- 80093 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- 11,103 ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ
- పోలీసు శాఖ మినహా ఉద్యోగ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి పెంపు
- 95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించాం
- అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన
ప్రజాతంత్ర , హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి తెరలేపింది. సీఎం కేసీఆర్ వనపర్తి సభలో ప్రకటించిన విధంగానే బుధవారం అసెంబ్లీలో కొలువుల జాతరపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో 91142 ఉద్యోగాలు ఖాలీగా ఉన్నాయనీ, వీటిని యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటించిన విధంగానే బుధవారం సాయంత్రానికి 80039 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. మిగతా 11103 ఉద్యోగాలను ప్రస్తుతం కాంట్రాక్టు పద్దతిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించడం ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేస్తూ 95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించినట్లు చెప్పారు. కొత్తగా చేపట్టనున్న నియామక పక్రియ ద్వారా అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని వెల్లడించారు. నియామకాల్లో 95 శాతం స్థానిక కోటా సాధించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని సీఎం పేర్కొన్నారు.
మరోవైపు, పోలీసు శాఖ మినహా ఉద్యోగ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.ఓసీ అభ్యర్థులకు గరిష్టంగా 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లుగా నిర్ణయించినట్లు చెప్పారు. దివ్యాంగ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి 54 ఏళ్లకు పెంచినట్లు వివరించారు. ఎక్స్‌సర్వీస్‌మెన్లకు 47 ఏళ్లకు పెంచినట్లు సీఎం కేసీఆర్ వివరించారు. తమని ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వమనీ, దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే రాష్ట్రంలో ఉద్యోగ ఖాలీల భర్తీ పక్రియ ఆలస్యమైందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సాగిందనీ, గోదావరీ జలాలు సాధించుకున్నామనీ, తెలంగాణ కోసం పోరాటాలు చేసిన విద్యార్థుల కోసం రెండు రోజులు ఆలస్యమైనా పని మంచిగా జరగాలనే ఉద్దేశంతో పక్కాగా ఏయే ప్రభుత్వ శాఖలో ఎన్ని ఖాలీలు ఉన్నాయనే వివరాలు సేకరించి వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం పూనుకున్నదని ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వివరించారు.
జిల్లాల వారీగా ఖాలీలు..అత్యధికంగా హైదరాబాద్‌లో…అతి తక్కువగా వనపర్తిలో..
హైదరాబాద్ – 5,268, నిజామాబాద్- 1,976, మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769, రంగారెడ్డి- 1,561,కరీంనగర్- 1,465, నల్లగొండ- 1,398, కామారెడ్డి- 1,340, ఖమ్మం- 1,340, భదాద్రి కొత్తగూడెం- 1,316, నాగర్‌కర్నూల్- 1,257, సంగారెడ్డి- 1,243, మహబూబ్‌నగర్- 1,213, ఆదిలాబాద్- 1,193, సిద్దిపేట- 1,178, మహబూబాబాద్- 1,172, హనుమకొండ- 1,157, మెదక్- 1,149, జగిత్యాల- 1,063, మంచిర్యాల- 1,025, యాదాద్రి భువనగిరి- 1,010, జయశంకర్ భూపాలపల్లి- 918, నిర్మల్- 876, వరంగల్- 842, కుమ్రం భీం ఆసీఫాబాద్- 825, పెద్దపల్లి- 800, జనగాం- 760, నారాయణపేట్- 741, వికారాబాద్- 738, సూర్యాపేట- 719,ములుగు- 696, జోగులాంబ గద్వాల- 662, రాజన్న సిరిసిల్లా- 601, వనపర్తి- 556.