Take a fresh look at your lifestyle.

పీవీకి భారత రత్న ఇంకెప్పుడు..?

మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయినా కేంద్రం స్పందించలేదు. కనీసం వొచ్చే జనవరిలో ప్రకటించే అవార్డుల సమయంలోనైనా పీవీకి భారత రత్న పురస్కారాన్ని ప్రకటిస్తే తెలుగువారు ఆనందిస్తారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటిన పీవీ నరసింహారావు భాషలకూ, ప్రాంతాలకూ అతీతంగా దేశానికి సేవ చేశారు. ఆయన సేవలను మననం చేసుకోవడం, నివాళులర్పించడం తప్ప ఏటా ఆయనకు తెలుగువారు చేస్తున్నదేమీ లేదు. జీవితం అంతా కాంగ్రెస్‌ ‌పార్టీకే ఆయన అంకితం చేశారు. ఆ పార్టీ వారు కూడా గట్టిగా పీవీని స్మరించేందుకు భయపడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కన్నుమూసి పదహారు సంవత్సరాలు అయ్యాయి. ఇంతవరకూ ఆయనకు భారత రత్నను ప్రకటించలేదు. హైదరాబాద్‌ ‌లోని సెంట్రల్‌ ‌యూనివర్శిటీకి ఆయన పేరు పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కోరినా కేంద్రం స్పందించలేదు. కేంద్ర మానవ వనరుల శాఖను ఆయన హయాంలో ఏర్పాటు చేస్తే దానిని మళ్ళీ విద్యా శాఖగా మార్చిన ఘనత మోడీ ప్రభుత్వానిది.

నెహ్రూ కాలం నాటి జ్ఞాపకాలు, కాంగ్రెస్‌ ‌పాలన నాటి గుర్తులు చెరిపేయాలని కంకణం కట్టుకున్న మోడీ పీవీ విషయంలో కాస్త ఉదారంగా ఉంటారేమోనని జనం అనుకున్నారు. మోడీకి నెహ్రూ కుటుంబంపై కోపం ఉన్న మాట నిజమే. పీవీ నెహ్రూ కుటుంబం వల్ల పదవులు పొందినా, అంతకుమించిన అవమానాలు పొందిన సంగతిని మోడీ మరచిపోవడం దురదృష్టకరం. దేశ రాజధానిలో మాజీ ప్రధాని సమాధి లేకపోవడం అవమానకరం. ఆరు నెలలు ప్రధానిగా వ్యవహరించిన చరణ్‌ ‌సింగ్‌కు కూడా సమాధి ఉంది. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన పీవీకి దేశ రాజధానిలో సరైన స్మారకం లేదు. హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరిపించిన తీరు ఇప్పటికీ తలచుకుంటే తెలుగువారందరికీ బాధ కలుగుతుంది. ఇందుకు బాధ్యులు ఎవరైనా అది క్షమార్హం కాదు. పీవీ పట్ల అగౌరవంగా వ్యవహరించడం వల్లనే ఈరోజు కాంగ్రెస్‌ ‌పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. పీవీ అంకిత భావంతో పార్టీ కోసం తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా యావత్‌ ‌శక్తినీ ధారపోశారు. ఆయన వల్ల దేశ ప్రతిష్ఠ పెరిగింది. విదేశాంగ విధానంలో, విద్యావిధానంలో ఎన్నో మార్పులు తెచ్చారు. పీవీ తీసుకు వొచ్చిన సంస్కరణల కారణంగానే భారత్‌ ‌కు ఈనాటికీ ప్రపంచ దేశాల్లో గుర్తింపు గౌరవం లభిస్తోంది. మోడీ ప్రభుత్వం చేసేది తక్కువ, ప్రచారం ఎక్కువ అనే ధోరణిలో వ్యవహరిస్తోంది.

