Take a fresh look at your lifestyle.

భావి సిఎంపై ఊహాగానాలు

telangana, cm kcr,ktr

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దెపై కెసిఆర్‌ ‌వారసుడిగా కెటిఆర్‌ ‌త్వరలో ఆసీనుడు కానున్నాడా? ఇదే అంశం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సాక్షాత్తు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇప్పటికే స్పష్టత ఇచ్చినప్పటికీ క్యాబినెట్‌ ‌మంత్రులు రోజుకొకరు చొప్పున ఈ అంశాన్ని లెవనెత్తి చర్చకు అవకాశం ఇస్తుండడంతో, నిప్పులేనిదే పొగరాదన్నట్లు అంతర్ఘతంగా ఏదో జరుగుతున్నదన్న అభిప్రాయాలు మాత్రం సర్వత్రా వినిపిస్తున్నాయి. గత ఎన్నికలనుండీ అడపాతడపా ఇదే అంశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నలుగుతూనే ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తి విమర్శనాస్త్రాలను సందించడం చూస్తూనే ఉన్నాం. ప్రతిపక్షాలకు చెక్‌ ‌పెడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌సాక్షాత్తు అసెంబ్లీలోనే దీనిపై సుదీర్ఘంగా వివరణ కూడా ఇచ్చాడు. తాను సంపూర్ణంగా అరోగ్యంగానే ఉన్నానని, మరో దశాబ్దకాలం తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పుకొచ్చారు. అయినా దీనిపై చర్చోపచర్చలు జరుగుతుండడంతో కెసిఆర్‌ ‌తనయుడు, ప్రస్తుత మంత్రి, పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌కూడా ఆయిన  కల్వకుంట్ల తారకరామారావు కూడా పలు సభలు, సమావేశాల్లో తాను సిఎం రేసులో లేనని, కెసిఆర్‌ ‌మరో అయిదేళ్ళు అధికారంలో కొనసాగుతారని పదేపదే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా త్వరలోనే యువరాజుకు పట్టాభిషేకం జరిగే అవకాశాలున్నట్లు గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై మంత్రులు స్పందిస్తున్న తీరు కూడా ఈ ఊహాగానాలకు మరింత ఊతాన్నిచ్చేవిగా ఉన్నాయి. తాజాగా జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశంలో ఈ విషయంలోనే  ప్రధాన చర్చ జరిగిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవలనే పంచాయితీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ విషయంపై బాహాటంగానే మాట్లాడారు.

కెసిఆర్‌ ‌తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు కెటిఆర్‌కు మాత్రమే ఉన్నాయని పబ్లిక్‌గానే చెప్పడాన్ని బట్టిచూస్తే కెటిఆర్‌కు బాద్యతలను అప్పగించే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే డైనమిక్‌ ‌లీడర్‌గా కెటిఆర్‌ ‌పేరు తెచ్చుకున్నాడని, ఇప్పుడు పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌గా పార్టీపైన కూడా ఆయనకు మంచి పట్టు ఉండడం కూడా అర్హతకు మరోకారణంగా ఆయన పేర్కొన్నారు.  అంతటితో అగకుండా  కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీ చేసిన తప్పిదాన్ని తాను చేయనన్న అభిప్రాయంలో కెసిఆర్‌ ఉన్నట్లు ఆయన మాటల్లో అర్థమవుతోంది. రాహుల్‌ను యూపిఏ-1 లోనే మంత్రిగా చేసి ఉంటే, యుపి-2లో ఆయన ప్రధాని అయ్యేవాడన్న ఉదాహరణను ఆయన చెప్పడం దీన్ని మరింత బలపరుస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా,  మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌కూడా ఇదే విషయం స్పందించడం చూస్తుంటే కెటిఆర్‌ను సిఎం చేసేందుకు కెసిఆర్‌ ‌చకచకా పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది.  కెసిఆర్‌ ‌ముఖ్యమంత్రిగా చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలనైతేనేమీ, రాష్ట్ర అబివృద్ధి విషయంలో తీసుకుంటున్న చర్యలైతేనేమీ అన్నిటిలో కెటిఆర్‌ ‌తన భాగస్వామ్యాన్ని నిలుపుతూ, దేశంలోనే తెలంగాణను ముందునిలిపడంలో ఆయన పాత్రను కొనియాడుతూ తండ్రికి తగిన తనయుడంటూ, అలాంటి యువనాయకుడు రాష్ట్రానికి సారథ్యం వహించడం సంతోషదాయకమంటూ తన మనస్సులోని మాటను బయటపెట్టాడు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల నాటికి కెసిఆర్‌ ‌దేశ రాజకీయాలపై దృష్టిని సారించిన విషయం తెలిసిందే. తాను దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి కృషి చేయనున్నట్లు ప్రకటించడంతో ఇక కెసిఆర్‌ ‌కేంద్ర రాజకీయాల్లో బిజీ అయిపోతారని,  ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ‌ద్వారా కెసిఆర్‌ ‌దేశ ప్రధాని కాబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో రాష్ట్ర పగ్గాలను తన కుమారుడికి అప్పగిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కాని, బిజెపి అఖండ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి రావడంతో ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ‌మాటలే కుండా పోయింది. బిజెపి, కాంగ్రెస్‌ ‌మినహా ఏర్పాటు చేయాలనుకున్న ఫెడరల్‌ ‌ఫ్రంట్‌కు ఆదిలోనే దెబ్బతగలినప్పటికీ రాష్ట్రంలో మాత్రం టిఆర్‌ఎస్‌ ‌తన అధికారాన్ని నిలుపుకుంది. గత రాజకీయాలను విశ్లేషించుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా రెండు సార్లకు మించి అధికారంలో వరుసగా కొనసాగడమన్నది అరుదు. అలాగే రెండవసారి అధికారంలోకి టిఆర్‌ఎస్‌ ‌వొచ్చినప్పటికీ ప్రజలు మార్పును కోరుకునే అవకాశాలుంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని నాయకత్వ మార్పిడి ద్వారా మరికొంతకాలం ప్రజల్లో అసంతృప్తి ప్రబలకుండా పార్టీని కాపాడుకోవచ్చన అలోచన ఒకటికాగా,, ప్రస్తుతం టిఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో మంచి పట్టు ఉంది. యువరాజు పట్టాభిషేకానికి ఇదే మంచి అవకాశంగా అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను కాంగ్రెస్‌, ‌బిజెపిలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మెజార్టీ స్థానాలను సంపాదించుకునేందుకు మంత్రులు, ఎంఎల్‌ఏలకు బాధ్యతలను అప్పగించింది. అభ్యర్థులను గెలిపించడంలో ఎవరు ఫెయిల్‌ అయితే వారి పదవులుండవని సిఎం హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే అధిక స్థానాలను టిఆర్‌ఎస్‌ ‌సాధించుకుంటుందని సర్వేలు కూడా తేల్చినట్లు ఆయనే చెపారు. అదే జరిగితే సరిపైన సమయంగా భావించి కెసిఆర్‌ ‌పట్టాభిషేకం ప్రకటన చేయవచ్చని కూడా భావిస్తున్నారు.

Tags:-telangana, cm kcr,ktr

Leave a Reply