Take a fresh look at your lifestyle.

‘‘ఉరిశిక్ష విధించేముందు కూడా నేరస్థున్ని చివరి కోరిక అడిగే కోర్టులు ప్రభుత్వాలు
ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని మాత్రం ఏది అడగకుండానే స్థానిక జిల్లా నుండి తరలించి తెచ్చుకున్న తెలంగాణలో తీరని శోకం మిగిల్చారు.’’

317 ఉసురు ఊరికే పోదు!
ఇంతకాలం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ‘ఫ్రెండ్లీ’ ప్రభుత్వమని డేగలా చిలుక పలుకులు నమ్మబలికి, శరవేఘంగా 317 జి.ఓ అమలు పేరుతో వారికి తీరని అన్యాయం చేస్తూ తడిగుడ్డతో గొంతుకోసే కార్యక్రమానికి తెరలేపడమేకాక రాష్ట్రపతి ఉత్తర్వులకు వక్రభాష్యం చెబుతున్నది. స్థానికేతురులంతా తెలంగాణ ఉద్యోగాలను కొల్లగొడుతుంటే నిజాం పిచాము కూడా కరిగి ‘ముల్కీ’ నిబంధనలు రూపొందిస్తే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయులను, ఉద్యోగులను జూనియర్లు, సీనియర్ల పేరుతో విభజిస్తూ, స్థానికతకు దూరంఅవుతున్న వాళ్లు అలవికాని బాధలో దు:ఖిస్తుంటే పైచాచిక ఆనందం పొందుతూ ఆ నిజాం పిచానికున్న దయకూడాలేని నిర్ధయురాలిగా మారడం దురదృష్టకరం.

రాష్ట్రపతి ఉత్వర్వుల నేపథ్యం :
1956లో హైదరాబాద్‌, ఆం‌ధ్ర రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు చేసిన అనంతరం నిజాం రాజులు తీసుకొచ్చిన ముల్కీ నిబంధనలు ముఖ్యంగా పెద్దమనుష్యుల ఒప్పందం యధేచ్చగా ఉల్లంఘించబడడంతో హైకొర్టు అవి చెల్లవని తీర్పు చెప్పడంతో 1969లో జై తెలంగాణ ఉద్యమం రావడం సుప్రీంకోర్టు చెల్లుతాయని తీర్పుచెప్పడంతో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చిన నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణల మధ్య వైషమ్యాలను చల్లార్చడం కోసం మధ్యేమార్గంగా ఆరుసూత్రాల పథకం తీసుకువచ్చి దాని అమలుకోసం 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 371 (డి) ఆర్టికల్‌ను రాజ్యాంగంలో పొందుపరిచి, రక్షణ కోసం 1975లో విడుదల చేయబడిన రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదయ చేయబడ్డాయి. అవి కూడా ఉల్లంఘనకు వివక్ష గురికావడంతో మలి దశ తెలంగాణ ఉద్యమం వచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. రాష్ట్ర ఏర్పాటు క్రమంలోనే ఒకటి అర సంఘాలు 371 (డి) ఆర్టికల్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేయగా, అధ్యనలేమి ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు దాని కొనసాగింపుకు వంతపాడి పరిస్థితిని ఇక్కడిదాకా తీసుకువచ్చాయి. పరిపాలన సౌలభ్యం పేరుతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూంటే రాబోయే ప్రమాదాన్ని పసిగట్టే పరిజ్ఞానంలేని సంఘాలు ఆహా, ఓహో అంటూ ప్రభుత్వాన్ని వేనోళ్ళ పొగిడి తాము తవ్వుకున్న గొయ్యిలో తామేపడ్డాయి.

