిగించాలా వద్దా అనే అంశంపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా గ్రీన్‌జోన్లలో మద్య విక్రయాలను ప్రభుత్వం అనుమతించనుందనే వార్తలు గుప్పుమన్నాయి.

 

మంగళవారం ఎక్సైజ్‌ ‌శాఖ రాష్ట్రంలోని మద్యం షాపులలో నిల్వలపై ఆరా తీయడంతో ఈ వార్తలు నిజమేననే ప్రచారం జరుగుతున్నది. అయితే, భవిష్యత్తును చాలా దూరంగా అంచనావేసే సీఎం కేసీఆర్‌ ‌మద్యం విక్రయాలకు మొగ్గు చూపకపోవచ్చని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం విక్రయాల ద్వారా ప్రతీ ఏటా రూ. 25 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. అయితే, ఇందులో దాదాపు 80 శాతానికి పైగా రూ. 18 వేల కోట్లు కేవలం జీహెచ్‌ఎం‌సి, దాని సమీప జిల్లాల నుంచే వస్తోంది. ప్రస్తుతం జీహెచ్‌ఎం‌సిలో అంతర్భాగంగా ఉన్న హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మేడ్చల్‌, ‌వికారాబాద్‌ ‌జిల్లాలకు రెడ్‌ ‌జోన్‌లో ఉన్నాయి. ఈ జిల్లాలను మినహాయిస్తే రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల నుంచి కేవలం రూ. 7 వేల కోట్ల ఆదాయం మాత్రమే ప్రభుత్వానికి సమకూరుతుంది. దీన్ని బట్టిచూస్తే సీఎం కేసీఆర్‌ ‌కేవలం రూ. 7 వేల కోట్ల ఆదాయం కోసం రాష్ట్రంలో మద్యం విక్రయాలను అమనుమతించే అవకాశం లేదని అవసరమైతే లాక్‌డౌన్‌ ‌పూర్తిగా ఎత్తివేసిన అనంతరం పొరుగు రాష్ట్రమైన ఏపీ మాదిరిగా 20 శాతం వరకైనా మద్యం రేట్లను పెంచి ఖజానాపై పడ్డ ఆర్థిక భారాన్ని కొంతమేర పూడ్చుకునే ప్రయత్నం చేయవచ్చని ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు.

Leave a Reply