వైరస్ కట్టడి చర్యలు వేగవంతం
హాస్పటిల్‌లో వైద్య సేవలపై సిఎం కెసిఆర్ దృష్టి
వరుసగా రెండోరోజూ ఉన్నతస్థాయి సమీక్ష
సరిహద్దుల్లో అంబులనెన్సులను వెనక్కి పంపిన పోలీసులు
మహారాష్ట్ర నిజామాబాద్ సరిహద్దుల మూసేసి చెకింగ్
ఆదివారం సుదీర్ఘంగా తెలంగాణలో కొరోనా కట్టడికి చర్చించిన సిఎం హాస్పిటల్లు, కొరోనా చికిత్సలపై ఆరా తీసారు.కొరోనా నివారణకు అధికారులకు తగు సూచనలు చేశారు. సోమవారం మరోమారు కొరోనాపై మరోసారి సమీక్ష చేపట్టారు. ఆదివారం దాదాపు అర్ధరాత్రి వరకు సమీ క్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… సోమవారం మరోసారి కొరోనా పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలు సేకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణీతో పాటు పరీక్షల సంఖ్య పెంచడం, అలాగే ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్లో బెడ్ల కొరతపై సమీక్ష చేయనున్నారు. కాగా ఆక్సిజన్ల సమస్యతోపాటు రెమిడెసివియర్ ఇంజక్షన్ల సరఫరాపై ప్రధాని మోదీ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకువెళ్లారు. అలాగే తెలంగాణలో చేపట్టనున్న అనేక కార్యక్రమాల వివరాలను ప్రధానికి వివరించారు. ఇకపోతే కొరోనా కట్టడిలో భాగంగా సరిహద్దులను మూసేస్తున్నారు.
ఎపితో పాటు, మహారాష్ట్ర సరిహద్దలును మూసేసారు. మహారాష్ట్ర- తెలంగాణ అంతర్రాష్ట్ర రహదారిని తెలంగాణ పోలీసులు సోమవారం మూసివేశారు. కామారెడ్డి జిల్లా సలాబత్పూర్ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు తెలంగాణలోకి రాకుండా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెనక్కు పంపారు. మహారాష్ట్రలో కొరోనా కేసులు తీవ్రంగా ఉండటంతో ఆ రాష్ట్రం నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలను నియంత్రిం చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కొరోనా కట్టడికి వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లఘించి సరిహద్దు దాటేందుకు యత్నిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే ఏపీ-తెలంగాణ సరిహద్దుల వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధించారు.
ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. హాస్పిటల్ అనుమతి పత్రాలు తప్పనిసరి అని తెలంగాణ పోలీసులు అంటున్నారు. తెలంగాణలోకి వెళ్తున్న కోవిడ్ బాధితుల అనుమతిపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. తెలంగాణలో హాస్పిటల్లో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్స్‌లకు అనుమతి ఇస్తున్నారు. సాధారణ ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నారు.ఇకపోతే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు బెంగుళూరు హైవేపై పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద ఆంక్షలు విధించారు. ఇతర రాష్ట్రాల అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు.
తెలంగాణలో ఆక్సిజన్, బెడ్స్ కొరత కారణంగా ఇతర రాష్ట్రాల రోగులకు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో కొవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్ నిలిపేయడంతో అవస్థలు పడాల్సి వస్తోంది. కడప జిల్లా మైదుకూరు నుంచి హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌కి అంబులెన్స్‌లో ఓ కొరోనా బాధితుడిని తరలిస్తుండగా.. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు తెలంగాణలోకి రాయనీకుండా ఆపేశారు. అంబులెన్స్‌లోని కరోనా బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక అంబులెన్స్‌ను వెనక్కి తీసుకెళ్లారు.