మోడీ పథకాలన్నీ ప్రచారార్భాటాలే. ఫలితం తక్కువ, ప్రచారం ఎక్కువ. పీవీ ప్రచారం కోసం ఏనాడూ వెంపర్లాడలేదు. ఆయనకు పార్టీలో గ్రూపులు, ముఠాలు ఉండేవి కావు. ఎవరి ద్వారా మంచి జరుగుతుందని భావించారో వారిని ప్రోత్సహించారు. పీవీ హయాంలో దేశంలో అనేక సామాజిక, ఆర్థిక, విద్యా రంగ మలుపులు చోటు చేసుకున్నాయి. దేశానికి అణు పరీక్షలు జరిపే సత్తాను నిరూపించింది ఆయనే. అయితే ఆయన హయాంలో జరిపించే అవకాశం లేకపోవడంతో తన తదుపరి ప్రధాని వాజ్‌పేయికి ఈ విషయం చెప్పి ఆయన ద్వారా అణు పరీక్షలు జరిపించారు. పార్లమెంటులో తగిన మెజారిటీ లేకపోయినా ఐదేళ్ళూ ప్రభుత్వాన్ని నడిపించిన రాజకీయ దురంధరుడు పీవీ. తెలుగువారు ఆయనకిచ్చిన గౌరవం ఏమీ లేదు. ఆయన శతజయంత్యుత్సవాలను ఆంధప్రదేశ్‌లో నిర్వహించకపోవడం పెద్ద వెలితి. తెలంగాణాలో కూడా పబ్లిసిటీకి ఇస్తున్న ప్రాధాన్యం కార్యక్రమాలను విస్తరింపజేయడానికి ఇవ్వడం లేదు. పీవీకి రాజకీయాల్లో శత్రువులు లేరు. అన్ని పార్టీల్లో ఆయనకు మిత్రులు ఉన్నారు. అయితే, సొంత పార్టీలోనే కొందరు ఆయన ఔన్నత్యాన్ని చూసి గిట్టని వారు ఆయనపై వ్యతిరేక ప్రచారం చేయించారు.

జార్ఖండ్‌ ‌ముక్తి మోర్ఛా ఎంపీల ముడుపుల కేసును వేయించింది కూడా సొంత పార్టీ వారే. ఆయనను రిటైరైన తర్వాత మానసిక క్షోభకు గురి చేసింది కూడా సొంత పార్టీవారే. అందుకు ప్రతిఫలాన్ని ఆ పార్టీ ఇప్పుడు అనుభవిస్తోంది. పదే పదే ఇందిరాగాంధీ పేరు చెప్పుకునే కాంగ్రెస్‌ ‌నాయకులు ఆనాడు ఆమె పీవీకి ఎంత గౌరవం ఇచ్చారో కూడా తెలుసుకోలేకపోవడం దురదృష్టకరం. పీవీని ఇందిర అన్ని విషయాల్లో సంప్రదించేవారు. పార్టీ వ్యవహారాల్లో పీవీని సంప్రదించకుండా ఏ నిర్ణయమూ తీసుకునే వారు కారు. పీవీకి భారత రత్న పురస్కారాన్ని వెంటనే ప్రకటించాలన్నది తెలుగువారి అభిమతమే కాదు..దేశ ప్రజలందరిదీ. రామజన్మ భూమి విషయంలో కూడా ఆయన తప్పేమీ లేకపోయినా, ఆయనపై మతం ముద్ర వేసి అర్జున్‌ ‌సింగ్‌ ‌వంటి ప్రత్యర్ధులు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి చాడీలు చెప్పారు. సోనియాగాంధీకి ఇప్పుడు సరైన సలహాలు ఇచ్చేవారు ఎవరూ లేకపోవడం వల్లనే ఆ పార్టీ చుక్కాని లేని నావలా తయారైంది. ఒక జాతీయపార్టీగా పొందాల్సిన గౌరవం పొందలేకపోతున్నది. సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా కాలం గడుపుతోంది. పీవీని గురించి ప్రధాని మోడీ పలు సందర్భాల్లో మంచి మాటలే చెప్పారు. కానీ, చేతల్లో మాత్రం చొరవ చూపడం లేదు. పీవీ కన్నా జూనియర్‌ ‌ప్రణబ్‌ ‌ముఖర్జీకి భారత రత్న ప్రదానం చేసిన మోడీ ప్రభుత్వం పీవీ విషయంలో మీనమేషాలు లెక్కించడం దురదృష్టకరం.

Leave a Reply