Take a fresh look at your lifestyle.

అధ్యక్ష పదవికోసం అధిష్టానం వద్ద క్యూ

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక• పదవి కోసం స్థానిక కాంగ్రెస్‌ ‌నాయకులంతా అధిష్టానం వద్ద క్యూ కడుతున్నారు. గత కొంతకాలంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో తీవ్ర కసరత్తు జరుగుతోంది. గడచిన అయిదారేళ్ళుగా రాష్ట్రంలో జరుగుతూ వొస్తున్న వివిధ ఎన్నికల్లో వరుసగా పరాభవాన్ని మూటగట్టుకుంటున్న కాంగ్రెస్‌ ‌పార్టీకి ఇప్పుడు నూతన అధ్యక్షుడి ఎంపిక కూడా సవాల్‌గా మారింది. కాంగ్రెస్‌ ‌పార్టీలో స్వేచ్ఛ ఎక్కువే అన్నది గతం నుండీ వినిపిస్తున్నదే. పార్టీని వొదిలి పోయినవారు పోగా ఇప్పుడు పార్టీలో ఉన్నవారంతా ఒక విధంగా దిగ్గజాలు కావడంతో అధ్యక్ష స్థానానికి ఎంపిక చేసుకోవడం అధిష్టానానికి పెద్ద భారంగానే మారింది. తాజాగా రాష్ట్ర రాజధానిలో జరిగిన జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో ఆ పార్టీ మూడవ స్థానానికి చేరుకోవడంతో ఉత్తమకుమార్‌రెడ్డి తన టిపిసిసి పదవికి రాజీనామా చేయడమే కాకుండా త్వరలో మరో నాయకుడికి బాధ్యతలు అప్పగించాల్సిందిగా అధిష్టానాన్ని కోరడంతో ఇప్పుడీ ఎంపిక అనివార్యంగా మారింది. దేశ వ్యాప్తంగా మారిన కాంగ్రెస్‌ ‌పరిస్థితిలాగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ ‌కొడిగట్టింది. అందుకు ప్రత్యేకంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని వేలెత్తి చూపాల్సింది లేదు.

కాని, యువనాయకుడికి పార్టీ పగ్గాలు ఇస్తే పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారన్న ఆశాభావంలో అధిష్టానముంది. అయితే వివిధ కులాలు, వర్గాలను సమన్వయపర్చే నాయకుడెవరన్న విషయంలోనే పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణికం టాగూర్‌ ‌కొద్ది రోజులుగా రాష్ట్ర రాజధానిలో తిష్ట వేసి మాజీ మంత్రులు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు, వివిధ జిల్లాల అధ్యక్షులతో చర్చించి అభిప్రాయాలను సేకరించారు. ఈ సమాచారమంతా అధిష్టానానికి అందజేసి త్వరలోనే అధ్యక్షుడి పేరు ప్రకటిస్తామని ఆయన చెప్పాడు. నూతన సంవత్సరంలో నూతనాధ్యక్షుడి ప్రకటన వెలువడే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. అయితే ఈలోగానే తమ సమర్థతను అధిష్టానం ముందుంచి ఆ పదవిని దక్కించుకునేందుకు రాష్ట్ర నాయకులు అప్పుడే ఢిల్లీ బాట పట్టారు. ఒకరు, ఇద్దరు ఇలా ఒక్కొక్కరు ఢిల్లీ చేరుకుంటుండంతో అధిష్టానం కూడా ఎప్పటిలాగానే చిరాకు పడుతోంది. తాము పిలిస్తే తప్ప ఎవరూ ఢిల్లీకి రావొద్దని హెచ్చరించింది. ఇప్పటికే ఆ పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి అటు సోనియాగాంధీని, ఇటు రాహుల్‌గాంధీని కలిసి తమకాపదవిని కట్టబెడితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకు వొస్తామంటూ ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ పదవిని రెడ్లకు కట్టబెడుతారా లేక రెడ్డి ఏతర నాయకులకు అప్పగిస్తారా అన్న చర్చ కూడా బాగానే జరుగుతుంది.