మొద్దు నిద్రలో సంఘాలు :
ఆ రాష్ట్రపతి ఉత్తర్వులకు జి.ఎస్‌.ఇ (820) ఇ, ‌తేది:29.08.2018 ఉత్తర్వు ద్వారా సవరణ చేస్తున్నప్పుడు కావచ్చు, ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య.124, తేది:30.08.2018 ద్వారా మొదట 31 జిల్లాలను 7 జోన్లుగా, 2 మల్టీ జోన్లుగా ఏర్పరిచినప్పుడు కావచ్చు భవిష్యత్‌లో ఉద్యోగులకు రాబోయే ప్రమాదమేంటని కొద్దిగా బుద్దిని ఉపయోగించి ఆలోచించలేదు. 124లో 36 నెలలోగా లోకల్‌ ‌క్యాడరైజేషన్‌ ‌చేస్తామని చెప్పినప్పుడు కావచ్చు, జి.ఓ.నెం.128, తేది:30.06.2021ల ద్వారా 33 జిల్లాలకు అనుమతిని కూడా పొంది అన్ని ప్రభుత్వ శాఖల్లోని పోస్టులను వివిధ ఉత్తర్వుల ద్వారా లోకల్‌ ‌క్యాడరైజేషన్‌ ‌చేసినప్పుడు కావచ్చు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్ని మొద్దునిద్రపోయాయి. 124 ఉత్తర్వు అమలుకోసం ఈ మొత్తం ప్రక్రియను చేబట్టే క్రమంలో ఇప్పటి వరకు ఉద్యోగాలలో ఉన్నవారు కొంత మంది ప్రమాదం పసిగట్టి ఆందోళన వెలిబుచ్చగా, పాత ఉద్యోగుల లోకల్‌ ‌క్యాడర్‌ ‌ర్యాటిఫై చేసి రీటేయిన్‌ ‌చేస్తామని, కొత్త ఉద్యోగాల నియామకాలకు కొత్త జిల్లాల వారీగా నోటిఫికేషన్‌ ఇచ్చి ఈ ఉత్తర్వులను వర్తింపచేసి నియామకాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం చెబితే దానికి పై సంఘాలే వింతగా వంతపాడాయి. కాని చెప్పినదానికి చేతలకు సంబంధంలేకుండా మనోవేగానికి మించిన వేగంతో ఉద్యోగుల, ఉపాధ్యాయుల విభజన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడానికి 317 ఉత్వర్వును విడుదల చేసి డిసెంబర్‌ ‌చివరి వరకు ప్రక్రియను మొత్తం పూర్తిచేయాలని ఆదేశాలను కూడా జారీ చేసిన తర్వాత అలజడి ప్రారంభమై తమ బలి వంతు వస్తేకాని పరిస్థితి అర్థంకాలేదు. సంఘాలు పాత ఉద్యోగులకు పద్ధతి పెట్టండి అనే డిమాండ్‌పై ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వం మెడలు వంచితే ఇంత నష్టం జరిగేది కాదు.

1975 మాదిరిగా చేసిన బాగుండేది :
1975లో లోకల్‌ ‌క్యాడరైజేషన్‌ ‌చేసిన తర్వాత ఉద్యోగులను, ఉపాధ్యాయులను అప్పటి ఆంధ్ర వలస ప్రభుత్వం స్థానికత ఆధారంగా నాడు వారిని ర్యాటిఫై మాత్రమే చేసి తిరిగి వారు పనిచేస్తూన్న స్థానాలలోనే రిటేయిన్‌ ‌చేసారు. ఎవ్వరిని కదల్చే ప్రయత్నం చేయలేదు. ఒకటి, అర విజ్ఞప్తులను స్వీకరించి స్థాన చలనం కల్పించారు. అదే ఆంధ్ర వలస ప్రభుత్వం 610 జి.ఓ అమలులో భాగంగా 2006లో స్థానికత ద్వారానే ర్యాటిఫై చేసి రిటేయిన్‌ ‌చేయడమేకాక ఏదైనా జిల్లాలో ఎక్కువగా నాన్‌లోకల్స్ ఉం‌టే వారిని వారి స్వంత జిల్లాలకు తరలించారు. హైదరాబాద్‌ ‌నుండి రంగారెడ్డి జిల్లా విడిపోయినప్పుడు ఎక్కడివారిని అక్కడే రిటేయిన్‌ ‌చేసారు. ఇప్పుడు కూడా 1975లో మాదిరిగానే ఉద్యోగులను, ఉపాధ్యాయులను వారి స్థానికత ఆధారంగా ఆయా జిల్లా పోస్టుల్లో, జోనల్‌ ‌పోస్టుల్లో, మల్టీ జోన్‌ ‌పోస్టుల్లో ర్యాటిఫై చేసి వారిని యధాస్థానాల్లోనే రిటేయిన్‌ ‌చేస్తే సరిపోయేది. జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాలోనైన తక్కువగా పోస్టులు ఉంటే, ఇతర జిల్లాల్లోని మిగులు ఖాళీలను ఆ జిల్లాలకు తరలించడం ద్వారా కావచ్చు లేదా సూపర్‌ ‌న్యూమరీ పోస్టులు సృష్టించడం ద్వారా కావచ్చు వాటిని కొత్త రిక్రూట్‌మెంట్‌ ‌ద్వారా నింపితే సరిపోతుంది. ఎవరైన ఇతర జిల్లాలకు వెళ్లాలనుకునే వారి నుండి ఆప్షన్స్ ‌స్వీకరించి 1:1 పద్ధతిలో పంపిస్తే సరిపోయేది.

మొద్దు నిద్ర ఎందుకు వదిలింది :
హుజురాబాద్‌ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 124 జి.ఓ విడుదలైన 3 సంవత్సరాల మొద్దునిద్ర తర్వాత ప్రభుత్వం తను ఇచ్చిన మాటను తప్పి సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులను కూడా పై జి.ఓ అమలు కోసం విడుదలైన 317 ఉత్తర్వులో సీనియారిటీ ప్రాతిపదికన జూనియర్లను తరలిస్తామనడంతో వారిలో అలజడి, ఆందోళన చెలరేగింది. ఇది కేవలం హుజురాబాద్‌ ఓటమికి కక్షసాధింపే! స్థానికత ఆధారంగా కాకుండా సీనియారిటీ ఆధారంగా వారిని వారి పూర్వపు స్థానిక జిల్లాతో పాటుగా అందులోని మండలాలతో కొత్తగా ఏర్పడ్డ జిల్లాకు కావచ్చు ఆ మండలాలతో పాటు ఇతర జిల్లాలోని మండలాలతో ఏర్పడ్డ కొత్త జిల్లాకు కావచ్చు సీనియారిటీ ప్రాతిపదిన వారిచ్చిన అప్షన్‌ ‌ప్రకారంగా అలాట్‌ ‌చేయాలని ప్రభుత్వం చూస్తున్నది. ఈ విధంగా చేయడం వలన జూనియర్లకు భారీ నష్టం జరుగబోతున్నది. తాము పుట్టి పెరిగిన జిల్లా కాకుండా వారు అలాట్‌ ‌చేయబడే జిల్లాలో వారు స్థానికులుగా మారబోవడం జీర్ణించుకోలేకపోతున్నారు.

రాష్ట్రప్రభుత్వం తలుచుకుంటే:
కాని రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే 124 ప్రభుత్వ ఉత్తర్వులోని పేరా 4 (Allotment of Persons)) లోని 2వ అంశంలో బి • సి.,)లో పేర్కొనబడిన సీనియారిటీ ఆధారంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ చేపట్టాలనే దానిని సవరించి, సీనియారిటీ స్థానంలో ఉత్తర్వులో పేర్కొన్న విధంగా 1 నుండి 7వ తరగతి వరకు జరిగిన విద్యాభ్యాసం ఆధారంగా ప్రకారంగా స్థానికతను నిర్థారించాలని ఉత్వర్వులను మాడిఫై చేసిన అనంతరమే వారి వారి స్థానిక జిల్లాలకు ఉపాధ్యాయులను, ఉద్యోగులను విభజన చేయాలని ఏకతాటిపైకి వచ్చి సంఘాలు డిమాండ్‌ ‌చేస్తే బాగుండేది. 2018లో జి.ఓ విడుదలైపనప్పుడు దీనిని పసిగట్టగపోగా, నేటికి సవరించమని డిమాండ్‌ ‌చేయలేదంటే అవి అజ్ఞానంతో ఉన్నాయో, ప్రభుత్వ తొత్తులుగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అదే 124 జి.ఓలోని పేరా 4(7) ప్రకారంగా పేరా 4 లోని ‘‘1, 2 ఎ నుండి ఇ వరకు మరియు 3 నుండి 6 వరకు ఉన్న అంశాలతో సంబంధంలేకుండా రాష్ట్రప్రభుత్వం 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం ఉన్న స్థానికక్యాడర్‌లోనే కొనసాగించవచ్చు’’ అని ఉన్నది కాబట్టి రాష్ట్రప్రభుత్వం కొంత ఉదారంగా దూరదృష్టితో ఆలోచించి ఆ దిశగా దృష్టిసారించినా బాగుండేది. సంఘాలు ఆ మేరకు ఒత్తిడి తెచ్చినా ఇంత భయ, బ్రాంతులకు లోనయ్యేవారుకాదు. జూనియర్లు, సీనియర్ల మధ్య ఈ విభజన వచ్చేది కాదు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్‌ ‌నుండి సంబంధిత శాఖాధికారులే జిల్లాలను, పనిచేయాల్సిన స్థలాలను, పాఠశాలలను కెటాయింపు చేస్తూ గిలెటిన్‌ ‌చేయడం అన్ని సహజ న్యాయ సూత్రాలను బుల్డోజ్‌ ‌చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తంలో సీనియారిటీ ప్రకారంగా డి.ఎస్‌.‌సి ర్యాంకుల్లో ముందుండే నాన్‌లోకల్స్ ‌స్థానికులు అయి పట్టణప్రాంతాలకు వస్తుండగా, లోకల్‌ ‌జూనియర్స్ ‌తాము పుట్టిన జిల్లాకు శాశ్వతంగా స్థానికేతరులు కావడమేకాక తమ కుటుంబాన్ని, బంధుమిత్రులను, సంబంధబాందవ్యాలను వదులుకొని అడవులపాలుకావడం ఎంత ఘోరం! ఉరిశిక్ష విధించేముందు కూడా నేరస్థున్ని చివరి కోరిక అడిగే కోర్టులు ప్రభుత్వాలు ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని మాత్రం ఏది అడగకుండానే స్థానిక జిల్లా నుండి తరలించి తెచ్చుకున్న తెలంగాణలో తీరని శోకం మిగిల్చారు.

విద్యాశాఖలో వింత పరిస్థితి:
విద్యాశాఖలోనైతే మరివింత. తరలింపుకు నిబంధనలు విడుదల కాలేదు. 14కు పై బడిన డి.ఎస్‌.‌సిలకు చెందిన ఉపాధ్యాయుల సినియారిటీ లిస్టులు అనేక అవకతవకలతో రాత్రికే రాత్రి తయారయ్యాయి. ఒక్క అప్పీల్‌ను కూడా పరిశీలించి సవరించలేని దుస్థితి వల్ల సీనియర్లు జూనియర్లు అయ్యారు. చివరకు టైపోగ్రాఫికల్‌ ‌తప్పులకు కూడా సవరణలేక ఉపాధ్యాయులే బలయ్యారు. రూల్‌ ఆఫ్‌ ‌రి•ర్వేషన్‌లేదు, క్యాడర్‌ ‌స్ట్రెంత్‌, ‌రోస్టర్‌ ‌విధానం, వర్కింగ్‌ ‌పోస్టులు, క్లీయర్‌ ‌వెకెన్సీలు ఎన్ని ఉన్నాయో స్పష్టతలేదు. జిల్లాలోని వర్కింగ్‌ + ‌ఖాళీగా మొత్తం పోస్టుల్లో ఏ దామాష పద్దతి ప్రకారంగా జి.ఓ.317 ద్వారా తరలిస్తున్న ఉపాధ్యాయులను నింపబోతున్నారో ఒక అధికారిక ఉత్తర్వులేదు. అన్ని జిల్లాల్లో వెకెన్సీలను దాచిపెట్టారు. సంవత్సరాల తరబడి పోరాటాలు చేసి ఆంధ్రవలస పాలనలో సాధించుకున్న కౌన్సిలింగ్‌ ‌విధానానికి తెలంగాణ ప్రభుత్వం శాశ్వతంగా స్వస్తిపలికే కుట్రకు తెరలేపిన అడిగేనాధుడు లేకపోగా ఓ పరమదుర్మార్గ పైరవీ సంఘం సిగ్గు ఎగ్గులేకుండా బరితెగించి సమర్థిస్తున్నది. పైరవీలు యదేచ్ఛగా రాజ్యమేలి కొంత మంది సీనియర్లుకు అలాట్‌ ‌కావల్సిన స్థలాలను జూనియర్లు కొట్టుకుపోయిన అడిగే దిక్కుదిశలేదు.

వేరు వేరు జిల్లాల్లో పనిచేస్తూన్న భార్యభర్తలిద్దరిని ఒకే దగ్గరకు చేరుస్తామని, అంతర్‌జిల్లా, సాధారణ బదిలీల, ప్రమోషన్ల కౌన్సిలింగ్‌ ‌లాంటి హామిలు ఏండ్లు గడుస్తున్న ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంది. ఈ అలకేషకు ముందే 258 ఉత్తర్వు ద్వారా లోకల్‌క్యాడరైజేషన్‌లో భాగంగా జిల్లా స్థాయి పోస్టుగా పేర్కొనబడిన స్కూల్‌ అసిస్టెంట్‌ ‌పోస్టునైనా జోనల్‌ ‌పోస్టుగా మారిస్తే, ఎదో ఒక రోజు తాము స్వంత జిల్లాలకు వస్తామనే ఆశ ఉండేది. హెడ్‌ ‌నర్స్‌ను, హెడ్‌కానిస్టేబుల్‌ను జోనల్‌ ‌పోస్టుగా చూపించిన అధికారులు స్కూల్‌ అసిస్టెంట్‌ ‌పట్ల ఎందుకు కనికరం చూపించలేదో అర్థంకాదు. వితంతువులకు, ఒంటిరి మహిళలకు, తీవ్ర వ్యాధిగ్రస్థులకు రక్షణలేదు. కనీసం సర్వీస్‌ ‌సీనియార్టీని, వయస్సును కూడా పరిగణలోకి తీసుకోలేదు. దు:ఖాన్ని చెప్పుకునే అవకాశంలేని దుస్థితి, నియంతృత్వం అనాగరిక పాలన తెలంగాణలో రాజ్యమేలుతున్నది. ఇన్ని సమస్యలమధ్య కొట్టుమిట్టాడుతున్న విద్యాశాఖలో ఆగమేఘాలమీద ఉపాధ్యాయులను అందునా విద్యాసంవత్సరం మధ్యలో తరలిస్తే ఎంత నష్టం అనే ఆలోచన కూడాలేదు. అడ్మీషన్లు ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా పెరిగి ప్రశాంతంగా నడుస్తున్న సందర్భంలో నడిచే కాళ్ళల్లో కట్టేబెట్టినట్లుగా 317 జి.ఓ మారింది.

