Take a fresh look at your lifestyle.

తెలంగాణ ప్రభుత్వం జీ ఓ అప్రజాస్వామికం, చట్ట విరుద్దం…!

  • ఉపసంహరించాలి…: ప్రజా అసెంబ్లీ
  • ప్రభుత్వం కోవిడ్ ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించటం పై తన శక్తినంతా ఉపయోగించాలి
    పత్రికా ప్రకటన విడుదల

అనేక ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక హక్కుల కోసం పనిచేసే వేదికలతో ఏర్పడిన “తెలంగాణ ప్రజా అసెంబ్లీ” భాగస్వాములమైన మేము తెలంగాణ ప్రభుత్వం 16 ప్రజాసంఘాలను ఒక ఏడాది పాటు “చట్టవిరుద్ధం”గా ప్రకటించటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. ఈ ప్రకటన ఏకపక్షమైనదే గాక, దేశమంతా తీవ్రమైన కోవిడ్ ఆరోగ్య సంక్షోభంలో విలవిలలాడుతున్నప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడటం తప్ప మరేదీ ముఖ్యం కాకూడని సమయంలో వెలువడటం సమంజసం కాదు. సమాజంలోని అన్ని సెక్షన్ల ప్రజల ప్రజాస్వామిక, మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తూ రాజ్యాంగ విలువలలో విశ్వాసం వున్న సంస్థలుగా మేము ఈ చర్యను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాము. 16 సంఘాలను “చట్టవిరుద్ధంగా” ప్రకటించిన జి.ఓ. ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాము.

మార్చ్ 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ. నెం.73 తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ చట్టం, 1992 కింద 16 ప్రజా సంఘాలను “చట్టవిరుద్ధం”గా పేర్కొంది. ఈ జి.ఓ. అదే తేదీ నుండి అమలులోకి వస్తుంది. ఇవన్నీ నిషేధిత భారత కమ్యూనిస్ట్(మావోయిస్టు) పార్టీ కి ‘అనుబంధ సంస్థలు’ అని ప్రభుత్వం వాదిస్తున్నది. ఈ 16 సంఘాలను “చట్టవిరుద్ధం” గా పేర్కొనటానికి ఈ జి ఓ లో చెప్పిన కారణాలు ఏమిటంటే. అవి “వ్యక్తులను హింసాత్మక చర్యలకు పురికొల్పటం లేదా సహాయపడటం చేస్తున్నాయి”; “ఈ సంఘాల కార్యకర్తలు పట్టణప్రాంతాలలో తిరుగుతూ పట్టణ గెరిల్లా కార్యకలాపాలను అనుసరిస్తున్నారు”; “ ఊపా చట్టం, వ్యవసాయ చట్టాలను, సిఏఏ/ఎన్ ఆర్ సి లను రద్దుచేయాలని నిరసన ప్రదర్శనలు చేయటం; “వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబా, రానావిల్సన్ లను విడుదల చేయాలని డిమాండ్ చేయటం; “అనేక సంస్థలతో చేతులు కలిపి వాటి సభ్యులను తమ సంస్థలలో చేరేటట్లు ఆకట్టుకోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు ఇవ్వటం, అనేక సమస్యలను లేవనెత్తి సమావేశాలు, ర్యాలీలు నిర్వహించటం” మొదలైనవి.

సామజిక న్యాయం కోసం సంఘటితపడే పౌరుల స్వేచ్ఛ పట్ల బలంగా విశ్వాసం కలిగిన ప్రజాస్వామిక సంఘాలుగా మేము ఈ క్రింది వి ప్రకటిస్తున్నాము:
భారత రాజ్యాంగం ప్రకారం సకారణమైన పరిమితులలో సంబంధం కలిగి వుండే స్వేచ్ఛ ప్రతి ఒక్క సంస్థకు వుంది. అందుకే వ్యక్తులు చట్టాన్ని ఉల్లంఘించారనే నిర్దిష్ట ఆరోపణ వ్యక్తులపై లేకుండా మొత్తం సంస్థనే “చట్టవిరుద్ధం” అని ప్రకటించటం అంగీకారం కాదు, అప్రజాస్వామికం. ఈ 16 సంస్థలు చాలా సంవత్సరాలుగా పౌర హక్కులు, ప్రజాస్వామిక -మానవ హక్కులు, ఆదివాసీ హక్కులు, రైతుల హక్కులు, కార్మికుల హక్కులు, మహిళా హక్కులు, సాంస్కృతిక అవగాహన మొదలైన అంశాలపై పనిచేస్తూ వస్తున్నాయి. వాటిలో కొన్ని విద్యార్థులు, రచయితల సంఘాలు, రాజకీయ ఖైదీల విడుదలకి పనిచేసే అమరుల బంధు మిత్రుల సంఘాలు. ప్రజల మధ్య పనిచేస్తున్న సంఘాలను ఏకపక్షంగా “చట్టవిరుద్ధం”అని ఈ జి ఓ లో ప్రకటించటానికి సరైన స్పష్టత కానీ సమర్ధనీయమైన కారణం కానీ లేదు.