రాష్ట్ర వోటర్ల సంఖ్యను పరిశీలిస్తే రెడ్ల సంఖ్య తక్కువే ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్‌లో రెడ్లు బలమైన నాయకత్వంలో ఉన్నారు. ఇప్పుడు అధ్యక్ష పదవికి తీవ్రంగా పోటీ పడుతున్నవారిలో కూడా రెడ్లే ఎక్కువ కావడం గమనార్హం. ఇప్పటికే ఢిల్లీ ప్రయాణమై వెళ్ళిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ ‌రెడ్డితోపాటు సీనియర్‌ ‌నాయకుడు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, జగ్గారెడ్డి నాయకులు ఆశావహులుగానే ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌విజయం సాధిస్తే కాబోయే ముఖ్యమంత్రిని తానేనని ఇప్పటికే ప్రకటించిన జానారెడ్డి చాలాకాలంగా తానే అ పదవికి అర్హుడినని వివిధ సందర్భాల్లో పేర్కొంటున్న విషయం తెలియంది కాదు. హోమ్‌ ‌శాఖ మాజీ మంత్రిగా ఒక వెలుగు వెలిగిన జానారెడ్డి పార్టీలో ప్రస్తుతమున్న నాయకుల్లో చాలా సీనియర్‌ ‌కూడా. అంతేకాక పార్టీలో వివాదరహితుడిగా ఆయనకు పేరుంది. అయితే గత శాసనసభలో సిఎల్‌పి లీడర్‌గా ఆయన అధికార టిఆర్‌ఎస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోయాడన్న అపవాదు ఉంది. అలాంటిది క్షీణదశలో ఉన్నపార్టీకి పునర్‌ ‌వైభవాన్ని కలిగించడంతోపాటు, టిఆర్‌ఎస్‌ను మట్టికరిపించగలడన్న అనుమానాన్ని పార్టీ వర్గాలు వ్యక్తపరుస్తున్నాయి. ఈ పదవికోసం తీక్షణంగా పోటీ పడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా సీనియరే. తెలంగాణ కోసం తన మంత్రి పదవిని వదిలిపెట్టిన వ్యక్తిగా ఆయనకు పేరుంది.

- Advertisement -

ప్రస్తుతం ఆయన లోకసభ సభ్యుడైనప్పటికీ నాలుగుసార్లు ఎంఎల్‌ఏగా గెలిచిన రికార్డుంది. కాంగ్రెస్‌లోనే పుట్టిపెరిగిన వ్యక్తి. ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌కాంగ్రెస్‌ ‌నుంచి ఎదిగిన వ్యక్తి. తన నియోజకవర్గంలో మంచి పట్టున్న వ్యక్తి. వాస్తవంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ‌చాలాకాలంగా తమలో ఎవరికి అవకాశమిచ్చినా కాంగ్రెస్‌కు భవిష్యత్‌ను చూపిస్తామంటూ చెబుతూ వొస్తున్నారు. అంతే తీవ్రంగా ప్రయత్నిస్తున్న వ్యక్తి ప్రస్తుతం పార్లమెంట్‌ ‌సభ్యుడిగా కొనసాగుతున్న రేవంత్‌రెడ్డి. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేపథ్యం నుండి టిఆర్‌ఎస్‌, ‌టిడిపి నుండి కాంగ్రెస్‌కు వొచ్చిన వ్యక్తి. కాంగ్రెస్‌ ‌క్షీణ దశలో ఉన్నప్పటికీ ఆ పార్టీలో ఆయన చేరడం వల్ల పార్టీలోని యువకులకు కొత్త ఊపునిచ్చిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. తెలుగుదేశం పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి మారే క్రమంలోనే గౌరవప్రదమైన పదవుల హామీపై వొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాక టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌, ఆయన కుటుంబ సభ్యుల అక్రమాలను ఎండగట్టడంలో ధీటైన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అయితే అవి వోట్ల రూపంలో కాంగ్రెస్‌కు లబ్దిని చేకూర్చలేకపోయాయన్న వాదన కూడా లేకపోలేదు.

ఎందుకంటే రేవంత్‌రెడ్డి స్వంత నియోజకవర్గాన్ని కోల్పోవడం, తాజాగా జరిగిన జీహెచ్‌ఎం‌సీలో ఆయన ప్రభావం పెద్దగా కనిపించకపోవడం ఒక కారణంగా చెబుతున్నారు. అంతేకాకుండా కొత్తగా ఇతర పార్టీనుంచి వొచ్చిన వ్యక్తికి అధ్యక్ష పదవి కట్టబెడితే తాము పార్టీ వీడిపోతామని సీనియర్లు బెదిరిస్తున్నారు. కాగా జగ్గారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి లాంటివార్ల పేర్లు కూడా ఈ వరుసలో ఉన్నాయి. ఇక రెడ్డి ఏతరుల్లో మల్లు భట్టివిక్రమార్క ముందువరులో ఉన్నారు. ప్రస్తుత శాసనసభలో సిఎల్‌పి లీడర్‌గా ఉన్న భట్టి ఇప్పటికే పార్టీ పరంగా అనేక పదవులు నిర్వహించిన వ్యక్తి. అయితే అయనకు పదవిని కట్టబెడితే అన్ని వర్గాలవారిని ఏకతాటిపై నడిపించగలడానని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ పదవిని అలంకరించిన వి హనుమంతరావు, పొన్నం ప్రభాకర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే త్వరలో వరంగల్‌, ‌ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలతో పాటు, నాగార్జునసాగర్‌ ‌శాసనసభ ఉప ఎన్నికల జరుగనుండడంతో అధికార టిఆర్‌ఎస్‌ను, దూసుకువొస్తున్న బిజెపిని ధీటుగా ఎదుర్కునే సత్తాగల వ్యక్తి అన్వేషణలో అధిష్టానం కుస్తీపడుతున్నట్లు తెలుస్తున్నది.

మండువ రవీందర్‌రావు

Leave a Reply