Take a fresh look at your lifestyle.

నేడు తెలంగాణ కేబినేట్‌ ‌భేటీ

  • లాక్‌డౌన్‌ ‌పొడిగింపు, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్‌ ‌వ్యూహంపై చర్చ

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ ‌పూర్వాపరాలపై చర్చించేందుకు తెలంగాణ కేబినేట్‌ ‌ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నది. శనివారం మద్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ ‌ప్రత్యేక సమావేశం జరుగుతుంది. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి, దాని వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ఈ కేబినెట్‌ ‌సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ ‌ఫలితాలను ప్రత్యేకంగా చర్చించనున్నారు. లాక్‌డౌన్‌కు ముందు, తరవాత పరిస్థితులను సక్షించ నున్నారు. అలాగే కొత్త కేసులు, తబ్లిగి ఎఫెక్ట్ ‌తరవాత జరిగిన పరిణామాలను కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు లాక్‌డౌన్‌ ‌పొడిగించాలని సిఎం కెసిఆర్‌ ఇప్పటికే ప్రతిపాదించారు. తెలంగాణలో కొత్తగా 18 పాజిటీవ్‌ ‌కేసులు నమోదయ్యాయి. దీంతో రోగుల సంఖ్య 471కి చేరింది. బాధితుల్లో 388 మంది మర్కజ్‌కు వెళ్లివచ్చినవారు ఉన్నారని, వారితో కలిసినవారు కూడా ఉన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటీవ్‌గా తేలి చికిత్స పొందుతున్నవారంతా ఈనెల 24వ తేదీకల్లా కోలుకుంటారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌చెప్పారు.

మర్కజ్‌ ‌కేసులు లేకుంటే.. ఇప్పటికే తెలంగాణ కరోనా రహితం అయ్యేదని అన్నారు. శుక్రవారం నుంచి కేసులు తగ్గుముఖం పడతాయని 4,5 రోజుల తర్వాత అసలు ఉండవని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా తెలంగాణలో కరోనాతో ఇంత వరకు 12 మంది చనిపోయారు. 45 మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్‌లోని గాంధీ, కింగ్‌ ‌కోటి ఆస్పత్రిలో 414 మంది చికిత్స పొందుతున్నారు. మర్కజ్‌ ‌లింకు ఉన్నవాళ్లలో శుక్రవారం 60 నుంచి 70 మంది డిశ్చార్జ్ ‌కానున్నారు. శనివారం ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ ‌తర్వాత లాక్‌ ‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ ‌స్పష్టత ఇస్తారని మంత్రి తెలిపారు.ఈ క్రమంలో లాక్‌డౌన్‌ ‌పొడిగించే అంశం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్‌ ‌వ్యూహ రూపకల్పన, రాష్టంలోని పేదలు, ఇతర రాష్టాల్రనుంచి వలస వచ్చిన కార్మికులకు అందుతున్న సాయం, మామిడి, బత్తాయి పండ్ల మార్కెట్లు, వ్యవసాయ కొనుగోళ్లు, వడగండ్ల వాన నష్టం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అనూహ్యంగా కూలీల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. అలాగే వడగంఢ్లతో పలుచోట్ల వరి,మిర్చి, మామిడి, మక్కజొన్న దెబ్బతిన్నది. మరోవైపు ధాన్యం సేకరణ సాగుతోంది. లాక్‌డౌన్‌ ‌కొనసాగుతున్న వేళ ధాన్యం సేకరణ సాఫీగా సాగేలా చూడాల్సి ఉంది. అలాగే ధాన్యం సేకరణకు గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉంది. వీటన్నింటిన అధిగమించేలా కర్యాచరణ రూపొందించాల్స ఉంది.

Leave a Reply