ప్రజల బాగోగుల కోసం పనిచేసే సంఘాలు ప్రజల హక్కుల పట్ల ప్రభుత్వ బాధ్యతల పట్ల అవగాహనను పెంచటం ప్రభుత్వానికి ఇష్టం లేదని జి ఓ లో పేర్కొన్న కారణాలు స్పష్టం చేస్తున్నాయి. వరవరరావు లేదా ప్రొఫెసర్ సాయిబాబా లేదా రానావిల్సన్ వంటి రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేయటం, ఊపా వంటి రాక్షస చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియచేయటం నేర మెట్లా అవుతుంది? దేశం మొత్తం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు, తెలంగాణ ప్రభుత్వం సైతం వాటిని మొదట్లో వ్యతిరేకించినప్పుడు వాటికి వ్యతిరేకంగా నిరసన తెలియచేయటం నేరమెట్లా అవుతుంది? సి.ఏ.ఏ.-ఎన్.ఆర్.సి./ఎన్.పి.ఆర్. లు రాజ్యాంగ విరుద్ధం అని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానమే చేసినప్పుడు వాటిని వ్యతిరేకించటం ఈ సంఘాలను “చట్టవిరుద్ధం”గా ప్రకటించటానికి కారణం ఎట్లా అవుతుంది.

2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుండి ప్రజలు సంఘటితపడటం, అసమ్మతి తెలియజేయటం పై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. ధర్నా చౌక్ ను మూసివేయటం దగ్గర నుండి ఇటీవల రెండు రాష్ట్రాలలోను ఉద్యమకారుల ఇళ్లపై ఎన్.ఐ.ఏ. దాడుల వరకు గత 7 ఏళ్లలో రాజ్యం యొక్క వైఫల్యాలను, అత్యాచారాలను ప్రశ్నించే ప్రస్వామిక అవకాశాలు పూర్తిగా కుంచించుకుపోతున్నాయి. ప్రజాస్వామిక చట్రంలో బహిరంగంగా పని చేయాలనుకునే సంఘాలకు అవకాశాలు లేకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రతికూల ఫలితాలను

మిగిలిన దేశమంతా ఎదుర్కుంటున్నట్లే తెలంగాణ కూడా తీవ్ర కోవిడ్ ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు తన వనరులను ఇతర అంశాల కు మళ్లించటం సమంజసం కాదు. మన ప్రభుత్వం తన శక్తిని వనరులను, దృష్టినంతటినీ అందరికీ టీకాలు అందించటం, కోవిడ్ బారిన పడిన వారికి హాస్పిటళ్లలో పడకలు అందుబాటులో ఉంచటం, అవసరమైన వైద్య సదుపాయాలు, రక్తం, ప్లాజ్మా, ఆక్సిజెన్ సరఫరా అందించటం మొదలైనవాటి పైన కేంద్రీకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ తీవ్రతను గుర్తించి, ఈ అసాధారణ సమయంలో ఎటువంటి అప్రజాస్వామిక, దురుద్దేశపూరిత చర్యలకు పాల్పడదని ఆశిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించి 16 సంఘాలను “చట్టవిరుద్ధంగా”ప్రకటించిన జి.ఓ. 73 ను వెంటనే ఉపసంహరించాలని కోరుతున్నాము.

సం./-
జీవన్ కుమార్, మానవ హక్కుల వేదిక
మీరా సంఘమిత్ర, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక
కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక
పి. శంకర్, దళిత బహుజన ఫ్రంట్
అశాలత, మహిళా రైతుల హక్కుల వేదిక
అంబటి నాగయ్య, తెలంగాణా విద్యా వంతుల వేదిక
కె. సజయ, కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్
ఆర్. వెంకట రెడ్డి, సామాజిక కార్యకర్త
ఎం. రాఘవా చారి, పాలమూరు అధ్యయన వేదిక

Leave a Reply