- బడ్జెట్ రూపకల్పలపై శాఖలవారీగా అందని నివేదికలు
- ప్రాధాన్య శాఖలకు నిధుల కేటాయింపుపై సీఎందే నిర్ణయం
- ఈనెల తొలి వారంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశం
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 17 తరువాతనే జరుగనున్నాయి. బడ్జెట్ సమావేశాల తేదీని శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. 2021 22 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తు ఇదివరకే ప్రారంభించినప్పటికీ ఇంకా తుది దశకు చేరుకోలేదు. ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలను దృష్టిలో ఉంచుకుని ఆయా శాఖలకు నిధుల కేటాయింపులపై సీఎం కేసీఆర్ స్వయంగా నిర్ణయం తీసుకుంటారనీ, ఆ తరువాతనే శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు సంబంధించి నిధుల కేటాయింపునకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆన్ని శాఖల అధిపతులకు సీఎస్ సోమేశ్ కుమార్ గత నెలలోనే ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ రూపకల్పలపై సీఎంకు ఇంకా తుది నివేదికలు అందలేదు. సీఎం కేసీఆర్ సైతం ప్రాథమిక స్థాయిలో చర్చించి ఆయా శాఖలకు దిశా నిర్దేశం చేశారు. అయితే, ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈనెల 14న రెండు మండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని 20 జిల్లాలలో పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులతో పార్టీ అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన వెంటనే సీఎం కేసీఆర్ శాఖల వారీగా వరుస సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌కు తుది రూపు ఇవ్వనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలను దృష్టిలో ఉంచుకుని ఆయా శాఖలకు జరపాల్సిన కేటాయింపులపై స్వయంగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లు మార్చి 31లోగా ఉభయ సభలలో తప్పనిసరిగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. దీంతో ఈసారి బడ్జెట్ సమావేశాలు కేవలం 13 రోజులు పాలు మాత్రమే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో పాటు పోలీసు సిబ్బంది లభ్యత, సెలవులు తదితర విషయాలను పరిగణనలోనికి తీసుకుని బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంతో పాటు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను ఈనెల మొదటి వారంలో ఖరారు చేసే అవకాశం ఉందని తెలిసింది.