నిరుద్యోగులకు అన్యాయం :
371 వల్ల పట్టణ ప్రాంతానికి అలాట్‌ ‌చేయబడిన సీనియర్లు 80% మంది స్వల్పకాలంలోనే రిటైర్‌ అయి ఆ మైదాన ప్రాంత జిల్లాల్లో కొత్త ఉద్యోగాల భర్తీ జరుగుతుంది, కాని జూనియర్లు అలాట్‌ అయిన జిల్లాల్లో మరో 25 ఏళ్ళ వరకు ఎటువంటి రిక్రూట్‌మెంట్‌ ‌లేక ఎజెన్సీలోని ఎసి.సి, ఎస్‌.‌టి నిరుద్యోగులు పెద్ద మొత్తంలో నష్టపోతారనేది ఒక చేధువాస్తవాన్ని అటు సంఘాలు ఇటు ప్రభుత్వం పట్టించుకోకుండానే పనికానిచ్చేస్తున్నారు.

ఈ నజరానాకు భవిష్యత్తు ఫలితం :
స్థానికతను కాదని సీనియారిటీ పేరుతో కొత్త జిల్లాలకు విభజన పేరుతో అలకేషన్‌ ‌చేయడం పూర్తిగా అసమంజసమైన విధానం. లోకల్‌ ‌క్యాడరైజేషన్‌కు ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఐ.ఏ.ఎస్‌ అధికారులు వక్రభాష్యం చెబుతూ దాని ముసుగులో బదిలీలకు తెరలేపి, రేషనలైజేషన్‌ ‌చేస్తూ వేల పోస్టులను రద్దు చేయడం విస్తుగొలుపుతున్నది. పి.ఆర్‌.‌సిని బాగా సాగదీసి మూడు సంవత్సరాల అనంతరం ఇచ్చి ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఇప్పటికే చెడ్డపేరును మూటగట్టుకుని దూరమైంది. మా ఉద్యోగాలు మాకే కావాలంటే తెలంగాణ ఒక రాష్ట్రం కావాలని సకల జనుల సమ్మె చేసిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న ఊహించని మరో నజరానా ఇది! ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఉద్యోగుల స్థానికతను నిర్థారించి, ర్యాటిఫై చేసి, 1975 మాదరిగానే వారు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రదేశాల్లోనే రిటేయిన్‌ ‌చేయడం మంచిది. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల్లో ఈ ప్రభుత్వ విధానాలు అసంతృప్తిని నింపడం వల్లనే ప్రజలు హుజురాబాద్‌ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పిన తన నియంతృత్వ పోకడలకు ప్రభుత్వం మార్చుకోకుండా అదే పద్దతిలో ముందుకుపోవడం దురదృష్టకరం. స్థానికులను స్థానికేతరులు చేస్తూన్న ఈ ఉసురు ఊరికేపోదు! ఈ నియంతృత్వ పోకడలపై ఏదో ఒక రోజు నిశబ్ధ విప్లవం వచ్చి ఈ శోకానికి కారణమైన పాలకులు వారికి వంతపాడినవారు కాలగర్భంలో కలువడం ఖాయం! ఇది ప్రపంచ చరిత్ర ముఖ్యంగా తెలంగాణ చరిత్ర చెబుతున్న ఒక చారిత్రక సత్యం!!
– ఎ.శ్రీదేవి, సామాజిక విద్యాఉద్యోగ రంగ విశ్లేషకులు.

Leave a Reply