Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కరోనా లేదు: మంత్రి ఈటల రాజేందర్‌

  • ఏ ఒక్కరికి  వైరస్‌ ‌సోకలేదు  –  ఇతర దేశాల నుంచి వొచ్చిన వారికే ఆ వ్యాధి
  • కరోనావ్యాప్తిలో వేగం ఎక్కువ, మరణాలు  తక్కువ
  • ఆరోగ్యసిబ్బందికి అభినందన, మానిటరీ బెనిఫిట్‌
  • రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌
  • కరోనా వార్డును ‘గాంధీ ’నుంచి  తరలించండి :  ఆసుపత్రి సిబ్బంది, స్థానికుల డిమాండ్‌

తెలంగాణాలో ఏ ఒక్క వ్యక్తికీ• కరోనా వైరస్‌ ‌సోకలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్పష్టంచేశారు.దుబాయ్‌ ‌వంటి ఇతర దేశాలలో పర్యటించి వచ్చిన వారికి మాత్రమే ఈ వైరస్‌ ‌లక్షణాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అందుకని ప్రజలను చైతన్యవంతులను చేయాలని,ఈ విషయంలో మీడియా కీలక బాధ్యత పోషించాలని రాష్ట్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. గురువారం కరోనా వైరస్‌ ‌నిరోధించేందుకు ఏర్పాటైన సర్వెలెన్స్ అధికారులతో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.డైరక్టర్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ‌డాక్టర్‌ ‌రమేశ్‌రెడ్డి, డైరక్టర్‌ ఆఫ్‌ ‌పబ్లిక్‌హెల్త్ ‌డాక్టర్‌ శ్రీ‌నివాసరావుతో ఆయన పరిస్థితిని సమీక్షించారు.కరోనాపైన నెగెటివ్‌ ‌ప్రచారమే ఎక్కువగా జరుగుతున్నదని, అరికట్టేందుకు,నివారించేందుకు తీసుకుంటున్న చర్యలను కావాల్సిన ప్రచారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్‌ ‌సోకినప్పటికీ 14రోజుల్లో పూర్తిస్థాయిలో కోలుకునేవిధంగా వైద్యం ఇవ్వవచ్చుననే విషయాన్ని అందరికీ తెలియచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైరస్‌ ‌వ్యాప్తి చెందడంలో వేగం ఉన్నప్పటికీ మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని, అనవసర ఆందోళనలకు, అసత్యప్రచారాలకు అవకాశం ఇవ్వవద్దని ఆరోగ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అసత్యప్రచారాలను ఎక్కడికక్కడ ఖండించాలని, వాస్తవాలను ప్రతీరోజూ చెప్పాలని,నిరంతరం చైతన్యం చేయాలని మంత్రి వైద్యులకు సూచనలు ఇచ్చారు. ఎంత వైద్యవృత్తిలో ఉన్నప్పటికీ, కరోనా వంటి రోగులకు అందరూ వైద్యం చేసేందుకు సిద్ధంగా ఉండరని, కానీ రాష్ట్ర ఆరోగ్యశాఖ డాక్టర్లు,సిబ్బంది మొత్తం వైద్యం చేసేందుకు సిద్ధమయ్యారని అయన అభినందించారు.

సాహసం చేసే అవకాశం అందరికీ లభించదని, జిల్లా నుంచి పారామెడికల్‌ ‌స్టాఫ్‌ ‌యుద్దప్రాతిపదకన సేవ చేసేందుకు సిద్ధమయ్యారని తెలంగాణ నేల పట్ల ఉన్న ప్రేమకు ఇది చిహ్నమని మంత్రి వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.జిల్లాల నుంచి వచ్చిన స్టాఫ్‌లకు, నర్సులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశామని, సిబ్బంది ఇబ్బంది పడవద్దని చెప్పారు.ఇంటి దగ్గరి నుంచి వత్తిడి వచ్చినప్పటికీ మీ కుటుంబసభ్యులకు నచ్చచెప్పి రోగులకు సేవలందించాలని కోరారు. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి తీవ్రత గురించి తెలిసినప్పటికీ, రోగులకు సేవచేసేందుకు ముందుకు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి అదనపు వేతనం ఇవ్వడంతోపాటు, సర్టిఫికేట్‌ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఇళ్లు విశాలంగా ఉన్నట్లయితే అక్కడే ఐసోలేషన్‌గా కరోనా వైరస్‌ ‌లక్షణాలున్న రోగులను పెట్టవచ్చని, ఐసోలేషన్‌ అం‌టే దవాఖానాలోనే ఉండాలనే నిబంధన ఏమీ లేదని స్పష్టం చేశారు.విపత్కర,ఆందోళన కర పరిస్థితుల్లో ధైర్యంగా సేవ చేసేందుకు ముందుకు వచ్చిన స్టాప్‌కు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. శాస్త్రీయ పద్ధతిలో రోగులకు చికిత్స అందించాలని, నిర్భయంగా, తగిన జాగ్రత్తలను తీసుకొని మందులు అందించాలని, చికిత్స వేగంగా చేస్తే వేగంగా వ్యాధి నివారణ అవుతుందని, ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో తాను నిరంతరం పర్యటిస్తానని చెప్పారు.

ఐసోలేషన్‌ ‌వార్డును గాంధీ నుంచి తరలించండి
గాంధీ సూపరింటెండెంట్‌కు పద్మారావునగర్‌ ‌కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ‌లేఖగాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితుల చికిత్స కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ ‌వార్డును నగర శివార్లకు తరలించాలని పద్మారావునగర్‌ ‌కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ‌డాక్టర్‌ ‌శ్రవణ్‌కుమార్‌కు లేఖ రాసింది. కరోనా వైరస్‌ అత్యంత త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున గాంధీ ఆసుపత్రికి సమీపంలోనే ఉన్న పద్మారావునగర్‌ ‌కాలనీ వాసులకు ఇది సోకే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, గాంధీ ఆసుపత్రికి చెందిన జూడాలు సైతం కరోనా వార్డును నగర శివార్లకు తరలించాలని శ్రవణ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ వైరస్‌ ‌సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గాంధీ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య చికిత్సలు అందించడం తమకు కష్టంగా ఉందనీ, అందువల్ల కరోనా వార్డును గాంధీ ఆసుపత్రిని ఇక్కడి నుంచి తరలించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy